అందం..అభినయం..ఆమె సొంతం

– ఏప్రిల్3 జయప్రధ పుట్టినరోజు

Jaya-Prada

అందానికే అసూయ పుట్టే అందం జయప్రదది. భూమికోసం చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన తార. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో కనువిందు చేసిన సొగసరి. తన అందానికి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి మన్ననలు అందుకున్న నటి.,అందాల తార జయప్రద పుట్టినరోజు నేడు .

తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ భారతాన్ని తన అందంతో ప్రేక్షక ‘సింహాసనం’ అధిష్ఠించిన అతి కొద్ది నటీమణుల్లో ఆమె ఒకరు. అందానికి అసలైన చిరునామా ఆమెనే అని సత్యజిత్ రేచే ప్రశంసల జల్లు అందుకున్న నటి. ఆమే ఇండియన్ సెల్యులాయిడ్ బ్యూటీ జయప్రద.

పాత్ర ఏదైనా.. అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. తెరపై ఆమె కనబడినపుడు పాత్ర కనబడుతుంది anthuleni-kathaకానీ నటి కనిపించదు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. అంతే కాకుండా అడవిరాముడు, ఊరికి మొనగాడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సీతా కల్యాణం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లాంటి పౌరాణిక పాత్రలతో సీత , పద్మావతిగా ప్రేక్షకాభిమానం పొందింది. సింహాసనం, రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానుల మందార మాలలు అందుకుంది.

చాలా మంది నటీమణుల్లాగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యంది జయప్రద. జయప్రద అసలు పేరు లలితా రాణి. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించింది. చిన్నప్పుడే తల్లి తండ్రుల ప్రోత్సాహంతో సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకుంది జయప్రద. ఒకసారి పాఠశాల వార్షికోత్సంలో జయప్రద నృత్య ప్రదర్శన చూసి, ముగ్దుడైన ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి తను నటించే భూమికోసం చిత్రంలో చిన్న వేషం ఇప్పించాడు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘జయప్రద ఫిలింస్’ బ్యానర్ పేరే ఆమెకు పెట్టాడు దర్శకుడు తిలక్. అప్పటినుంచి లలితా రాణి కాస్తా జయప్రద గా మారింది. అలా మొదలైన ఆమె సినీ కెరీర్ ఎనిమిది భాషల్లో 300 చిత్రాలకు పైగా కొనసాగుతునే ఉంది.

నటిగా అడుగులేస్తున్న తొలి రోజుల్లోనే కె.బాలచందర్, కె.విశ్వనాథ్ వంటి గ్రేట్ డైరెక్టర్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. అదే ఆ తరువాత రోజుల్లో జయప్రదకు అధ్బుత నటిగా పేరు సంపాదించి పెట్టింది. ఆ కోవలో కె.బాలచందర్ తీసిన అంతులేని కథ ఆమె నట జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని చెప్పాలి. కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగే అన్నకు చెల్లిగా…..తన కుటుంబం బాధ్యతల కోసం పెళ్లిచేసుకోని యువతి పాత్రలో అద్భుత అభినయాన్ని కనబరిచింది జయప్రద.

siri muvvaకె.విశ్వనాథ్ తీసిన సిరిసిరి మువ్వ చిత్రంలో మూగ నృత్య కళాకారిణిగా…. అద్భుతమైన మూగాభినయం చేసి అలరించింది జయప్రద. కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు, కె.వి.మహదేవన్ సంగీతానికి జయప్రద నటన తోడై ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో నటించిన, సాగర సంగమం కళాత్మక చిత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో జయప్రద కమల్ తో పోటి పడి మరీ నటించింది. ఈ మూవీలో జయప్రద నటన చూసిన వారికి కన్నీరు పెట్టిస్తుంది.

తెలుగులో దాదాపు అప్పటి అగ్ర కథానాయకులందరితో కలిసి నటించింది జయప్రద. ముఖ్యంగా ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ అదుర్స్ అనేంతగా మాస్ ప్రేక్షక నీరాజనం అందుకుంది. వీరద్దరు కలిసి నటించిన అడవిరాముడు బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ చిత్రంలో ‘ఆరేసు కోబోయి పారేసుకున్నాను’ పాట ఇప్పటికి మాస్ పాటలలో మేటిగా నిలిచింది.

ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన యమగోల ప్రేక్షకుల చేత ఈల వేసేలా చేసింది. ఈ మూవీలో sagara_sangamamఎన్టీఆర్ తో జయప్రద వేసిన స్టెప్పులు తిక్కరేగేలా వుంటాయి.. ఆ తర్వాత ఏఎన్నార్ తో కలిసి నటించిన మేఘసందేశం చిత్రంలో ఆమె పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు ప్రియురాలిగా ఆమె నటనాట్యాభినయాలు నభూతో అనాల్సిందే.

జానపద చిత్రాల విషయానికొస్తే ఎన్టీఆర్ తో చేసిన రాజపుత్ర రహస్యం… కృష్ణ తో చేసిన సింహాసనం సినిమాలను గురించి చెప్పుకోవాలి. రాజసం ఉట్టిపడే రాకుమారి పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికి ప్రేక్షకులను మైమరిపిస్తూనే వున్నాయి. జయప్రద హీరో కృష్ణ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించింది. వీరద్దరు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నుంచి.. నిన్న మొన్నటి చంద్రవంశం వరకు దాదాపు నలబై చిత్రాలకు పైగా నటించారు.

‘సీతా కల్యాణం’ మూవీ జయప్రద కెరీర్ లో గుర్తిండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. బాపు బొమ్మగా సీత పాత్రలో అధ్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తరువాత ఎన్టీఆర్.. తిరుపతి వేంకటేశ్వర కల్యాణం సినిమాలో పద్మావతిగా నటించి మెప్పించింది. శోభన్‌ బాబుతో జయప్రదది సెపరేట్ కెమిస్ట్రీ. వీరిద్దరు ‘స్వయంవరం’, రాధాకృష్ణ’, దేవత వంటి పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. కృష్ణంరాజుతో నటించిన తాండ్ర పాపారాయుడు,రంగూన్ రౌడీ, సీతారాములు వంటి పలు చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల మన్ననలు పొందింది జయప్రద.

ఎన్టీఆర్, కృష్ణ తరువాతి తరం స్టార్లలో మెగాస్టార్ చిరంజీవితో సైతం జయప్రద కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో చండీప్రియ,47 రోజులు, వేట చెప్పుకోదగినవి.

Politics jayaకె.విశ్వనాథ్ సర్గమ్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అక్కడా జయకేతనం ఎగుర వేసింది జయప్రద. తెలుగులో వచ్చిన సిరిసిరిమువ్వకు సర్గమ్ రీమేక్. ఆ తరువాత అమితాబ్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి అగ్రనటులతో నటించి అక్కడ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఎనిమిది భాషల్లో తన నటతో అందరిని ముగ్దులను చేసింది జయప్రద. హిందీలో జితేంద్రతో ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన జయప్రద సినీ రంగంలోనే కాకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో అడుగు పెట్టి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది జయప్రద. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాంపూర్ లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయి అమర్ సింగ్ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. గత ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయి రామ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకాభిమానం అందుకుంది జయప్రద. నటిగా కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా సక్సెస్ సాధించింది. ఇలా వెండితెరపై కాకుండా రాజకీయ యవనికపై రాణిస్తున్న జయప్రదకు మరోక్క సారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.

Send a Comment

Your email address will not be published.