ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం

భాగవతం …పన్నెండు స్కంధాల గొప్ప గ్రంథం….సంస్కృతంలో ఉన్న కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి బమ్మెర పోతన……

శ్రీ కైవాలా పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారభంకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలాసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్
అనే ప్రార్ధనా పద్యంతో ఈ రచన ఆరంభించారు.

పోతన ఇంటిపేరు బమ్మెర. ఇది తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ జిల్లాలో గల బొమ్మెర గ్రామం పోతన స్వస్థలం. ఆయన ఆఱువేలనియోగి. తండ్రి కేసన. కుమారుఁడు మల్లన.పోతన గురువు ఉపదేశంతో తారకమంత్ర జపం చేసి ఆ జపమహిమవల్ల పరమజ్ఞాన సంపన్నుడయ్యాడు. మహాకవి అయ్యాడు.

ఆదికవి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ మహాభారతాన్ని ఆంధ్రీకరించారన్న సంగతి తెలిసిందేగా.

భాస్కరాది కవులేమో వాల్మీకి రామాయణాన్ని తెలుగువారికి అందించారు. వీటిని దృష్టిలోపెట్టుకుని బమ్మెర పోతన తన పూర్వజన్మ పుణ్యఫలితంగా వాళ్ళందరూ భాగవతం జోలికి పోకుండా తనకు వ్రాసే అవకాశం కలిపించడం తన భాగ్యంగా చెప్పుకున్నారు. అందుకే భాగవతాన్ని ఆంధ్రీకరించి జన్మఫలం చేసుకున్నానని, మరోజన్మ అంటూ లేకుండా ముక్తిని పొందుతాను అని నిగర్వంగా చెప్పుకున్న పోతన రచనకు కారణంగా ఈ కింది సంఘటనను చెప్పుకున్నారు.

ఆరోజు చంద్రగ్రహణ శ్రీరామభద్రుడు సాక్షాత్కరించి తనకు కృతిగా శ్రీమహాభాగవతం ఆంధ్రీకరించామని ఆజ్ఞాపించారట. అంతే, ఆయన ఆలస్యం చేయకుండా భాగవతాన్ని వ్రాసారు.

ఈ రచనతో సంసార బంధాల నుంచి కూడా విముక్తుడివవుతావు అని కూడా శ్రీరామభద్రుడు సెలవిచ్చాడట.

ఇంకేముంది పోతన రాముడిపై భారం మోపి
పలికెడిది భాగవతమట…..పలికించెడి విభుడు రామభద్రుడే అంటూ భాగవతాన్ని మన ఆంధ్రులకు అందించారు.

వేమభూపాలుని వద్ద ఆస్థానపండితుడిగా ఉన్నాడు. పోతన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం అన్నీ కలిసే ఉంటాయి.
———————–
జగదీశ్ యామిజాల
———————