ఆస్ట్రేలియా తెలుగువారి చరిత్రలో అపూర్వ ఘట్టం

ఆస్ట్రేలియా తెలుగువారి చరిత్రలో అపూర్వ ఘట్టం

మహాకవి కాళిదాసు నాటకం –
శుభకృత్ ఉగాది – 2 ఏప్రిల్ 2022

  • అరవై ఏళ్ళ ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానంలో అపూర్వ సంస్థానం!
  • తెలుగు భాషా సంస్కృతులకు, తెలుగు కళావిలాసాలకీ సుస్థానం!!
  • నల్లపూసవుతున్న తెలుగు నాటక రంగానికి మహా ప్రస్థానం!!!
  • కవికుల గురువు “మహాకవి కాళిదాసు” దృశ్య రూపకం!!!!

పదేళ్ల క్రితం పద్యనాటకం ప్రదర్శించాలంటే చూసేవారుంటారా? అని సందేహం.  తెలుగునాటే కనుమరుగౌతున్న నాటకం ఇంకో దూరదేశంలో వేయాలంటే నటులుంటారా? అనే సంశయం.

ఇప్పుడు “పద్యమన్నా, పద్య నాటకమన్నా పరాయి దేశంలోనే! అందునా ఆస్ట్రేలియాలోనే!” అని ప్రపంచమంతా ఆస్ట్రేలియాకేసి ఆశగా చూస్తోంది.

అవనికి చివర, ఆ మూలెక్కడో ఆస్ట్రేలియాలో కూర్చుని ఇన్ని అద్భుతాల్ని ఎలా సృష్టించారని ఆశ్చర్యపోతోంది తెలుగు నాటక కళా ప్రపంచం.

ఆరేళ్ల క్రితం ‘శ్రీకృష్ణ రాయబారము’ ప్రదర్శన తరువాత “పద్య నాటకం తెలుగువారు గర్వించదగ్గ మహోన్నత దృశ్య మాధ్యమం” అని అందరూ వేనోళ్ళ శ్లాఘించారు.

‘శ్రీ పార్వతీ కళ్యాణం’ నాటక ప్రదర్శన తరువాత  “మళ్ళీ దీనికి దీటైన నాటకం ఎప్పుడు వేస్తారు?” అని అందరూ నిలదీయడం పద్య నాటకంపై తెలుగుజాతి పెంచుకున్న మమకారానికి, కళాభిమానానికి ప్రతీక.

గత రెండేళ్లుగా కోవిడ్ ధర్మమా అని జూమ్ వేదికగా పరోక్షంలో నడిచిన సాంస్కృతిక కార్యక్రమాలే కాని ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశం లేకపోయింది.  ఇప్పుడు సాహసించి, ప్రత్యక్షంగా రంగస్థల వేదికపై ప్రదర్శించిన ‘మహాకవి కాళిదాసు’  నాటకం చూసిన వారు, విన్నవారందరూ ఎంతో సంతోషపడ్డారు.

సిడ్నీ వాస్తవ్యులు శ్రీ తూములూరి శాస్త్రి గారు రచించిన “భారతీ విలాసము” నాటకం  ఆధారంగా, తెలుగు సంస్కృత సంభాషణలు, కాళిదాసు సుప్రసిద్ధ శ్లోకాలు పుష్కలంగా నిండిన 10 రంగాలతో “మహాకవి కాళిదాసు” నాటకం ఉన్నత విలువలతో ప్రదర్శించబడింది.  ఊహించని విధంగా, ప్రతి రంగానికి వేదికపై తగిన హంగులు సమకూర్చి నిర్వాహకులు, దర్శకులు  ప్రేక్షకులందరినీ  సంభ్రమాశ్చర్యాలతో నింపారు.  నటులలో చాలామంది క్రొత్తవారే అయినా పాత్రోచితమైన ఆహార్యాలు సమకూర్చుకొని ప్రతి పాత్రకు జీవం పోశారు.

మూడున్నర గంటల పైగా సాగిన ఈ ప్రదర్శన, అద్భుతమైన సంభాషణలతో, నటనా ప్రతిభతో అడుగడుగునా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఉదాహరణకు:
విద్వత్తు, రాజసం ఉట్టిపడే భోజరాజు,
భావరాగయుక్తమైన శ్లోకాలతో ప్రదర్శనకే వన్నె తెచ్చిన కాళిదాసు,
నటనాకౌశలంతో సభాసదులను సమ్మోహితులను చేసిన రాకుమారి సర్వమంగళ, నృత్య గీతాలతో ఆస్థాన నృత్యాలను మరపించిన నర్తకీమణులు,
సాంప్రదాయ దుస్తులలో, సౌజన్య సంభాషణలతో అలరించిన మునికన్యలు,
తాపస ప్రకాశంతో, సాత్విక వికాసంతో కణ్వ మహర్షి,
భీభత్సం, వాత్సల్యం కురిపించి మెప్పించిన కాళికా దేవి … ఇలా అన్ని పాత్రలు.

దర్శకులు – శ్రీ రఘు విస్సంరాజు, శ్రీ సరిపల్లె సూర్యనారాయణ
సాంకేతిక సహాయకులు – శ్రీ రాంప్రకాష్ యెర్రమిల్లి, శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం
ధ్వని బ్రహ్మ – శ్రీ వడ్డిరాజు శ్రీనివాస్

ఇలా వ్రాసుకుంటూ పోతే ఇదే ఒక ఉద్గ్రంధమౌతుంది.

నాటక రచయిత ప్రతీ పాత్రను గూర్చి వ్రాసిన వివరాలు ఇక్కడ చదువవచ్చు.

వేదికపై ఆయా రంగాలకు తగిన దృశ్య చిత్రాలు, నటుల ఆహార్యాలతో పాటుగా సాంకేతికతను జోడించి ప్రదర్శించిన ఈ నాటకం అద్వితీయమని ప్రేక్షకులందరూ కొనియాడుతున్నారు.  ఇంతకు ముందు ప్రదర్శించిన రెండు పౌరాణిక నాటకాలకు మించిన ప్రజాదరణ ఈ నాటకం పొందిందని ప్రేక్షకుల అభిప్రాయం.

ఈ నాటకం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలోని మరికొన్ని నగరాలలో ప్రదర్శించాలని ఇప్పటికే ఆహ్వానాలు రావడం ఈ ప్రయత్నానికీ, బృందానికీ, నిర్వాహకులకు సహృదయ ప్రోత్సాహం, తెలుగు కళారంగానికే ఉత్సాహం.

పుస్తకావిష్కరణ:

ఈ సభలో ఆవిష్కరించబడిన పుస్తకాలు:
1.భారతీ విలాసము (శ్రీ మహాకవి కాళిదాసు చరిత్ర – నాటకం) – రచయిత: తూములూరి శాస్త్రి (ఆస్ట్రేలియా)
2.సిరిదివ్వెలు (ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలజలధీశ్వర స్వామిపై  పద్య కావ్యం)
రచయిత: కావ్య కళాప్రపూర్ణ డా. చింతలపాటి మురళీకృష్ణ (ఆస్ట్రేలియా)
3.“అదివో..అల్లదివో” (అలిపిరి నుండి తిరుమల వరకు ఉన్న మెట్ల దారిలోని విశేషాలు పద్య లఘు కావ్యం)

రచయితలు :  కొంచాడ మల్లికేశ్వర రావు (ఆస్ట్రేలియా),
వేణుగోపాల్ రాజుపాలెం (ఆస్ట్రేలియా),
శ్రీకృష్ణ రావిపాటి (ఆస్ట్రేలియా),
గుంటూరు దీక్షితులు (భారతదేశం),
శ్రీనివాస్ లింగం (దుబాయ్)

4.ప్రభాత వీచికలు (ముప్పై ఏళ్లుగా వ్రాసిన వ్యాసాల సంకలనం) –     రచయిత: డా. దూర్వాసుల మూర్తి (ఆస్ట్రేలియా)

ఈ పుస్తకాలు దొరకు చోటు:

రావు కొంచాడ (ఆస్ట్రేలియా)
ఫోన్: +61 422 116 542, ఈమెయిలు: rao@telugumalli.com
జె. వి. పబ్లికేషన్స్, హైదరాబాద్  (ఇండియా)
ఫోన్: +91 80963 10140 ఈమెయిలు: jvpublications22@gmail.com

నాటక ప్రదర్శన కార్యక్రమ స్పాన్సర్లు:

  1. దోసా హట్ – ప్రేక్షకులకు పసందైన విందు భోజనం
  2. ఇంటిగ్రేటెడ్ అకౌంటెంట్స్ – ఆర్ధిక సహాయకులు
  3. తత్త్వం యోగశాల – సాంస్కృతిక భాగస్వాములు
  4. మెల్బోర్న్ మండప్స్ – సాంస్కృతిక భాగస్వాములు
  5. స్నాక్ ఇండియా – ప్రేక్షకులకు అల్పాహారం


ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది సహాయ సహకారాలందించారు. వారందరికీ తెలుగుమల్లి మరియు భువనవిజయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.