ఇంటినుంచి పనిచేయుట (Working from home)

అది Melbounre నగరం. ఉదయం సమయం 6 : 30 గంటలు కావస్తోంది.సూర్య భగవానుడు మంచి మూడ్ లో తళ తళా మెరుస్తున్నాడు. బాగా లాన్ లో గడ్డి పెరుగుతుందని రాంబాబు వేసిన విత్తనాల వల్ల, చాలా పక్షులు రాంబాబు దొడ్లో కిల కిలా మంటూ హాయిగా ప్రాతఃకాల భోజనం చేస్తున్నాయి. కంప్యూటర్ ప్రొఫెషనల్ రాంబాబు చాలా శ్రద్దగా తన స్టడీ రూములో కంప్యూటర్ మీద ఆఫీసు పని చేసుకుంటున్నాడు. రాంబాబు భార్య వనజ, వంటింటిలో రాంబాబుకి లంచ్ తయారు చేస్తొంది. మంచి పోపు ఘాటు వంటింటిలోంచి వస్తోంది. ఆ ఘాటుకి రాంబాబు పనిచేసుకుంటూనే ఓ డజను తుమ్ములు తుమ్మాడు. అసలే పనిలో ఐడియాలు రాక భాదపడుతున్న రాంబాబు కళ్ళలో, పోపు ఘాటు వల్ల వచ్చే నీళ్ళు చూస్తే ‘పాపం పని చెయ్యలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్టున్నాడనిపిస్తుంది’. రాంబాబుకి చాలా చిరాకుగా ఉంది. రాత్రి లోపల పని పూర్తిచెయ్యాలి.

ఇంతలో రాంబాబు పిల్లలు టింకూ, బేబీ ‘ డాడీ’ అంటూ వచ్చేరు. మనసులో ఉన్న చిరాకుని ప్రక్కన పెట్టి, ‘Good morning kids. బాగా చదవాలి. మంచిరాంక్ రావాలి. Have a good day’ అని చెరో ముద్దూ ఇచ్చి తన పనిలో పడ్డాడు. తండ్రి బిజీ గా ఉన్నాడని గ్రహించి , పిల్లలిద్దరూ మెల్లిగా జారుకున్నారు. పిల్లలని చూసి, వనజ పాలు కలిపిస్తూ, రోజులాగే ‘స్కూల్లో బట్టలు బాగా మాపెస్తున్నారు, చింపి వేస్తున్నారు. మీ నాన్న కూడా మీ లాగే లంచ్ తినకుండా తీసుకొస్తున్నారు. అన్నీ తగలేసుకోస్తున్నారు. నా ఖర్మ…..’ అంటూ సణుగుతోంది. అదే సమయంలో ప్రక్క ఇంటిలో కుక్క గూడ తెగ మొరుగుతోంది ‘దిక్కుమాలిన కుక్కరోజూ ప్రొద్దున్నే తినేస్తోంది’ అంటూ వనజ దానికి పోటీగా గొణుగుతోంది. సమయం 8 గంటలు కావస్తోంది. పిల్లలిద్దరూ స్కూలుకు తయారయ్యారు. వనజ వాళ్ళను దింపడానికి తయారయ్యింది. రాంబాబు కి, పిల్లలకీ లంచ్ బాక్స్ లు సర్దేసింది. వనజకి డ్రైవింగ్ రాదు. నేర్పిద్దామంటే చాలా మంది డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు , మూడు క్లాసులు కాగానే పారిపోయారు.

