ఇంటి పనులు పంచుకుందాం

ఇంటి పనులు పంచుకుందామంటున్న ఎన్టీఆర్

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా సినిమా పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు తమకు ఇష్టమైన పనులను చేస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా ‘బీ ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ని రాజమౌళి నుంచి స్వీకరించిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, తన ఇంట్లోని వస్తువులను, వంటగదిలోని అంట్లను, ఇంటి ముందున్న చెత్తను శుభ్రం చేశాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్‌ చేస్తూ..‘‘మన ఇంట్లో ప్రేమలు అప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. వర్క్‌లోడ్‌ని షేర్‌ చేసుకోవడం చాలా సరదాగా ఉందంటూ’’ పేర్కొన్నాడు. పనిలో పనిగా ‘బీ ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ని తన బాలా బాబాయ్‌తో పాటు, చిరంజీవి, నాగార్జున బాబాయ్, వెంకీమామ గారు, శివ కొరటాల గారు..అంటూ ఛాలెంజ్‌ విసిరారు. తొలిసారిగా ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు వంగా సందీప్‌ రెడ్డి రాజమౌళికి ‘బీ ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ని షేర్‌ చేయగా, రాజమౌళి విజయవంతంగా తన భార్య రమా రాజమౌళికి సాయపడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నటులైన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి ఛాలెంజ్‌ చేసిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రీటీలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, క్షేమంగా ఉంటూ తమ సమయాన్ని ఇలా కుటుంబ సభ్యుల మధ్య సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Send a Comment

Your email address will not be published.