అందుకోసమే నీకిది రాస్తున్నా

అమ్మలందరూ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరితే నేనేమో నీ దర్శనం కోసం బయలుదేరడం నిత్యకృత్యమైంది. దర్శనంలో ఉన్న తేడా చూసేవా…?
నిన్ను చూసిన పరవశంలో తల చుట్టడం మొదలైన భూమి ఇంకా చుడుతూనే ఉంది…అది ఆగటం, ఆపటం ఎవరి తరమూ కాదు.
పూర్తిగా నన్ను మరచి నిన్నే సదా స్మరించే నా మనసుని ఏం చెయ్యను చెప్పు…
నిన్ను చూసేందుకు బయలుదేరినప్పుడల్లా ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరు అడిగినా కోప్పడకుండా చెప్తున్నా పువ్వుల ప్రదర్శనను చూసేందుకు వెళ్తున్నానని….
ఏది చెప్పాలనుకున్నా మనసులో దాచక చెప్పమని నేను అడిగినప్పుడు నువ్వేమీ చెప్పలేదు.
ఏదైనా పరవాలేదు ధైర్యంగా చెప్పమని నువ్వు అడిగినప్పుడు నేనూ చెప్ప లేదు….
ఇద్దరం చెప్పాలనుకున్నది ఒకే విషయంగా ఉన్నట్లయితే మరొక రోజు మాట్లాడుకుందాము….
నీ పేరును చెప్పడంలో ఉంది నా పెదవుల కీర్తి.
నువ్వు ప్రేమతో నిద్రను పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నావు….
నేను నిద్రను పోగొట్టుకోవడానికి ఒక ప్రేమ లేదేనని బాధపడుతున్నాను…
మా ఇంటికి, ఎదురింటికి జరిగిన గొడవలో నన్నూ, నిన్నూ ప్రస్తావించి మాటలంటున్నప్పుడు బయటకు చూపించక లోలోపలే సంతోషపడుతుంటాను….ప్రత్యర్ధి పగను మరచిపోయి….
నిన్ను ప్రేమిస్తున్నాను అనే గొప్ప విషయం తప్ప చెప్పుకోవడానికి మరొక విషయమేదీ నా దగ్గర లేదు…
నా మనసును తీసుకోవడం కోసమే నువ్వు అందాన్ని వెంటేసుకోచ్చావు నీకు తెలియకుండానే…
నీతో ఒక్క మాటైనా మాట్లాడాలని ఒకటికి పది సార్లు ఇంట్లో అద్దం ముందు చెప్పుకున్న నేను తీరా నువ్వు కనిపించేసరికి పెదవి దాటని మాటలతో తిరిగెళ్ళిపోయిన రోజులు అనేకమున్నాయి…
నీ వెనుకే వచ్చే నన్ను నీ పక్కన నడిపించే రోజు కోసం నేను ఎంతకాలమైనా నిరీక్షిస్తాను…
నా కనులు నిన్ను చూపించమని పట్టుబట్టినప్పుడల్లా చందమామను, పువ్వును చూపించి సర్దుకోమని చెప్పడానికి నేను పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు…
ప్రేమ గురించి నేను ఏదీ తెలుసుకోలేదు కానీ నీ గురించి మాత్రం చాలానే తెలుసుకున్నాను.
నీకూ నాకూ మధ్య ఉన్నది ప్రేమ మాత్రమే అని ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నావు కదూ, కలుసుకున్నప్పుడల్లా చూపులతో చెప్పుకున్న మాటలకు మనసు వంత పాడటం నువ్వెరుగవా, నిజం చెప్పు….
నీ దగ్గర కోల్పోవడం కోసమే ఈ జన్మ ఎత్తింది నా హృదయం…
ప్రేమను దాచడం తెలియలేదు నాకు….
ప్రేమను చెప్పడం తెలియ లేదు నీకు….
తెలియడం లేదు అనే దానిలో నుంచే తెలుసుకుంటోంది ఒక మనసు మరొక మనసును…..
ఇప్పటికైనా నా ప్రేమ మనసును కట్టిపడేసి నీ పక్కనే అడుగులు వేసే భాగ్యం కలిగించు… అందుకోసమే ఈ లేఖ రాస్తున్నా నీకు…
ఇట్లు
నీ ప్రేమపదాన్ని