ఏమైపోయిందీ తెలుగు జాతి?

సమైక్య సంక్షోభం
వేర్పాటే విషవృక్షం
బూడిదలో కలసిన
అమరజీవుల ఆశయం

ఇదో రాజకీయ కుతంత్రం
అభాగ్య జీవుల చెలగాటం
క్షుద్ర నాయకులే దుండగులు
కలుషిత మనుషులే ఆయుధాలు

ఒకనాటి నిజాం పాలనలో ఘోరాతి ఘోరాలు
పిదప పటేళ్ళ పట్టున పట్టరాని అరాచకాలు
ఫలితం పదహారణాల తెలుగు వాడిఫై నిరాధార నిందలు
నమ్మకమనే కోటను కూల్చి విరిచి విసిరేసిన స్తంభాలు

తిరోగమనమే వెనకబడటానికి కారణం
కృషిహీనమే బడుగుతనానికి మూలం
క్రియాశూన్యతే బీదరికానికి బీజం
శ్రమలేనిదే ఫలితాలు రావనేది నిజం

కొత్త కాంట్రాక్టులకై వేచియున్న విషనాగులు
భయపెట్టి బెదిరించి దోచుకునే బిచ్చగాళ్ళు
భారతీయ ధర్మాన్నే చెరపట్టిన దుశ్శాసనులు
కల్పవృక్షాన్ని నిలువారా నరికిన కలియుగ రావణులు

కంట తడితో తెలుగు తల్లి దీన స్థితి
ఎంతో దయనీయం
కమ్మనైన తెలుగు భాషకిది
తీరని పరీక్షా సమయం

గత చరిత్ర చూసుకో
తెలియనిది తెలుసుకో
తెలుగోడా! నిన్ను నువ్వు మోసం చేసుకోకు
జాతి ప్రతిష్టకు మంట పెట్టమాకు

కలసి చాటుదాం తెలుగు వారి సమైక్య సద్భావన
సమిష్టిగా చేద్దాం తెలుగు తల్లికి ఆరాధన
సంస్కరించుకుందాం మనలోని విభేదాల ఆలోచన
తెలుగు తల్లికిదే మనః పూర్వక నీరాజన ప్రేరణ.