నటనలో జీవించడం వేరు…నటన్నే అంకితభావతో నిర్విరామంగా సుమారు ఆరు దశాబ్దాలపాటు చలనచిత్ర రంగంలో అటు హీరోయిన్గా.. ఇటు హాస్య నటిగా.. ప్రేక్షక జనాన్ని అలరిస్తూనే బుల్లితెరపైనా.. నటిగా తన ప్రతిభని ఆవిష్కరించిన అరుదైన నటి గీతాంజలి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 400 సినిమాలు, ఎన్నో టీవీ సీరియళ్లలో నటించిన గీతాంజలి గురువారం మృతిచెందడం సినీ అభిమానులకు విషాదమే! హీరోయిన్గా, క్యారెక్టర్ నటిగా, హాస్యనటిగా విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయిన గీతాంజలి అసలుపేరు ‘మణి’. పుట్టింది కాకినాడలో అయినా పెరిగింది రాజమండ్రిలో. తండ్రి శ్రీరామ్మూర్తి, తల్లి శ్యామలాంబ. వీరికీ స్వర్ణ, మణి అనే ఇద్దరు అమ్మాయిలు. ఆ మణే ‘గీతాంజలి’గా మారింది.
తండ్రి లక్ష్యం
మణిని ఎలాగైనా సినిమాల్లో చేర్పించాలన్నదే తండ్రి శ్రీరామ్మూర్తి లక్ష్యం. ప్రముఖ నాట్యాచార్యుడు, నృత్య దర్శకుడు వెంపటి సత్యం గారి దగ్గర ఆమెని భరతనాట్యం నేర్పేందుకు చేర్చారు. అదే సమయంలో దర్శకుడు బి.ఎ.సుబ్బారావు ‘రాణీ రత్నప్రభ’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రం కోసం నాట్యకళాకారులు కావాలని సుబ్బారావుగారు అడగటంతో, వెంపటి సత్యం గారు మణితో సహా నలుగురిని పంపించారు. ఆ సినిమాలో ఈ నలుగురి చేతా బిట్లు బిట్లుగా డ్యాన్స్ చేయించారు. ఇందులో మణిది భరతనాట్యం పాత్ర. ఈ చిత్రంలో ఎన్‌టి రామారావు కథానాయకుడు. అంజలీదేవి కథానాయిక. ఈ సినిమాలో భరతనాట్యం చిత్రీకరణ కోసం మణి తండ్రి శ్రీరామ్మూర్తి ఆమె వెంట సహాయంగా వచ్చారు. మణి నాట్య ప్రదర్శన షాట్ల చిత్రీకరణ పూర్తవుతున్న సమయంలోనే ఆమెని ఎన్.టి.రామారావు చూశారు. అప్పటికప్పుడే ఎన్.టి.రామారావు, కమలాకర కామేశ్వరరావు శ్రీరామ్మూర్తిని పిలిపించి ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో ‘సీత’ పాత్ర కోసం అన్వేషిస్తున్నారు. ఆ పాత్రకు మీ అమ్మాయి అయితే సరిగ్గా సరిపోతుంది. ఒప్పుకుంటారా?’ అని అడిగారు. ఆయన వెంటనే అంగీకరించారు. అలా ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో మణికి తొలి అవకాశం వచ్చింది. రాముడి పాత్రలో హరనాథ్, రావణునిగా రామారావు, నారదుడుగా కాంతారావు నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. నటిగా ఇది ఆమెకు రెండో చిత్రమైనా హీరోయిన్గా మొదటిచిత్రం.
మొదట్లో’స్వర్ణమణి’గా
మణి అక్క స్వర్ణకూ సినిమాల్లో నటించాలని ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే సినిమా రంగంలో మొదట రెండు సంవత్సరాలూ ఆమెని అక్క స్వర్ణ పేరుతో కలిపి ‘స్వర్ణ మణి’ అని పిలిచేవారు. ఆమె హీరోయిన్గా మొదటిసారి నటించిన ‘సీతారామ కల్యాణం’ చిత్రం ఎంతో విజయవంతం అయింది. అంతేకాకుండా, ఆ చిత్రంలోని ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ….! అనే పాట నాటికీ నేటికీ వాడవాడలా వినిపిస్తూనే ఉంటుంది. అంత హిట్ పాట నాకు మంచి గుర్తింపు రావడానికీ, నా కెరీర్‌కూ ఎంతగానో దోహదం చేసింది’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
‘సీతారామ కల్యాణం’లో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో మణిది ‘సీత’ పాత్ర. ఆమె అక్కది ‘శూర్పణఖ’ పాత్ర. అయితే తర్వాత స్వర్ణ ‘భీష్మ’, మరో రెండు మూడు చిత్రాల్లో నటించాక పెళ్ళి చేసుకుని, ఆగిపోయింది. మణి మాత్రం ఒప్పందం ఉండటం వల్ల ఆ సంస్థలోనే ఉంటూ, సీతారామ కల్యాణంతో పాటు ‘గులేబకావళి కథ’ చిత్రంలోనూ నటించారు. రెండేళ్ళ తర్వాత ఇతర నిర్మాణ సంస్థల చిత్రాల్లోనూ నటించి, తన ప్రతిభని ప్రదర్శించారు.
