ఎ ఎన్‌ ఆర్‌ అవార్డ్స్‌ స్థాయి పెరగాలి

ఎ ఎన్‌ ఆర్‌ అవార్డ్స్‌ స్థాయి పెరగాలి

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం స్థాయికి ఎ ఎన్‌ ఆర్‌ అవార్డ్స్‌ చేరాలి : చిరంజీవి

ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులా ఏదొక రోజుకు ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్స్‌ మారిపోతుందని, ఆ స్థాయి వచ్చేస్తుందని చిరంజీవి అన్నారు. ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు. ఏఎన్నార్‌ పురస్కారాన్ని రేఖ అందుకున్నారు. శ్రీదేవి తరఫున బోనీ కపూర్‌ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఈ పురస్కారం తీసుకుంటున్నప్పుడు, మాట్లాడమన్నప్పుడు బోనీ కపూర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీదేవికి ఈ పురస్కారం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి మాట్లాడుతూ ‘ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటనను కథలా చెప్పి ప్రారంభిస్తా…అదొక పల్లెటూరి. కొత్తగా పెళ్లయిన జంట. ఆవిడ గర్భవతి. దాదాపుగా నవమాసాలు నిండాయి. రేపుమాపో డెలివరీ అయ్యే సమయం. రేపొద్దున కన్న తర్వాత సినిమా చూడడం సాధ్యం కాదనో ఏమో.. తన అభిమాన నటుడు సినిమా విడుదలైంది. చూడాలి అని తన కోరికను ఆవిడ భర్తకు చెప్పుకుంది. ఈ సమయంలో ఎలా వెళతామంటే తప్పదు వెళ్లాలి అంది. దానికి ఆమె భర్త సరే..వెళదాం అన్నాడు. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు.. పక్కనున్న టౌన్‌కి వెళ్లాలి. రవాణా సౌకర్యం లేదు. గతుకుల రోడ్డు. సరే కూర్చొని జట్కా బండిమీద వెళుతున్నప్పుడు…ఎదురుగా ఎద్దులు, ఆవులు మంద వస్తుండగా ఈ జట్కా బండి అటూ ఇటూ వెళ్లడంతో గోతుల్లో పడిపోయింది. అందులో ఉన్న జంట కూడా కింద పడిపోయింది. భర్త ఎంతో ఆందోళనకు గురై ఆమె వద్దకి వెళ్లి దెబ్బలు తగిలాయా? అని అడిగితే చిన్న దెబ్బలే ఏం ఫర్వాలేదు అని చెప్పింది. ఇక సినిమాకు వద్దు వెళ్లిపోదామన్నాడు. లేదు చూడాల్సిందే అంటే చివరకు వెళ్లారు.. సినిమా చూశారు. ఈ కథలో ఆమె ఎవరో కాదు…మా అమ్మ అంజనా దేవి. ఆవిడ భర్త నా తండ్రి. ఆ పల్లెటూరు మొగల్తూరు. ఆ సినిమా ‘రోజులు మారాయి’. ఆ కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. అమ్మకి ఆయన సినిమాలంటే అంత పిచ్చి. ఆ కడుపులో ఉన్నది నేనే. అమ్మకు సినిమా అంటే ఇష్టం కాబట్టే నాకు ఇష్టమైందేమో. అందువల్లే నా చదువు అయిన తర్వాత సినిమా ఇండిస్టీకి వచ్చాను.

మహామహులు ఇండిస్టీని యేలుతున్న రోజులవి. అక్కినేని, ఎన్టీఆర్‌ వంటి వారంతా ఆ సమయంలో చేస్తున్నారు. అటువంటి సమయంలో నేను నిలదొక్కుకోవడం గర్వంగా భావిస్తున్నా. అక్కినేనితో నేను ‘మెకానిక్‌ అల్లుడు’ చేశాను. మామ అల్లుళ్లుగా చేయడం, అతనితో పరిచయం ఏర్పడడం జరిగాయి. ఆ సమయంలో ఇంటికి రమ్మనేవారు. ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెబుతుండేవారు. నిర్మాతల పట్ల, ఇతరులతో ఎలా ఉండాలో చెప్పేవారు. ఆయన మాట్లాడితే నేను శ్రోతనే తప్ప. మాట్లడలేను. ఆయన నడిచే నిఘంటవు. ఓ ఎన్‌సైక్లోపీడియా. ఆయన మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండేవారు.