రాంబాబు ఇంటికి, పిల్లల స్కూల్ 20 నిమిషాల నడక. వనజ రోజూ పిల్లల్ని దింపి, చిన్నచిన్న బజారు పనులుచేసుకుని వస్తుంది. వనజ ఉద్యోగం చెయ్యదు. చేద్దామని ఉన్నా, డిగ్రీ సర్టిఫికేట్ లు లేవు. డిగ్రీ ఇవ్వడానికి విశ్వవిద్యాలయం వాళ్ళకి చేతులు రాలేదు. ఒకవేళ డిగ్రీ ఉన్నా చేసేదికాదు. ఒక వేళ చేసినా ‘వనజ బాస్ ఆత్మహత్య చేసుకునేవాడని’ రాంబాబు అభిప్రాయం. అందుకే వనజ చదువు, ఉద్యోగం గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోడు. అయితే వనజ ‘house wife’ అంటే చిన్నబుచ్చుకుంటుందని ఎవరయినా అడిగితే ‘Domestic Engineer’ అని చెప్పుతోంటాడు. ఇంతలో వనజ ‘ఏమిటీ! ! ఇంకా తయారవ్వలేదు. ఆఫీసు లేదా.బాగా సెటిలయిపోయారు?. ‘ అని రాంబాబుని అడిగింది. ‘ఈ వేళ పని చాల ఎక్కువగా ఉంది ప్రశాంతంగా చెయ్యాలి. ట్రావెలింగ్ కి చాల టైం పడ్తుంది. రాత్రికల్లా పూర్తి చెయ్యాలి. బాస్ కి చెప్పాను. ఈవేళ ఇంట్లోంచి పనిచేస్తాను. నేను ఇంట్లోలేననుకుని, మీ పనులు మీరు చేసుకోండి’ అంటూ రాంబాబు పనిలో పడ్డాడు. ‘హు. బంగారం లాంటి నిద్ర పాడి చేసుకుని, మీకోసం వంట చేసాను. వెళ్లనని ముందే చెప్పొచ్చుకదా. ఎప్పుడూ అంతే !. ఏదీ సరిగ్గా చెప్పరు. చాలా చిరాకేస్తోంది..’ అంటూ మొదలుపెట్టింది. ఇంతలో, బేబీ ‘డాడీ, మమల్ని ఈవేళ స్కూల్కి కార్లో దింపవా?’ అని బుంగమూతితో అడిగింది. వెంటనే మనసు కరగి పోయి,’ సరే, పిల్లలకి పాపం నడక తప్పుతుంది. వనజకి కూడా కోపంతగ్గుతుంది. ఒక్క 10 నిమిషాలేకదా’ అనుకుని రాంబాబు కారు బయటకు తీసి, వనజనీ , పిల్లలనీ తీసుకుని స్కూల్ లో దింపి, వెనక్కి మళ్ళారు. ‘ఏమండీ? ఈవేళ శుక్రవారం. Dandenong మార్కెట్లో ఫ్రెష్ కూరలు వస్తాయి. ఒక గంట వెళ్లి తెచ్చుకుందామా?’ అంది వనజ. వెంటనే రాంబాబు ‘చూడు వనజా?. చాలా అర్జెంటుపని ఉంది. పని మానేసి Dandenong మార్కెట్ కు వెళ్తే, మనం కూడా అక్కడ, త్వరలో, కూరలు అమ్ముకోవలసి వస్తుంది’ అంటూ ఇంటికి వచ్చి మళ్లీ పనిలో పడ్డాడు రాంబాబు. అప్పటికి టైం 9 గంటలు కావస్తోంది. ఒక అరగంట గడిచిందో లేదో కాని, వనజ రెండుకప్పుల కాఫీతో రాంబాబు దగ్గరకి వచ్చింది. రాంబాబు భార్య అభిమానానికి సంతోషించి, ‘థాంక్స్’ అని కాఫీ తీసుకుని, తన పనిలో పడిపోయాడు. వనజ మాత్రం ఏమీ మొహమాటం లేకుండా, రాంబాబు ప్రక్కనే కుర్చీలో కూర్చుంది. ఐదు నిమిషాలు గడవగానే, ‘ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు, ఈగాజులు చెరిపించి, తెల్ల రాళ్ళ సెట్, ఎర్ర రాళ్ళ సెట్ చేయించుకుంటాను. జగన్ గారి భార్య తెలుగు ఫంక్షన్ లో మంచి సెట్ పెట్ట్టుకొచ్చింది. అస్తమాను ఆ కంప్యూటర్ లో తల దూర్చడం తప్ప, డబ్బేమీ కనిపించట్లేదు.’ అంది వనజ. వెంటనే రాంబాబు ‘వనజా! నన్ను కాస్సేపు ప్రశాంతంగా పనిచేసుకోనీ. ఆగదిలోకి వెళ్లి కూర్చో ‘ అని విసుక్కున్నాడు రాంబాబు టెన్షన్లో. ‘నాకేం పనిలేదనుకున్నారా?. మీకు ఆఫీసులో ఎంత పని ఉంటుందో-నాకూ అంతే ఉంటుంది. ఎండపోయే లోపల, బట్టలు ఆరేసిరావాలి. ‘ అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయింది వానజ. అమ్మయ్య అనుకుని రాంబాబు పనిలోపడ్డాడు. రాంబాబుకి బంగారం అంటే భయం. ఓ సారి ఇండియాలో, బంగారు షాపులో, తనకి, వనజకి, మాట, బిల్లూ కుదరక, వనజకి పూనకం వచ్చింది. కొట్టువాడి ముందు తెగ తిట్టి పోసింది. కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటే, ఆ కోట్లో వాళ్ళంతా రాంబాబుని, చాలా కోపంగాను, విచిత్రంగాను చూసారు. తల కొట్టేసినట్లయ్యింది. ఇప్పటికీ రాంబాబు ఆ కొట్టుకి కాదు కదా, ఆ సందుకే వెళ్ల లేదు. ఇక్కడొక చిన్న విషయం. వనజ చాలా అందంగాను, అమాయాకంగాను కనిపిస్తుంది. అందుకని ఏడిస్తే, అవతలివాడు పెద్ద విలన్లా కనిపిస్తాడు. ఇది గుర్తుకురాగానే, రాంబాబు కంప్యూటర్లో ప్రోగ్రాం వ్రాస్తూ GOLD_ అంటూ ఎంటర్ చేసాడు. వెంటనే తేరుకుని, మనస్సు అదను తప్పుతోందని గ్రహించి, తప్పు సరిదిద్దుకుని, పని చెయ్యడం మొదలు పెట్టాడు.

ఇంతలో 10 :45 గంటలయ్యింది. ‘ఏమండీ? ఆఫీసులో మీ కాఫీ బ్రేక్ ఎన్ని గంటలకి?.’ అంటూ వచ్చింది వనజ. ‘ఇదేమీ ఇండియాలో మున్సిపల్ ఆఫీసు, తాలూక ఆఫీసు కాదు. అలాంటి బ్రేక్స్ఉండవు. అయినా? ఎందుకు? ‘ అన్నాడు రాంబాబు. ‘ఏంలేదు. పిల్లలకి, మీకు , దోసావకాయ ఇష్టమని పెట్టాను. అందులో ఉప్పు సరిపోలేదు. ఒక్క సారి కార్లో వెళ్లి ఉప్పు తెచ్చిపెడతారేమోనని. కొట్టు ఇక్కడేకదా! ‘ అంది వనజ. ‘ఉప్పులేకపోతే, ఉప్పగా ఉన్న ENO ఫ్రూట్ సాల్ట్ తగలెయ్యి.నేను వెళ్ల లేను.’ అని విసుక్కున్నాడు రాంబాబు. అయిదు నిమిషాలు గడిచింది. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. ‘ఈ సమయంలో ఎవరోస్తారాబ్బా?’ అనుకుంటూ రాంబాబు తలుపు తీసాడు. ఇద్దరు అందమయిన ఆస్ట్రేలియన్ అమ్మాయిలు, ఒక ముసలాయన ఉన్నారు. వాళ్ళు రాంబాబు అమాయకమైన మొహంచూసి, ‘మానసిక వ్యాధులూ, భార్యా భర్తల సమస్యలూ పరిష్కరించడానికి ఆస్ట్రేలియన్ గవెర్నమెంట్ ఎమిచేస్తోందో, వాళ్లకి, ఈ మెంటల్ సొసైటీ ఎలా సహాయం చేస్తోందో…’ ఐదు నిమిషాలు వివరించి, ఐదు డాలర్లు విరాళం తీసుకుని వెళ్ళిపోయారు. రాంబాబు బుర్ర వేడెక్కి, ‘అబ్బ’ అనుకుని మళ్లీ పనిలోకి దిగాడు. ఇంతలో ‘ఊళ్ళో వాళ్ళతో, అందమయిన అమ్మాయిలతో మాట్లాడడానికి టైం దొరుకుతుంది. కాస్త ఉప్పు తేవడానికి మీకు మనసొప్పలేదు. …’ అంటూ లగాయిన్చుకుంది వనజ. ఈ ఉప్పు తేకపోతే, తను వ్రాసే ప్రోగ్రాం కూడా ఉప్పగా ఉంటుందని, ‘ఉప్పేనా?. ఇంకా ఏమయినా కావాలా?’ అని అడిగాడు రాంబాబు. ‘వీలయితే కాస్త పాలు, రెండు టమాటాలూ కూడా తీసుకురండి’ అంది వనజ. ‘ఖర్మ’ అనుకుంటూ రాంబాబు కార్లో వెళ్లి అన్నీ కొనుక్కుని 10 నిమిషాల్లో వచ్చాడు. మళ్ళీ పనిలో పడ్డాడు రాంబాబు.

