అర్థనారీశ్వరం

శిల్పాలాలోనో, బొమ్మల్లోనో అర్థనారీశ్వర రూపాన్ని చూసే ఉంటాం. కుడివైపు పరమేశ్వరుడు, ఎడమవైపు పార్వతి రూపం – ఇదే అర్థనారీశ్వర రూపం.

అర్థనారీ అంటే సగం స్త్రీ అని అర్థం. ఆదిమూలంలో పురుషత్వమూ, స్త్రీత్వం రెండూ ఉండేవి. రెండూ సమానంగా ఉండేవి. ఈ ప్రపంచ సృష్టికి ఏది మూలమో అందులో పురుషత్వమూ, స్త్రీత్వం కలిసే ఉన్నాయి. అదే కారణమై ప్రపంచం ఏర్పడింది. విజ్ఞాన శాస్త్రం ఈ స్త్రీపురుషులను జడ పదార్ధం, శక్తి అని పేర్కొంది.

మన హైందవ ఆధ్యాత్మికత విషయానికి వస్తే స్త్రీ భాగాన్ని శక్తి అని చెప్పింది.

మనం కూడా స్త్రీపురుషుల కలయికలోనే జన్మించాం. మనమే కాదు, ప్రాణికోటి అంతా అలాగే పుట్టింది. అంతెందుకు, పాజిటివ్, నెగటివ్ అనే వాటితోనే విద్యుత్తు కూడా పుట్టింది. నడుస్తోంది.

స్త్రీపురుషుల కలయికతో పుట్టినందువల్ల మనలో రెండు భాగాలూ ఉంటాయి. పురుషుడిలో స్త్రీ దాగి ఉంది. స్త్రీలో పురుషుడు దాగి ఉన్నాడు. పురుషుడి అంతరంగంలో స్త్రీ ఉంది. అలాగే స్త్రీ అంతరంగంలో పురుషుడు ఉన్నాడు. పురుషుడిలో స్త్రీత్వం పాలు కాస్త ఎక్కువ ఉంటే కవో, చిత్రకారుడో, గాయకుడో, నర్తకుడో, కళాకారుడో అవుతాడు. స్త్రీలో పురుషత్వం పాలు కాస్త ఎక్కువ ఉంటే అజమాయిషీని కోరుకుంటుంది. వీర, ధీర, సాహస విభాగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అలాకాకుండా పురుషుడిలో స్త్రీత్వం మరీ అత్యధిక భాగంలో ఉన్నా, స్త్రీలో పురుషత్వ భాగం అత్యధికంగా ఉంటే నంపుంసకులవుతారు.

పురుషులలో ఎప్పుడో ఓ సారి స్త్రీత్వం ఎక్కువ కావచ్చు. అప్పుడు పురుషుడు ఏడుస్తాడు. ఏడిచే మగాడిని చూసి “ఏమిటీ ఆడవాళ్ళలా ఏడుస్తున్నావు” అని చెప్పడం చూసే ఉంటాం.

స్త్రీలలో ఎప్పుడో ఓ సారి పురుషత్వం మోతాదు మించి ఎక్కువ అయిన వేళ ఆ స్త్రీ కాస్త కటినంగా వ్యవహరించవచ్చు.

అయినా ఒకటి మాత్రం నిజం. పురుషుడు పురుషుడిగానే, స్త్రీ స్త్రీగానే నూటికి నూరు శాతం వ్యవహరించడం అసంభవం. అయితే ఈ వ్యవహారంలో ఉద్వేగాలలో సమస్థితి అవసరం.

అందుకే మనలో ఉన్న స్త్రీపురుషత్వాలు రెండూ ఏకమైతే ఆనందానికి అంతుండదు. అ ఆనందం దీర్ఘకాలం ఉంటుంది.

మనలో ఓ కొత్త శక్తి ఉంటూ ఉంది. కొత్త సృష్టి జరుగుతుంది. అది ప్రకృతిపరంగా సహజసిద్ధంగా ఏర్పడితే వేరేగా చెప్పక్కరలేదు. కానీ పురుషుడు తనను ఎప్పుడూ పురుషుడిగానూ, స్త్రీ స్త్రీగానూ అనుకోవడం వల్లే కొన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. పురుషుడిలో ఉన్న స్త్రీత్వం బలహీనంగా ఉంటే అతను స్త్రీవైపు ఎక్కువ ఆకర్షితుడవుతాడు. అలాగే స్త్రీలో పురుషత్వం బలహీనపడితే పురుషుడి వైపు ఎక్కువగా ఆకర్షింప బడుతుంది.

ఏదేమైనా స్త్రీపురుషులలో సమస్థితి నెలకొంటే ఇక వారి మధ్య సంబంద బాంధవ్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కలయికలో ఇద్దరూ మమేకం అవుతారు. ఈ స్థితి ఏకత్వం అని కొందరు అనుకుంటారు. భగవంతుడు ఒక్కడే అనేది ఏకత్వం. ఇది మొదలు. అంతా ఒక్కటే అని తెలుసుకోవడమే నిజమైన ఏకత్వం. మనలో ఉన్న స్త్రీపురుషులు ఒక్కటవలేదంటే మనం భగవంతుడిని తెలుసుకోలేము. అందుకే ఏకత్వమే ఏకత్వాన్ని తెలుసుకోగలదు.