ఆడ బ్రతుకు

స్కానింగ్ లో ఆడనా మగనా
తెలుసుకునే ఈ లోకంలో
వంశాకురం కోసం జరిపే
భూహత్యల నుండి
తప్పించుకున్న నీవు
దినదిన గండంలా బ్రతకక
మారాలి మరో రుద్రమగా
కావాలి నీవు అసురుల పాలిట ఆదిశక్తిగా
ఆడదంటే ఆటబొమ్మ కాదు
ఆడదంటే అపర కాళి అని నిరూపించు
ఆడ జన్మ నీకు శాపం కాదని
ఆడ జన్మ నీకు ఒక వరం అని
ఆడదే ఈ సృష్టికి మూలం
ఆడదే ఈ సృష్టికి ఆధారం
ఆడది అబల కాదు సబల అని తెలుసుకో
కట్టుబాట్ల సంకెళ్ళ నరకాన్ని తెంచుకొని
సాగిపో సాగిపో ముందు ముందుకు సాగిపో
ఆత్మ స్థైర్యంతో అడుగు ముందుకేయ్
స్వేచ్చతో మనుగడను సాధించు
బ్రతుకే భారంగా ఈడ్చక
బ్రతుకే బరువుగా భావించక
ఎవ్వరు నీకు సాటి రారు
ఎవ్వరు నీకు సాటి లేరు
అనే ధైర్యంతో తెగింపుతో
సహనంతో సాగిపో ముందు ముందుకు సాగిపో
మిణుకు మిణుకు మనే
రేపటి ఆశే నీకు దారి చూపుతూ
స్వాగతం చెబుతూ నీకు ఆహ్వానం పలుకుతుంటే
ఈ విశ్వమంతా ఎదురే లేకుండా
సాగిపో ముందు ముందుకు సాగిపో

— రమా నరసింహా రావు, న్యూ జిలాండ్
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో