అందం ఓ ఆలయం

ఒక రోజు సోక్రటీస్ రావాల్సిన సమయానికి ఇంటికి రాలేదు.
ఆయన భార్య కంగారుపడింది.
ఇరుగుపొరుగు వాళ్ళు ఏమైందో అని కంగారుపడ్డారు.
వారిలో కొందరు సోక్రటీస్ ని వెతకడం కోసం వెళ్ళారు. అటూ ఇటూ అక్కడా ఇక్కడా వెతికారు. ఆయన చదువు చెప్పే స్కూల్ నుంచి నేరుగా ఇంటికే వస్తారు తప్ప మరెక్కడికీ వెళ్ళరు.
మంచు పడుతోంది. .
“ఆయన అడవిలో ఎక్కడైనా దారి తప్పేరా?” అనే సందేహం కలిగింది.
చివరికి ఆయనను తెల్లవారిన తర్వాత ఒక చెట్టు కింద చూశారు.
ఆయన చెట్టుకి ఆనుకుని ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నారు. మంచు దట్టంగా ఉంది.
ఆయన ఆచూకీకోసం తరుగుతున్న వాళ్ళు మొత్తానికి సోక్రటీస్ ని కనిపెట్టి దగ్గరకు వెళ్లి పిలిచారు.
“ఇక్కడేం చేస్తున్నారు” అని అడిగారు.
అప్పుడు ఆయన “నేను ఏం చేస్తున్నానా? రాత్రినీ, నక్షత్రాలనూ చూసి ఆస్వాదిస్తున్నాను. అరెరె ఈ రాత్రి ఎంత అందమైనదో..? ఆ అందాన్ని ఎలా మాటల్లో చెప్పాలో తెలియడం లేదు. ఒక్కో నక్షత్రం ఒక్కో అందం. చూసే కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తోంది తప్ప విసుగుపుట్టలేదు. ఆ అందాన్ని చూడటంలో మమేకమైన నాకు రాత్రి ఎలా గడిచిందో… నేను ఎక్కడ ఉన్నానో … అనేది తెలియనే లేదు. అసలు ఆ ధ్యాసే రాలేదు. మంచు వర్షం కురుస్తున్న విషయమూ పట్ట లేదు…” అన్నారు.

ఆయన మాటలు చెప్తుంటే అందరూ సోక్రటీస్ ని పిచ్చివాడిగానే అనుకున్నారు. ఆయన మాటలు చదివిన వారూ అలాగే అనుకున్నారు.

కానీ సోక్రటీస్ ఓ జ్ఞాని. అందాన్ని ఆస్వాదించడానికి ఓ జ్ఞానం కావాలి. అందాన్ని ఆస్వాదించడం తెలిస్తే జ్ఞానం పుడుతుంది.
రోజూ రాత్రి వస్తోంది. నక్షత్రాలు వస్తున్నాయి.
కానీ ఎందరు వాటిని చూసి ఆస్వాదిస్తున్నారు?
ఒక్కో రాత్రి తనను ఓ నవ వధువులా అలంకరించుకుని నక్షత్ర పువ్వులు సిగలో తురుముకుని మనకోసం ఎదురుచూస్తుంది.
కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసు?
మనలో చాలామంది కళ్ళుండీ చూడకుండా అందాన్ని ఆస్వాదించడం కోల్పోతున్నాం. అందాన్ని చూడని కళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అందాన్ని ఆస్వాదించని వ్యక్తి వ్యక్తే కాదు. మృగాలు అందాన్ని ఆస్వాదించవు.
ముద్దు ఇచ్చేవా అని సిగ్గుతో పిలిచే పెదవులలా వికసించే పువ్వులు…
ఆకాశం వర్ణాలతో రాసిన ప్రేమ లేఖలా అనిపిస్తుంది హరివిల్లుని చూసినప్పుడు.
తన లోతుల్లోని రహస్యాలను కెరటాల పెదవులతో సముద్రం చెప్తూ ఉంటుంది. కానీ అది అర్ధమయ్యేది ఎందరికి?
ఇలాంటి వాటిని ఎందరు చూస్తున్నారు? ఆస్వాదిస్తున్నారు?
సముద్రతీరానికి వెళ్తే ఎందరు సముద్రాన్ని ఆస్వాదిస్తున్నారు?
నక్షత్రాలు తమ అందాన్ని ఉచితంగా చూపిస్తున్నాయి. కానీ చూసే మనసు ఏది?
కానీ చాలామంది ప్లానిటోరియం లకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తారు.
అందం ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది. అందుకే అందాన్ని ఆస్వాదించడం తప్పు లేదు. కానీ ఆనందాన్ని అనుభవించడానికి టైం లేదని హైరాన పడుతుంటారు ఎక్కువ శాతం మంది?
మనలో అధికశాతం మంది మట్టికి చేరువయ్యే వరకు అందాన్ని వెతుకుతుంటారు…ఉన్న అందాన్ని చూడలేక. గుర్తించలేక. అందుకు కారణం మనసు మాట వినకపోవడమే.
ఇప్పటికైనా మించిపోయింది లేదు అందాన్ని చూడటం మరచిపోకండి అని సోక్రటీస్ చెప్పినప్పుడు గానీ వాళ్ళు కళ్ళు తెరవ లేదు.

అందం ఓ ఆలయం.

– నీరజ చౌటపల్లి