ఉగాది కవిత

చైత్ర మాస ఆగమనంతో
వసంతంలో ప్రకృతి అందాలతో
చైత్ర రథంపై వచ్చే వసంతునికి
ఆనందోత్సాహాలతో మనఃస్పూర్టిగా
శార్వరి నామ సంవత్సరానికి
స్వాగతం సుస్వాగతం పలుకుతూ
ముంగిట ముత్యాల ముగ్గులు
గుమ్మానికి మామిడాకుల తోరణాలు
కూకూ యని కోయిలమ్మల రాగాలు
ముచ్చటైన చిలకమ్మల పలుకులు
తన్మయముతో నాట్యమాడే నెమలులు
గుత్తులు గుత్తులుగా వేప పువ్వులు
కొమ్మలు విరిగేలా మామిడి కాయలు
విరబూసిన బొండుమల్లియల సౌరభాలు
పెద్దవాళ్ళ పలకరింపులు, పసిపిల్లల కేరింతలు, ఆటపాటలు
అభ్యంగన స్నానాలు, పట్టు వస్త్రాల రెపరెపలు
వాత, పిత్త, కఫ దోషాలను హరించే
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం
పులిహార, బక్ష్యాలు, బూరెల ఆరగింపులు
మంగళ కర్పూర నీరాజనాలతో దేవతారాధన
భవిష్యత్తు గురించి తెలిపే పంచాంగ శ్రవణం
తెలుగు జనావళి విభిన్న సంస్కృతులతో
ఉరకలు వేసే ఉత్సాహంతో
అవధులు లేని ఆనందంతో
నూతన కోరికలతో ఆశలతో
సరిక్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ
అన్ని రంగాలలో విజయం మనల్ని
వరించాలని, కారోనా వైరస్ ను
సమూలంగా నిర్మూలించాలని
అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ
ఈ నూతన సంవత్సరంలో ప్రతీ ఉదయం
కావాలి శుభోదయం
———– — రమా నరసింహా రావు, న్యూ జిలాండ్