పరభాషా సంస్కృతితో సహవాసం చేస్తూ మన భాషా సాంప్రదాయాలను మరువకుండా “మన” అన్న గట్టి నమ్మకాన్ని పునాదిగా భావితరాలకు అందిస్తూ అగ్రతాంబూలాన్ని అందుకుంటున్న వారిలో అడిలైడ్ తెలంగాణా అసోసియేషన్ వారు ముందంజ వేస్తున్నారు. తెలంగాణా వాదులందరినీ ఒక త్రాటిపై తీసుకురావలసిన ఆవశ్యకతను గుర్తెరిగి ఈ సంఘం గత సంవత్సరం జూన్ రెండవ తేదీన ప్రారంభించబడింది. కాలపరిమితి ఒక ఏడాది అయినా మన సంస్కృతిని విస్తరింపజేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు.
అడిలైడ్ తెలంగాణా అసోసియేషన్ (ATA) అధ్వర్యంలో పూల పండగ బతుకమ్మను రంగ రంగ వైభోగంగా గత నెల 23వ తేదీన జరుపుకున్నారు. తెలంగాణా ఆడపడుచులు పిల్లలతో కూడి పచ్చని ప్రకృతి ఒడిలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మను భక్తీ శ్రద్ధలతో పూజించి బతుకమ్మ పాటలను పాడుతూ తెలంగాణా ఖ్యాతిని ఖండాంతరములో చాటి చెప్పారు.
తరువాత బతుకమ్మను నదిలో నిమజ్జన కార్యక్రమం డోల్ తషా వారి తీన్ మార్ దరువులకు అనువుగా కదం కదుపుతూ మహిళలు, యువతులు ఉత్సాహంగా నృత్యం చేసిన తీరు చూపరులను ఆకట్టుకుంది.
స్థానికులు కొందరు ఈ ప్రకృతి ఆరాధనతో కూడిన పండగను మరెక్కడా చూడలేదని ఆసక్తితో తిలకించి ఈ వేడుక అత్యంత ఆనందదాయకంగా వుందని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా Hon. Zoe Bettison (Minister for Multicultural Affairs), మరియు Hon Racheal Sanderson (MP for Adelaide) and Hon. Jing Lee (MLC) విచ్చేసారు.
అడిలైడ్ తెలంగాణా అసోసియేషన్ సభ్యులు శ్రీ ఆదిరెడ్డి గారు, రమణా రెడ్డి, కృపాకర్ రెడ్డి, విజియేన్దర్ రెడ్డి, కిరణ్, రాజయ్, సతీష్, శివకర్ మరియు చంద్రకాంత్ ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఏంతో కృషి చేసారు.