వైభవంగా తెలుగు మహాసభలు
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా అయిదవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు లాల్ బహదూర్ స్టేడియంలో జ్యోతి వెలిగించి ఈ సభలను ప్రారంభించారు. ఎనిమిది వేల మందికి పైగా దేశ విదేశీ ప్రతినిధులు పాల్గొన్న ఈ సభలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సభలలో నరసింహన్, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలుగులోనే ప్రసంగించడం విశేషం. వెంకయ్య నాయుడుకు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పారు. తన గురువు మృత్యుంజయ శర్మకు ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు. తెలుగు ఔన్నత్యం, తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి వెంకయ్య నాయుడు తగిన సూచనలిచ్చారు. మాతృ భాషని మృత భాష కానివ్వ వద్దని వెంకయ్య నాయుడు కోరారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోనూ తెలుగునే ప్రవేశపెడతామని, పన్నెండవ తరగతి వరకూ తెలుగు మాధ్యమమే కొనసాగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సభలు పందొమ్మిదో తేదీ వరకు కొనసాగుతాయి. సభల సందర్బంగా అనేక సాంస్కృతిక, సినిమా, కళా
ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తమ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ తన బాల్యంలో తెలుగు పద్యాలనూ చదవటం, వ్రాయటం గురించి వివరించారు. వారు కొన్ని వేమన, సుమతీ, దాసరధీ శతకాలను ఆలవోకగా పాడి ప్రేక్షకులందరినీ సమ్మోహనపరిచారు. తెలుగు వెలుగుకు తాను కంకణ బద్దుడనై ఉంటానని భావావేశంతో మాట్లాడారు. తెలుగు పూర్వ కవులు నన్నయ, పోతన, పాల్కుర్కి వంటి మహా కవులనుండి ఇప్పటి కవులు గోరేటి వెంకన్న, అందెశ్రీ మొదలైన వారినందరికీ జోహార్లు అర్పించారు. అరగంటసేపు ప్రసంగంలో తెలుగు భాషపై తనకున్న పట్టు, అభిమానం, ఆప్యాయత ఒక సాహితీమూర్తిగా చాటి చెప్పుకున్నారు.
శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ మాతృ భాష రెండు కళ్ళ లాంటిదని, ఇతర భాషలు కళ్ళద్దాలు లాంటివని మొదట కళ్ళు ఉంటేనే కల్లద్దాలకు అందమని చెప్పారు.
రెండోరోజు అనేక కవి సమ్మేళనాలు, అవధానాలు, బాల సాహిత్యం మొదలైన అంశాల మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి.