ఆకట్టుకోలేకపోయిన 'కాశి'

ఆకట్టుకోలేకపోయిన 'కాశి'

విలక్షణ నటుడు విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘కాశి’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. గతంలో తల్లి సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తీసి మెప్పుపొందిన నటుడు, సంగీత దర్శకుడు కూడా ఈ విజయ్‌ ఆంటోని. ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ‘బేతాళుడు’తోనూ అటువంటి ప్రయత్నమే మరోసారి చేసినా లాభం లేకుండా పోయింది. ఈసారి గతంలో చేసిన ‘డా.సలీం’ తరహాలోనే వైద్యుడిగా నటిస్తూ తన తండ్రి కోసం అన్వేషణ చేసే వ్యక్తి ‘కాశి’గా చేశాడు. విడుదలకు ముందే ఏడు నిమిషాల పాటు ట్రైలర్‌లో కథేమిటో చెప్పేసిన ఈ చిత్రం శుక్రవారమే విడుదలైంది.

కథ : భరత్‌ (విజయ్‌ ఆంటోనీ) అమెరికాలో పేరు మోసిన డాక్టర్‌. అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. దానికి కారణం.. చిన్నతనం నుంచి ఓ కల అతడిని వెంటాడుతూ ఉంటుంది. అదెందుకన్నది అతడికీ అర్థం కాదు. ఇదిలా ఉండగా, అనుకోకుండా తన తల్లి అనారోగ్యం పాలవుతుంది. తల్లికి తన మూత్రపిండాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ భరత్‌తో.. నీది సరిపోదు. ఎందుకంటే.. నువ్వు మా స్వంత బిడ్డవికాదనే నిజాన్ని తండ్రి వెల్లడిస్తాడు. తల్లి కోలుకున్నాక.. తన కలకు అర్థమేదో ఉందంటూ.. దానికోసం ఇండియా వస్తాడు. ఆ క్రమంలో భరత్‌ శోధించిన విషయాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.

విశ్లేషణ : తమిళ నుంచి కొత్తవాడిగా పరిచయమై ‘డా. సలీం’తో ఫర్వాలేదు అనిపించుకున్న విజరు ఆంటోని ‘బిచ్చగాడు’తో తిరుగులేని గుర్తింపును సంపాదించాడు. అతడి సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా కలిగించాడు. అందుకే ఆ తర్వాత అతను నటించిన ‘బేతాళుడు’పై విపరీతమైన ఆసక్తిని చూపించారు ప్రేక్షకులు. కానీ అది ఆ అంచనాల్ని అందుకోలేకపోయాయింది. ఇక అక్కడి నుంచి ‘యమన్‌’.. ‘ఇంద్రసేన’.. ఇలా సినిమా సినిమాకూ ఈ నమ్మకం మరింతగా సడలిపోతూ వచ్చింది. ప్రతి సినిమాకూ కొన్ని మెట్లు దిగుతూ వచ్చిన విజరు. ఇప్పుడు ‘కాశి’తో మరో మెట్టు దిగాడనే చెప్పాలి.

సినిమా రిలీజ్‌కు ముందే తొలి ఏడు నిమిషాల సన్నివేశాల్ని యూట్యూబ్‌లో విడుదల చేసి ఆసక్తి కలిగించాడు. కానీ చిత్రం చూశాక అంతకంటే ఆసక్తిగల అంశాలు, కథనం ఏమీ లేకపోవడం ప్రధాన లోపం. ఓపెనింగ్స్‌ రాబట్టుకోవడానికి చేసిన ఈ టెక్నిక్‌ వికటించిందనే చెప్పాలి. ట్రైలర్‌లోనే కథేమిటో తెలిసిపోవడంతో.. తండ్రి కోసం వేట మొదలు పెట్టడం.. ఆ క్రమంలో కొన్ని పాత్రలు తన తండ్రే అనిపించేలా ఉండడంతో వాటిని తనే తెరపై పోషించడంతో ప్రేక్షకుడికి విసుగుపుడుతుంది. ఇంతకుముందు సిద్ధార్థ్‌ నటించిన ‘బావ’ సినిమాలో తన తండ్రి అయిన రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లో సిద్ధూ కనిపించడం గుర్తుండే ఉంటుంది. అందులో కనీసం ఒక పాత్రే సిద్ధూ పోషిస్తాడు. ‘కాశి’లో మాత్రం ఆంటోని మూడు పాత్రల్లో చేసి కాస్త చికాకు పెడతాడు. తన పుట్టుక.. గతం.. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ఒక కొడుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రం. దీనికి ఓ ఉపకథ అల్లాడు. అదే చిత్రానికి కీలకం. దాన్ని సమర్థవంతంగా చూపిస్తే సినిమా బాగుండేది. గ్రామాల్లో ఉండే వర్గపోరు ఆ ఉపకథ. ఈ ఉప కథ 28 ఏళ్ళ క్రితం నాటిది. తల్లి పుట్టిన ఆ గ్రామంలో అగ్రవర్ణం, దళితవర్గాన్ని చులకనగా చూసేది. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అగ్రవర్ణాల బజారుగుండా పోకూడదు. ప్రకృతివైపరీత్యంతో గతిలేని స్థితిలో అటుగా వచ్చిన వారిని అగ్రవర్ణాలు వారు చంపేస్తుంటారు. ఈ అరాచకం ఇప్పటికీ చాలా కుగ్రామాల్లో కొనసాగుతోంది. అయితే దాన్ని చెప్పే విధానం సరిగ్గా లేదు. ఇంచుమించు ఇలాంటి వాతావరణాన్ని ‘రంగస్థలం’లో అందరికీ అర్థమయ్యేలా ఆ దర్శకుడు చెప్పగలిగాడు.

విజరు ఆంటోనీకి నటుడిగా చాలా పరిమితులున్నాయి. అందుకే నటనకు ఆస్కారం లేని పాత్రలే చేస్తుంటాడు. అలాంటిది మూడు పాత్రలే తనే వేయడం వల్ల ఏ పాత్రా అంతగా ఆకట్టుకోలేదు. ధారావాహికను తలపించేలా విపరీతమైన సాగదీతో.. ఏ ప్రత్యేకతా లేని మామూలు సన్నివేశాలతో నడిచే మూడు ఫ్లాష్‌ బ్యాక్‌లు చూసేసరికి మూడు సినిమాలు చూసిన భావన కలుగుతుంది. చివరిలో అయినా ఏదైనా ట్విస్టు ఉంటుందేమో అనుకంటే అక్కడా నిరాశే. ముగింపు చాలా పేలవంగా ఉంటుంది. హీరోయిన్లలో శిల్పా మంజునాథ్‌కు మార్కులు ఇవ్వొచ్చు. తక్కువ సమయంలోనే ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. సునైనా ఫర్వాలేదు. అంజలిది పాత్ర అనవసరం అనిపించింది. నాజర్‌, జయప్రకాశ్‌, యోగిబాబు, మధు తమ పాత్రల పరిధిలో ఓకే అనిపించారు. మిగతా నటీనటులంతా మామూలే.

తనే సంగీత దర్శకుడు కనుక తన స్థాయిలోనే పాటలున్నాయి. ఏవీ గుర్తుపెట్టుకోగల పాటలు కావు. నేపథ్య సంగీతం ఓకే. రిచర్డ్‌ ఎం.నాథన్‌ ఛాయాగ్రహణం మామూలుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్‌ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించారు. భాష్యశ్రీ మాటలు సోసోగా ఉన్నాయి. ‘స్కాచ్‌ బాటిల్‌ అని చెబితే.. కాచిన నీళ్ళబాటిలా! తాగితే అందరూ డాక్టర్లే! వంటి రెండు మూడు సరదా మాటలు మినహా కొత్తగా ఏమీ లేవు. దర్శకురాలిగా కృతిగ ఉదయనిధి ఆకట్టుకోలేకపోయారు.

నటీనటులు : విజయ్ ఆంటోనీ, అంజలి, సునైనా, అమృత అయ్యర్‌, శిల్ప మంజునాథ్‌, జయప్రకాష్‌, నాజర్‌, యోగిబాబు, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు.
సాంకేతిక వర్గం :
సంగీతం : విజయ్‌ ఆంటోనీ, ఛాయాగ్రహణం : రిచర్డ్‌ ఎం.నాథన్‌. మాటలు : భాష్యశ్రీ, నిర్మాత : ఫాతిమా విజయ్‌ ఆంటోనీ. రచన – దర్శకత్వం: కతిగ ఉదయనిధి.

Send a Comment

Your email address will not be published.