అన్నీ వదులుకోవడం సన్యాసం కాదు

అన్నీ వదులుకోవడం సన్యాసం కాదు

భగవాన్ రమణ మహర్షి అంటే వల్లమాలిన భక్తిప్రపత్తులు కలిగిన ఒకరు ఒకరోజు ఆయన వద్దకు వచ్చారు.

భగవాన్కి నమస్కరించి “నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి మీతో ఇక్కడే ఉండటానికి వచ్చాను” అన్నారు.

“భగవాన్ ఎప్పుడూ నీతో ఉంటూనే ఉన్నారు. నీతో నీలోపల ఉంటూనే ఉన్నారు. అది  నువ్వు తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఉండటం, ఉండకపోవడం ప్రధానం కాదు” అని భగవాన్ చెప్పారు.

అయితే ఆయన “నాలో ఒకటి అనిపిస్తోంది. అదేమిటంటే బంధపాశాలను విడిచి పెట్టి లౌకిక ఆశాపాశాలు వదులుకుని సన్యాసి అయిపోవాలని నా మనసు పదే పదే చెబుతోంది భగవాన్”

“సన్యాసం స్వీకరించడం అంటే నిన్ను నమ్ముకున్న వారి బరువు బాధ్యతలు విడిచి పెట్టి, కాషాయ వస్త్రాలు ధరించడం కాదు” అని భగవాన్ అన్నారు.

“గృహస్తు జీవితం గడపడం వల్ల దేవుడి సేవకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. పూర్తి మనస్సుతో ఆధ్యాత్మికత పై దృష్టి సారించలేకున్నాను”

“గృహస్తు జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రపంచంలోని ప్రజల బాగోగుల కోసం సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించడమా? సొంత ఇంట్లోని వారి పట్ల చెయ్యవలసిన బాధ్యతలు వదిలేసి ప్రజల శాంతి కోసం పెను బాధ్యతలు చేపట్టడమా” అన్నారు భగవాన్

“ఇల్లు, పెళ్ళాం, పిల్లలు అనేవి మమతానురాగాలతో పెనవేసుకున్నాయి. వాటి నుంచి ఇవతలకు రావడం కష్టంగా ఉంది”

“మనసు ఇలా అనుకుంటూ ఉంటే సన్యాసం స్వీకరించడానికి మీకింకా పరిపక్వత రాలేదు అని అర్ధం”

“అన్ని ఆశలు, బంధాలు వదులుకున్న వాటినేగా ఉన్నతమైనదిగా చెప్తున్నారు..”

“నిజమే…అది సరే. బంధపాశాలు, చాపల్యం, అవీ ఇవీ అంటూ ఉన్న వాటినుంచి దూరమైనా మనసు ఉన్న వారికి మాత్రమే  అది సాధ్యం” అని చెప్పిన భగవాన్ రమణ  మహర్షి  ఇంకా ఇలా అన్నారు…

“ఇప్పటికే ఎందరో  మహాత్ములు, జ్ఞానులు గృహస్తు జీవితం మీద విసుగు చెంది సన్యాసం స్వీకరించారని చెప్పుకోవచ్చా? కానీ అది నిజం కాదు…  ప్రపంచంలో భగవంతుడు సృష్టించిన జీవరాశులు అన్నీ ప్రశాంత జీవనం సాగించాలన్న ఉద్దేశంతోనే మహాత్ములు, జ్ఞానులు అవతరించారు….”

“ఈ కుటుంబ బంధం అనేది ఏదో ఒక దశలో తెగిపోవడం తధ్యం. అటువంటప్పుడు ఇప్పుడే  తెంచుకుంటే సరిపోతుందిగా”

“ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు మీదా ప్రేమ చూపడం సాధ్యమే. అయితే అందుకు నీ హృదయాన్ని  సువిశాలం చేసుకోవాలి. ఆ స్థితిలో ఒక దానిని (గృహస్తు) త్యజించడమో, మరొక దానిని (సన్యాసాన్ని) స్వీకరించడమో అనే ధ్యాస ఉండదు. ఒక పండు బాగా పండిన తర్వాత చెట్టు కొమ్మ నుంచి రాలిపోతుంది. అలాగే పరిపక్వత నీలోను వస్తుంది. అప్పుడు ఈ ప్రపంచం నీ ఇల్లైపోతుంది” అన్నారు భగవాన్

Send a Comment

Your email address will not be published.