ఇంతలో 12 :30 అయ్యింది. వనజ జాడ తెలియలేదు. అమ్మయ్య అనుకునాడు. ఇంతలో బాస్ ఫోన్ చేసి ‘పని బాగా జరుగుతోందా?. చాలా అర్జెంట్’ అని గుర్తు చేసాడు. రాంబాబుకి టెన్షన్ పెరిగిపోయింది. కంప్యూటర్ స్క్రీన్ కేసి చూస్తూంటే, ప్రక్కనే అలికిడి అయ్యింది.’ ఏమిటా?’ అని చూస్తే, వనజ క్రొత్త చీరా, మాచింగ్ జాకెట్ వేసుకుని నుంచొని ఉంది. ‘ఈ వేళ శ్రావణశుక్ర వారం. అనసూయ గారింటికి పేరంటానికి వెళ్ళాలి. ఈ డ్రెస్ ఎలా ఉంది?. ఈ డ్రెస్ బాగుందా? లేక ఈ గ్రీన్ డ్రెస్ బాగుందా?. ఈ మాచింగ్ నెక్లస్, దుద్దులూ బాగున్నాయా?. పైగా మీరీవేళ ఇంట్లోంచి పనిచేస్తున్నారు కదా! కాస్త సాయం కాలం నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లిదిరి కాని.’ అంది వనజ. రాంబాబుకి ఒక్క సారి, వనజలో, తన బాసే, ఆ చీర, నగలూ ధరించి ‘పని అయ్యిందా?’ అని అడిగినట్లనిపించింది. కాస్త గుండె దడ దడ లాడింది. కూల్ డౌన్ అనుకున్నాడు.’వనజా! నీకు ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. అసలే బ్యూటీ స్టార్వి. చాలా బాగుంది. వెళ్ళు.’ అని చమత్కారంగా చెప్పి పనిలో పడ్డాడు. ‘కంప్యూటర్ మీద ఉన్న శ్రద్ధ, పెళ్ళాం మీద ఉంటె బాగుండును’ అని మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది వనజ.

ఇంతలో 1 : 30 గంటలయ్యింది. ‘ఏమండీ. మీకు సద్దిచ్చిన లంచ్ బాక్స్ లో అన్నం, ఆనపకాయ పులుసు, గోంగూర పచ్చడీ వేచ్చబెట్టుకొస్తాను. భోంచేసి పని చేసుకోండి’ అంది వనజ. పనిఅవ్వని మనసుతో, రాంబాబుకి గొంగూర పదం వినగానే, ఆకలేసింది. సరే అని, రాంబాబు కిచెన్లోకి వెళ్ళాడు. ‘పాండవ వనవాసం’ సినిమా పెట్టింది వనజ. సినీమా చూస్తూ అన్నం తినడం మొదలెట్టారు. రాంబాబుకి N.T.Rama Rao గారన్నా. ఘంటసాల గారి పద్యాలన్నా ప్రాణం. ఒళ్ళే తెలియదు. ఆ మైకంలో, పది నిమిషాలలో తినే భోజనం 40 నిమిషాలు పట్టింది. సరిగ్గా, దుశ్శాసనుడు, ద్రౌపదిని ఈడ్చుకోస్తుంటే, తన బాస్ గుర్తుకొచ్చి , ఉలిక్కిపడి టైం 2:10 చూసుకుని హడలిపోయాడు. గబ గబా కంప్యూటర్ దగ్గరకి పరిగెత్తి మళ్ళీ పని మొదలు పెట్టాడు.

