ఆకట్టుకునే రీతిలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

Lakshmis NTR

ఎన్టీఆర్‌ జీవితంలో చివరిదశ ఎలా గడిచిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆ విషయాన్నే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఇది మరో బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ‌ :

LakshmiNTR

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కొత్త కథేం కాదు, తెలుగు ప్రజలందరికి తెలిసిన కథే. 1989లో ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి గురించి కొద్ది రోజుల్లొనే దుష్ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రచారం ఎన్టీఆర్‌ దాకా రావటంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్‌ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు రావ్‌ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. ఇదే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథ.

నటీనటులు :

ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్‌ అయితే సినీరంగానికే కొత్త. రంగస్థల నటుడిగా ఉన్న విజయ్‌ కుమార్‌ను ఎన్టీఆర్‌ లాంటి పాత్రకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే వర్మ తన మీద పెట్టుకున్న నమ్మకానికి విజయ్‌ కుమార్‌ పూర్తి న్యాయం చేశాడు. ఎన్టీఆర్‌ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం ఇలా అన్ని భావాలను తెరమీద అద్భుతంగా పలికించారు యజ్ఞ. బాబు రావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలో అంతా కొత్తవారే కనిపించిన ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ :

lakshmisntr-movie

ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఈ సినిమాలో అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్‌ అనే మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు.? ఆ సమయంలో లక్ష్మీకి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది.? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్‌ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది.? ఆ కుట్రల వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు? చివరకు ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్న విషయాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్‌ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

ఎన్టీఆర్‌, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కాస్త కథనం నెమ్మదించినట్టుగా అనిపించినా ఒకసారి కథలో లీనమైతే అవేవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. సినిమాకు మరో ప్లస్‌ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్‌. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌

సంగీతం : కల్యాణీ మాలిక్‌

దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు

నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

Send a Comment

Your email address will not be published.