తొలిగురువు ఎన్టీఆర్
గీతాంజలి సినీరంగంలో తన తొలి గురువు ఎన్టిఆర్ అనే చెప్పేవారు. రామారావే. డైలాగులు ఎలా చెప్పాలి? ఎలా నటించాలి? హావభావాలు ఎలా ప్రదర్శించాలి? వంటి అనేక విషయాలపై తగిన సూచనలు ఆమెకు ఇచ్చేవారు. అవన్నీ ఆమె ఎన్ఎటి సంస్థలోనే నేర్చుకున్నారు. రామారావు కుటుంబంతోనూ గీతాంజలి కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలుండేవి. వాళ్ళ సంస్థలో ఆమెను సినిమా పరిశ్రమలోకి తీసుకువచ్చింది బిఎ సుబ్బారావుగారైతే, హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి, ప్రోత్సహించింది ఎన్.టి.రామారావుగారేనని గీతాంజలి చెబుతుంటారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇల్లాలు’ సినిమాలో గీతాంజలిది కథానాయిక పాత్ర. ఈ చిత్రంలో కథానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారుగానీ, ఆయన షెడ్యూల్స్ ఖాళీగా లేకపోవడంతో మరో నటుడితో కలిసి ఆమె నటించారు. అతని పేరూ నాగేశ్వరరావే. అందులో ఆమెది ద్విపాత్రాభినయం. ఒకటి సాఫ్ట్ పాత్ర, మరొకటి ఆడరౌడీ పాత్ర. ఈ చిత్రంలో రెండు రకాల పాత్రలను అద్భుతంగా నటించడం, సినిమా పెద్ద హిట్ కావడం, గీతాంజలి నటన చాలా బాగుందని అందరూ మెచ్చుకోవడంతో ఆమెకు ఈ చిత్రం ద్వారా ఒకేసారి ఏడెనిమిది చిత్రాలకు ఆఫర్స్ వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావుతో గీతాంజలి మొదటి సినిమా ‘డాక్టర్ చక్రవర్తి’ ఆమెది అక్కినేని చెల్లెలు పాత్ర. ఆ తర్వాత పద్మనాభంతో ‘పొట్టి ప్లీడర్’, తిలక్ దర్శకత్వంలో వచ్చిన ‘పంతాలు-పట్టింపులు’లో ఆమె హీరోయిన్గా నటించారు. ‘దేవత’ సినిమాలో ఎన్‌టి రామారావుకి చెల్లెలుగా నటించడంతో పుల్లయ్య ఆమెకు ‘మురళీకృష్ణ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమెది ఓ వెరైటీ పాత్ర. డిప్రెషన్లో ఉండే మెంటల్లీ రిటార్టెడ్ పాత్ర. ఆ సినిమాలో అక్కినేని, జమున గార్ల కాంబినేషన్లోనూ ఆమె తన నటనని విభిన్నమైన శైలిలో ప్రదర్శించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ మంచి మలుపుతిరిగింది.
హిందీ సినిమాతో ‘గీతాంజలి’గా మారి
‘పారస్ మణి’ అనే హిందీ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి దర్శకులు బాబూభారు మిస్త్రీ. చిత్రంపేరు ‘పారస్ మణి’.. అందులో హీరోయిన్ పేరు ‘మణి’. ఇలా నటి అసలుపేరూ ‘మణి’ కావడమూ వారికి నచ్చలేదో.. ఏమో… ఆమెకు ‘గీతాంజలి’ అని పేరు పెడితే ఎలా ఉంటుంది? అని ఆయన అడిగారు. ఎందుకో ఆమె కూడా ‘మీ ఇష్టం అండీ! అని అనేశా’ అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడే అగ్రిమెంట్లో మొదటిసారిగా ఆమె పేరుని ‘గీతాంజలి’ అని రాశారు. ఇక అప్పటినుంచి చిత్ర పరిశ్రమలో ‘గీతాంజలి’గానే ప్రాచుర్యాన్ని పొందారు.