నేను నడవలేనా? అన్నారు
సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్లిలో ఓ స్టేజీ వేశారు. హేమామాలిని డాన్స్‌ అయ్యాక నేను, నాగేశ్వరరావుగారు మెట్లు ఎక్కుతున్నప్పుడు వయసు పైబడింది… కాస్తా చెయ్యిద్దాం అనుకుంటే ఏంటీ నేను నడవలేనా? అన్నారు. అప్పుడు అయన వయసు 98ఏళ్లు. నాగేశ్వరరావు చనిపోయే ముందు కూడా ఎంతో ధైర్యంగా బలంగా ఉండేవారు. అది నాకెంతో స్ఫూర్తివంతం. ఆఖరి రోజుల్లో ఆయన మంచం మీద ఉన్నప్పుడు నేను వచ్చి మాట్లాడితే ఆయనెంతో రిలీఫ్‌ ఫీలయ్యేవారు. ఆ విషయం నాతో సుశీల గారు అంటుండేవారు. మనం ఉన్నా లేకున్నా ఈ జనంలో మనం ఉండాలని ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డ్స్‌’ పెట్టారు. ఏదొక రోజుకు ఇదొక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుగా మారిపోతుంది. ఏఎన్నార్‌ ఆశయాలు, జ్ఞాపకాలను నాగార్జున సజీవంగా ఉంచుతారు. భౌతికంగా దూరమైనా అక్కినేని మనందరి మనసుల్లో ఉంటారు. ఈ అవార్డును నా చేతుల మీదుగా ఇద్దరు బహుముఖ ప్రజ్ఞావంతులకు ఇవ్వడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. నాగార్జున నాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషాన్నిచ్చారు. దక్షిణ భారతదేశం, తెలుగు నేల తల్లితో సంబంధం ఉన్న సురేఖ, శ్రీదేవి గారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది ఎంతో గౌరవం. మనకెంతో గర్వకారణం.

శ్రీదేవికి సినిమాయే ప్రపంచం
శ్రీదేవి మన మధ్య లేరు. ఆవిడికి సినిమా తప్ప మరో ధ్యాస లేదు. ఆవిడతో నేను రెండు మూడు సినిమాలు చేశాను. చిన్న గ్యాప్‌ వస్తే చాలు తర్వాత సినిమా ఎలా చేయాలనే ఆలోచిస్తారు తప్ప మరొకటి చేయరు. ఆవిడ మన మధ్య లేకపోవడం అనేది కలైతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎవరికీ లేనట్టువంటిది ఆమె అన్ని భాషల్లో చేసిన లేడీ సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ఇండియాను కోల్పోవడం బాధాకరం. మళ్లీ ఈ అవార్డు ఇచ్చి శ్రీదేవిని గుర్తు చేసుకోవడం బాగుంది. రాజ్యసభలో గొడవగొడవగా ఉంది. నాకెందుకులే అని సెల్‌ఫోన్‌ చూసుకుంటుంటే అంతా ఓ వైపు నిలబడి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారా? అని నేను చూశాను. ఆ సమయంలో రేఖగారు రాజ్యసభకు వస్తున్నారు. వాళ్లేదో సమస్యలపై చర్చించుకుందామనుకుంటే ఆ రోజు ఏం చర్చించుకోలేదు. ఆ రోజు నుంచి ఆమె గెస్ట్‌గానే వచ్చేవారు. అదీ ఆమె ఏజ్‌లెస్‌ బ్యూటీ, స్టన్నింగ్‌ గ్లామర్‌. అటువంటి వ్యక్తి చేతుల మీదగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేనిది. నేను కాలేజీ పూర్తయిన దగ్గర నుంచి ఆమె సినిమాలు చూస్తున్నా. ఫిల్మ్‌ ఇండిస్టీకి వచ్చిన తర్వాత కూడా చూస్తూనే ఉన్నా. రేఖగారంటే ఎంతగా ఇష్టపడతానో అంతలా ఇష్టపడతా. ఆ విషయా నికి ప్రకృతి స్పందిం చిందేమో నాకు భార్యగా సు’రేఖ’ దొరికింది. అందరూ సురేఖ అని పిలు స్తారు. కానీ నేను మాత్రం రేఖ అని పిలుస్తా’ అని చెప్పారు.