ఇంతలో మళ్ళీ ఎవరో బెల్లు కొట్టారు. ‘వనజా!. ఎవడూ దిక్కుమాలిన వాడు చందా కోసం వచ్చిచచ్చినట్టు న్నాడు. చూడు. కిటికీలోంచి చూసి పంపించేసెయ్యి’ అన్నాడు రాంబాబు. వనజ కిటికీలోంచి చూసి’ ఉష్. అరవకండి. తిట్టకండి. వచ్చింది చిదంబరం గారు.’ అంటూ ‘రండి అన్నయ్య గారూ!.’ అంటూ తలుపు తీసింది వనజ. ‘నేను శలవలో ఉన్నాను. నా మిసెస్ ఇంట్లోంచి పనిచేస్తోంది. నేను డిస్ట్రబ్ చేస్తున్నాని బయటకు పొమ్మంది. నీ కారు చూసాను. ఎలాగా ఇంట్లో ఉన్నావు కదా, మన తెలుగు అసోసియేషన్ లో వేద్దామనుకున్నస్కిట్ రిహార్సల్స్ చేద్దామని వచ్చాను’ అన్నాడు నవ్వుతూ చిదంబరం. ‘బాబూ! చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను. ఈవేల్టికి వదిల్లెయ్యి. నీకు శత కోటి నమస్కారాలు.’ అంటూ చిదంబరం గడ్డం పుచ్చుకునే బ్రతిమాలాడు రాంబాబు. ‘సరేలే, అన్ని నమస్కారాలు పెట్టకు. చెయ్యి వాస్తుంది. గుడ్ లక్. వస్తానమ్మా వనజా’ అంటూ ఏ కళనున్నాడో వెళ్ళిపోయాడు చిదంబరం. అప్పుడే 2 : 40 గంటలు కావస్తోంది. రాంబాబుకి ప్రెజర్ పెరిగిపోతోంది. గబ గబా పనిమొదలు పెట్టాడు. పదినిమిషాలు కాగానే, ‘గమ్మున పనిచేసేసుకోండి. 3 : 30 కి పిల్లల్ని తీసుకొద్దాం, సాయంకాలం అనసూయ గారింటికి పేరంటానికి వెళ్దాం. వీలయితే షాపింగ్ కూడా చేసేద్దాం. ఈలోపల చిన్న కునుకు తీసొస్తాను’ అని వనజ అరిచింది. ‘అయ్య బాబో. ఇంట్లో పనిచెయ్యడం కంటే ఆఫీసు కు పోవడం మంచిది. ఇప్పుడు ఆఫ్ఫీసులో అంతా వెళ్ళిపోయే టైం . చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేటయినా ఇంత పిజ్జా, పిండాకుడో తిని పని పూర్తి చేసుకోవచ్చు. పిల్లలోస్తే తినేస్తారు. ఆపైన వనజ తింటుంది. అమ్మో, వనజ నిద్రలో ఉండగానే జారుకోవాలి’ అని రాంబాబు గబ గబా కంప్యూటర్ బాగ్ సర్దుకుని, ఇంటి తలుపేసుకుని కార్లో బయలుదేరాడు. కారు స్టేషన్ లో పెట్టి, రైల్ ఎక్కి , ‘బ్రతుకు జీవుడా అనుకుని. వనజా! నేను అర్జెంట్ గా ఆఫీసు కు వెళ్తున్నాను. స్కూల్కెళ్ళి పిల్లల్ని తీసుకురా. పేరంటానికి నీ ఫ్రెండ్ కుసుమతో కలిసి వెళ్ళు. షాప్పింగ్కు రేపు తీసుకెళ్తాను’ అని రాంబాబు ఫోన్ చేసి చెప్పాడు.

‘మతిలేని మనుషులూ. మతిలేని పనులూ. మతి స్థిరం తక్కువ. ఉద్యగాలు ఇళ్ళలో కుదరవు. ఆయన హాయిగా ఆఫీసుకు వెళ్తేనే మంచిది. ‘ అని విసుక్కుంటూ వనజ బద్ధకంగా లేచి పిల్లలికోసం స్చూల్కి బయలు దేరింది.