హాస్య పాత్రలలో రాణించి …
గీతాంజలి కథానాయికగా రాణిస్తున్న మంచి తరుణంలో ఎన్.టి.రామారావు ‘దేవత’ చిత్రంలో నటించమని అడిగారు. అందులో ఆమెది హాస్యపాత్ర. ఏ పాత్ర అయినా ఆమె బాగా చేస్తారనే ఉద్దేశంతో వారు తనని ఆ పాత్ర చేయాలని చాలా రిక్వెస్ట్ చేశారు.
‘ఈ గీతాంజలి వ్యాంప్‌గా చేస్తుంది, హీరోయిన్గా చేస్తుంది, ఇక హాస్య పాత్రల్లో కూడా చేయగలదనే విషయాన్ని నిరూపించుకో!’ అనేది సవాల్‌గా ఆమెకు ఎదురు కావడంతో ఆ పాత్రకు అంగీకరించారు. ఇలా దేవత చిత్రం హిట్ కాగా అందులో అమె పాత్ర బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ఆమె, పద్మనాభం కలిసి నటించిన ‘మా ఊరు మదరాసు నా పేరు రాందాసు / మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి’ అనే పాట ప్రేక్షకుల నాలుకలపై పలుకుతూనే ఉంటుంది. ఆ విధంగా గీతాంజలి హాస్య పాత్రల్లోకి అడుగుపెట్టారు. చలంగారి చిత్రం ‘సంబరాల రాంబాబు’లోనూ హాస్య పాత్ర పోషించారు. ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దూ ముచ్చటా విన్నారా…!’ అనే పాట తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ప్రజాదరణ పొందింది. దాంతో గీతాంజలిని మంచి హాస్యనటిగా ప్రేక్షకులు గుర్తించారు. ఆమె ఎక్కువగా పద్మనాభం పక్కనే హాస్య పాత్రల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో నగేష్‌తో కూడా నటించారు.
విభిన్న పాత్రలతో
గీతాంజలి ఎన్నో విభిన్నమైన పాత్రలను తన సినిమాల్లో పోషించారు. వీటిలో హాస్యం, వ్యాంప్, హీరోయిన్, క్యారెక్టర్ యాక్టర్‌గా అన్నిరకాల పాత్రలూ ఉన్నాయి. ‘రణభేరి, రాజయోగం, పంతాలు పట్టింపులు, తోటలో పిల్ల కోటలో రాణి, రైతేరాజు, హంతకులొస్తున్నారు జాగ్రత్త…!’ ఇలా ఎన్నో. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘పెళ్లయిన కొత్తలో, మొగుడు, ఆలయం, యకరం యాభై కోట్లు, నేరము-శిక్ష, గోపి, గోపికా, గోదావరి, ఢమరుకం, గ్రీకువీరుడు’ తదితర చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ నటిగా, సీరియల్స్‌లోనూ నటించి, నేటి తరం వీక్షకులనూ మెప్పించారు. చంద్రకాంత్భారు దర్శకత్వంలో ‘బలరామకృష్ణ’ అనే హిందీ పౌరాణిక చిత్రంలో రుక్మిణీ పాత్రలో గీతాంజలి నటించారు. ఇది ఆమెకు రెండో హిందీ చిత్రం. ఇందులో ధారాసింగ్ బలరాముడు. సావిత్రి ధారాసింగ్ భార్యగా నటించింది. కృష్ణుడుగా షాహమోడక్ నటించారు. ఇందులో గీతాంజలి, సావిత్రి అక్కా చెల్లెళ్లుగా నటించారు. షూటింగ్లో జైపూర్ తదితర ప్రాంతాలన్నీ తిరిగామని, తాము ఎంతో ఎంజాయి చేసేవాళ్ళమని గీతాంజలి చెప్పేవారు.
వివాహం – కుటుంబం
గీతాంజలి వివాహం 1974, ఆగస్టు 15వ తేదీన నటుడు రామకృష్ణతో జరిగింది. ఆమె తండ్రి శ్రీరామ్మూర్తి ‘ఈ అబ్బాయి మంచి అందగాడు, వెరీ డీసెంట్ బిహేవియర్!’ అని రామకృష్ణ గురించి చెప్పి గీతాంజలిని పెళ్ళికి ఒప్పించారు. అయితే ప్రేక్షకులు వారిది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ అలాంటిదేం కాదని ఆమె చెప్పేవారు. ‘మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరి’ చిత్రాల్లో గీతాంజలి, రామకృష్ణ కలిసి నటించారు. వీరికి ఒక్కడే కొడుకు.. పేరు శ్రీనివాస్. మనవడు శాయి సజారు, మనవరాలు శయోన్.