తెలుగు రాష్ట్రాల్లో అవయవ దాతల సంఖ్య ఆయేటికాయేడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ‘జీవన్ దాన్”లో పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య గత ఏడాది రెండువేలు మాత్రమే ఉండడగా ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య పది వేలు దాటింది. అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతుండడానికి కారణం ప్రభుత్వ ప్రచారం, ప్రజల్లో అవగాహన అని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. అవయవ దానం వల్ల మరొకరికి పునర్జన్మ లభిస్తుందనే అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు, బ్రెయిన్ డెడ్ అయినవారి కుటుంబాలు అవయవాలను దానం చేయడానికి ఇప్పుడు అంతగా సందేహించడం లేదని అధికారులు చెప్పారు.
2002 లో ఏర్పాటు చేసిన ఈ జీవం దాన్ లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్య 10, 470 అని తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 122 మంది అవయవ దానం చేశారు. వారివల్ల 500 మందికి పైగా లబ్ది పొందారు. కాగా మరో నలభై వేల మంది అవయవ దానం చేయడానికి దరఖాస్తులు చేసుకున్నారని తెలిసింది. ఇందులో కిడ్నీ, గుండె, లివర్, ఊపిరితిత్తుల దానం చేయడానికి, చేయించుకోవడానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని తెలిసింది.