కమర్షియల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకునే సాహసాన్ని మహేష్ బాబు చేస్తున్నాడు. అభిమానుల్ని సంతృప్తిపరుస్తూనే… ఏదో ఓ సమస్యని వేలెత్తి చూపిస్తున్నాడు. అందుకు తగిన పరిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మహేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి కమర్షియల్ విజయాల్ని అందుకుంటూనే మహేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి తన 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మహర్షి’గా మారాడు. హీరోయిజానికి ఎక్కడా లోటు లేకుండా చూసుకుంటూనే ఓ బర్నింగ్ పాయింట్‌ని ఎంచుకున్నాడు. ఈసారి మహర్షి లో కూడా అన్ని వర్గాలనీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు
ఇదీ కథ
రుషి కుమార్ (మహేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని బిజినెస్ మేన్. తన కష్టాన్నీ, కలల్ని, విజయానికి సోపానాలుగా మలచుకున్న వ్యక్తి. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే తన జీవితం, తన విజయాలు తనొక్కడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాలు కాదని, వాటి వెనుక తన ఇద్దరి స్నేహితుల (పూజా హెగ్డే, అల్లరి నరేష్) కష్టం, త్యాగం కూడా ఉన్నాయని గ్రహిస్తాడు. మరి ఆ స్నేహితుల కోసం రుషి ఏం చేశాడు? విజయం అంటే డబ్బు సాధించడమే, స్థాయిని పెంచుకోవడమే అనుకునే రుషి – అసలు సిసలైన విజయాన్ని ఎలా గుర్తించాడు? మహర్షిగా ఎలా మారాడు? అనేదే కథ.
ఎలా ఉందంటే:
మహేష్ 25వ సినిమా ఇది. ఓ మైలు రాయి చిత్రానికి ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో అవన్నీ జోడించి అల్లుకున్న కథలా అనిపిస్తుంది. సీఈఓగా రుషిని పరిచయం చేసే సన్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ మొదలైపోతుంది. సీఈఓగా, విద్యార్థిగా అప్పటికప్పుడు తన పాత్రలోనే రెండు వేరియేషన్స్ చూపించాడు మహేష్. కాలేజీ సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. స్నేహం, ప్రేమలాంటి ఎమోషన్స్ పండిస్తూనే విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. కాలేజీ నేపథ్యం, ముగ్గురి మధ్య స్నేహం, విద్యావ్యవస్థపై వ్యంగ్య బాణాలు ఇవన్నీ చూస్తే ‘త్రీ ఈడియట్స్’ గుర్తుకు రావడం సహజం. అయితే ఆ పోలికలు వెదికే అవకాశం ఇవ్వకుండా.. కొత్తదనం జోడించుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశాడు వంశీ పైడిపల్లి. విశ్రాంతి కి ముందు సన్నివేశాలు మెలో డ్రామా ప్రధానంగా సాగాయి. ఎమోషన్స్‌ని పండించాయి. అదే జోరు ద్వితీయార్ధంలోనూ కనిపిస్తుంది. తొలి సగంలో విద్యావ్యవస్థని ప్రశ్నించిన రుషి – ద్వితీయార్ధంలో రైతు సమస్యలపై పోరాటం చేస్తాడు. దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతుల దీనస్థితిని కళ్లకు కట్టారు. రుషి లక్ష్యం, ఆశయ సాధనకు ఎంచుకున్న మార్గం… ఆలోచనలో పడేస్తాయి. ఓ కమర్షియల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్పడానికి ప్రయత్నించడం అభినందించదగిన విషయం. కాకపోతే.. కేవలం ఒకే అంశంతో ద్వితీయార్థం మొత్తం నడిపించడం కాస్త సాగదీతగా కనిపిస్తుంది. ఇంచుమించుగా మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఇది. సన్నివేశాల్ని కుదించుకునే వీలున్నా.. ఆ దిశగా చిత్రబృందం ఆలోచించలేదు. ఈ కథకు కీలకం అనుకున్న మహేష్ – నరేష్ ఎపిసోడ్లో ఎమోషన్స్ ఇంకాస్త బాగా పండాల్సింది. పతాక సన్నివేశాల వరకూ ఎలాంటి మలుపులూ లేకుండా సాగడం, క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉన్నా, ఓ కథని నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేయడం మాత్రం అభినందించదిగిన విషయమే.
అభిమానుల్ని అలరించే ప్రయత్నం
నటుడిగా మహేష్‌కి తనలోని వైవిధ్యాన్ని చూపించుకునే అవకాశం దక్కింది. తన పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా కనిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్‌గా కనిపించిన మహేష్ – విద్యార్థిగా మాస్‌ని అలరిస్తాడు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు తనలోని సిన్సియారిటీ కనిపిస్తుంది. మహేష్ తెరపై మరింత అందంగా కనిపించాడు. తన వరకూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేశాడు. కథానాయకుడిగా సరైన విజయం అందుకుని చాలా కాలమైన అల్లరి నరేష్‌కి ఇందులో వైవిధ్యభరితమైన పాత్ర దక్కింది. కథకి మూలస్తంభంగా నిలిచాడు. ‘గమ్యం’లో గాలిశీను పాత్రలా ఇది ప్రేక్షకులకు గుర్తిండి పోతుంది. ఇలాంటి పాత్రలకు ఇకపై నరేష్ పేరుని పరిశీలించడం ఖాయం. ఇక కథానాయికగా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవలం గ్లామర్‌కే పరిమితం చేయలేదు. కథానుసారం ఆ పాత్రకూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్ సన్నివేశాల్లో చిలిపిదనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. జగపతిబాబు మరోసారి స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నారు.
నేపథ్య సంగీతం
సంగీత దర్శకుడు దేవిశ్రీ పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కసారి వినగానే ఎక్కేయవు. కానీ, స్లో పాయిజన్‌లా వినగా వినగా నచ్చుతాయి. ‘మహర్షి’ విషయంలోనూ అదే జరిగింది. థియేటర్లో ఆ పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా శ్రీమణి సాహిత్యం పాటలకు అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక నేపథ్య సంగీతంలోనూ దేవి తన మార్క్‌ను చూపించారు. సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా తీర్చిదిద్దారు దర్శక నిర్మాతలు.. ప్రతి ఫ్రేమూలోనూ ప్రేక్షకుడికి రిచ్‌నెస్ కనిపిస్తుంది. అందులో మహేష్ సినిమా కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతోంది.
సంభాషణలు సహజంగా
దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కథ బలమైనదే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్‌లాంటి అగ్రకథానాయకుడి ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది. అయితే, నిడివి విషయంలో కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే, బాగుండేది. సంభాషణలు సహజంగా ఉన్నాయి
నటీనటులు: మహేశ్‌బాబు, అల్లరి నరేష్, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేశ్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, నిర్మాత: దిల్ రాజు, సి. అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి , దర్శకత్వం: వంశీ పైడిపల్లి