అక్షరం పరం’జ్యోతి’

aksharamఅక్షరమెప్పుడూ మన పక్షమేనని నమ్మి తదేక ధ్యాసతో భావి తరాలకు మాతృ భాషలోని మాధుర్యాన్ని అందివ్వాలన్న తలంపుతో షుమారు ఎనిమిదేళ్ళ క్రితం మెల్బోర్న్ లోని తెలుగు సంఘం ప్రారంభించిన “అక్షర జ్యోతి” ఇప్పుడు నింగికెగసిన తారాజువ్వలా ధవళ కాంతులు ప్రసరిస్తుంది. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు నేర్చుకోవాలన్న ఆకాంక్షతో ముందుకెళుతున్న పిల్లలందరికీ ఒక కాంతి పుంజంలా వెలుగునిస్తుంది.

గత పాతికేళ్ళుగా ఇక్కడి తెలుగు సంఘం పలుమార్లు తెలుగు బడులను ప్రారంభించి వివిధ కారణాల వలన కొనసాగించలేక ఎన్నో ఒడుదుడుకులకు లోనై ఒక వ్యవస్థాపరమైన స్థితికి చేరుకోలేక పోయింది. అయితే గత దశాబ్దంలో మెల్బోర్న్ లోని పాయింట్ కుక్ ప్రాంతంలో చాలామంది క్రొత్తగా వచ్చిన తెలుగువారు అందునా యవ్వన దశలో ఉన్న కుటుంబాలు స్థిరపడి తెలుగు భాషపైనున్న మమకారంతో తమ పిల్లలకు మన భాషను నేర్పించి వారి నోట ముద్దు ముద్దుగా ‘మమ్మీ’ కి బదులుగా అమ్మ, ‘డాడీ’ కి బదులుగా నాన్న అని పిలిపించుకోవాలన్న తపనతో కొంతమంది తెలుగు సంఘం సభ్యులు “అక్షర జ్యోతి” తెలుగుబడిని 2013 లో ప్రారంభించడం జరిగింది. మొదట రెండు శ్రేణులతో మొదలిడిన ఈ బడి ప్రస్తుతం ఐదు శ్రేణుల్లో షుమారు 50 మంది పిల్లలతో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ తరగతుల్లో ముఖ్యంగా పిల్లలకు తెలుగు మాట్లాడడం, చదవడం, వ్రాయడమే కాకుండా వారిచే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయిస్తారు. తెలుగు సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఒక రంగస్థల ప్రదర్శనకు అవకాశం ఇవ్వడం ఎంతో ముదావహం.

అయితే ‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పేరుగాంచిన మన భాష మనతోనే ఆగిపోకుండా స్థానికులకు కూడా అందివ్వాలన్న తలంపుతో విక్టోరియన్ స్కూల్ అఫ్ లాంగ్వేజ్ వారితో సంప్రదించి విక్టోరియా రాష్ట్రంలో తెలుగు భాషను అందరికీ అందుబాటుగా ఉండడానికి పధకాలు రచించి వారిచ్చే సూచనల ప్రకారం దరఖాస్తును తయారుచేసి గతవారం వారియొక్క అనుమతిని పొందడం కూడా జరిగింది. ఇది తెలుగు భాషాభిమానులకు ఎంతో శుభవార్త. తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం. దీనివలన తెలుగు భాషనూ బోధనా భాషగా విక్టిరియా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆస్ట్రేలియా దేశంలో మొట్టమొదటిసారి విక్టోరియా రాష్ట్రంలోనే తెలుగు పాఠ్యాంశముగా ప్రవేశపెట్టడం అక్షర జ్యోతి తెలుగుబడి కార్యవర్గ సభ్యులు మరియు తెలుగు సంఘం వారు చేసిన కృషికి నిదర్సనం.

ఈ నెల 15 వ తేదీ నుండి ప్రతీ శనివారం పాయింట్ కుక్ సెకండరీ కాలేజీలో ఉదయం 9 – 12:30 గంటల మధ్య తెలుగు బోధించబడుతుంది. తలిదండ్రులు తమ పిల్లల్ని ఈ బడిలో చేర్పించాలంటే తెలుగు సంఘ సభ్యులను కానీ అక్షర జ్యోతి బడి కార్యవర్గ సభ్యులను కానీ సంప్రదించవచ్చు.

Send a Comment

Your email address will not be published.