నా ఈ స్థాయికి నాగేశ్వరరావే కారణం : రేఖ
రేఖ మాట్లాడుతూ ‘నేను తెలుగు ఇండిస్టీలో 10ఏళ్లు పనిచేశాను. చిన్నప్పుడు మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు ‘ఆ అబ్బాయి చాలా ఫన్నీ, చాలా ఫోకస్డ్‌. చాలా గ్రేట్‌ పెర్సన్‌. కానీ ఒకసారి కెమెరా అన్‌ అయితే అదరగొట్టేస్తాడు’ అనే వారు. ఆ అబ్బాయి ఎవరా?అని ఆరా తీస్తే అక్కినేని నాగేశ్వరరావుగారే. ఇక్కడ నేనే నిలుచున్నానంటే దానికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ నాగేశ్వరరావు గారు, అంజలి అత్తయ్యే కారణం. ఆయన సినిమా చూస్తేంటే…ఏంటో ఫ్యాంటసీ. ఏంటో రొమాన్స్‌ అనుకున్నా. అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్‌ ఉండేది కానీ మొదట్లో నాగేశ్వరరావుగారితో గడిపే అవకాశం ఉండేది కాదు. బంజారాహిల్స్‌లో ఉండేదాన్ని. ఆ పక్కనే నాగేశ్వరరావు, సుబ్బిరామిరెడ్డి ఇల్లులు. నేను బయట నాగేశ్వరరావుగారికి ఓ దండం పెట్టి మీ అంతట స్టార్‌ని అయ్యేలా చూడాలని కోరుకునే దాన్ని. ఇలా రోజు చేస్తుంటే ఆయనే ఓ రోజు లంచ్‌కి పిలిచ్చారు. భోజనానికి అంతా కూర్చొన్నాం. అప్పుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘నేను నిన్ను గమనిస్తున్నా. ఏడు గంటలకే ఇలా వెళతావు. దండం పెట్టుకుంటావు…అన్నీ చూస్తున్నా.. అని అన్నారు. ముందు ఫిట్‌గా ఉండాలి. ఈత కొట్టాలి ఇలా అంటుండేవారు. నీ మెదడులో, శరరీంలో ఏం పెట్టుకున్నావో అదే నడుస్తూ ఉంటుంది. ఓ సారి హాస్పటల్‌కి వెళ్దామన్నప్పుడు నాన్నని ఎందుకులే అన్నా…అప్పుడు ఆయన డాక్టర్స్‌ సేవ్‌ లైఫ్స్‌, యాక్టర్స్‌ సేవ్‌ సోల్స్‌’ అన్నారు. ఈ రెండు మాటలూ జీవితాంతం అనుసరిస్తూనే ఉన్నా. బ్రెయిన్‌ అనేది ఆటలాడేస్తుంటది. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. అందం అనేది దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా జీన్స్‌ నుంచి వచ్చిందే. అంజలి అత్తయ్య నాకు బ్రేక్‌ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నా ఇల్లు. నాగేశ్వరరావు నా హృదయంలో కూడా ఉన్నారు. అమ్మ నీ ఫ్యూచర్‌ ఇక్కడే అనేవారు. ప్రతి నటీనటులకు ఒడుదుడుకులు ఉంటాయి. అవి నా జీవితంలో 18 ఏళ్లకే వచ్చాయి. ముంబాయిలో ఉన్నప్పుడు నాకు తెలుగులో చేసే అవకాశం వచ్చింది. తెలుగులో చేస్తే మీ పేరు కనిపించేటట్టు ఉంటుందని అనేవారు. అమ్మకోసం మళ్లీ తెలుగులో ఓ సినిమా చేయమన్నారు. త్వరలో చేస్తా. తెలుగు శ్రీదేవిలా మాట్లాడాలి. ఆమె నా చిన్నారి చెల్లి. ప్రపంచంలో గొప్ప నీటమణుల్లో ఆమె ఒకరు. ఆన్‌స్క్రీన్‌లోనూ, ఆఫ్‌స్క్రీన్‌లో ఆమె చాలా శక్తివంతురాలు” అని చెప్పారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండిస్టీ ఉన్నంతకాలం ఏఎన్నార్‌ అవార్డ్స్‌ ఉంటాయని చెప్పారు. అనంతరం సుబ్బిరామిరెడ్డి మాట్లాడారు.

Send a Comment

Your email address will not be published.