కంగనా నటవిశ్వరూపం ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’
హీరోయిన్ ఓరియెంటెద్ చిత్రాల్లో నటించే హీరోయిన్లలో కంగనా రనౌత్ ముందుంటారు. అందుకే భారత వీరనారి.. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించే అవకాశం కంగనాకు దక్కింది. ఝాన్సీ రాణి పాత్రలో ఆమె నటించిన తాజా చిత్రం ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, కంగనా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తున్నారంటూ చిత్రీకరణ ప్రారంభం నుంచి వివాదాలు వచ్చాయి. అయినా ఎటువంటి అవాంతరాలు లేకుండా ‘మణికర్ణిక..’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదీ కథ:
బెనారస్లోని బితూర్‌లో పుట్టి పెరిగిన మణికర్ణిక (కంగనా రనౌత్)కు ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావు (జిషు సేన్‌గుప్తా)తో వివాహమవుతుంది. ఝాన్సీ రాజ్యానికి వెళ్లాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మారుస్తారు. దీంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా రాజ్యంలోని ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటుంది. రాజ్యానికి సరైన రాణి అని అందరూ ప్రశంసిస్తుంటారు. అదే సమయంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరిస్తుంటుంది. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు బ్రిటీష్ పాలకులు చేసే ప్రయత్నాలను లక్ష్మీబాయి తిప్పికొడుతుంది. వారితో చర్చలకు నిరాకరిస్తుంది. దీంతో అహం దెబ్బతిన్న బ్రిటీష్ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఎత్తులు వేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఝాన్సీ స్వాతంత్ర్యం కోసం లక్ష్మీబాయి ఏ విధంగా పోరాడింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల తీరు:
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఈ చిత్రంతో నట విశ్వరూపం చూపించింది. యుక్తవయసులో చిరునవ్వుతో ఆనందంగా గడిపిన మణికర్ణిక నుంచి రణరంగంలో కత్తి దూస్తూ రౌద్ర రూపం దాల్చిన లక్ష్మీబాయి వరకు ఆమె జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో వాటన్నిటినీ కంగనా చూపించి మెప్పించింది. ఈ చిత్రం కంగనా నట జీవితంలో మైలురాయిగా మిగులుతుందనడంలో సందేహం లేదు. లక్ష్మీబాయి భర్త గంగాధర్‌రావు పాత్రలో జిషు సేన్‌గుప్తా, గౌస్‌ఖాన్ పాత్రలో డానీ డెంగోజపా, ఝల్కరీబాయి పాత్రలో అంకితా లోఖండే ఇతర నటీనటులు పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.
విశ్లేషణ:
బ్రిటీష్ పాలకులు రాకముందు భారతదేశం ఎలా ఉండేదో వివరిస్తూ అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ వెంటనే కథ మణికర్ణికవైపు తిరుగుతుంది. ప్రథమార్ధంలో చిన్నతనం నుంచి మణికర్ణిక ఎదిగిన విధానం.. ఆమె చూపిన ధైర్యసాహసాలు.. వివాహం అనంతరం ఝాన్సీలో ఆమె జీవితం ఎలా ఉండేదో చూపించారు. ద్వితీయార్ధంలోలోనే అసలు కథ మొదలవుతుంది. ఝాన్సీని వశం చేసుకునేందుకు బ్రిటీష్ పాలకులు వేసే ఎత్తులు.. యుద్ధం సమయంలో లక్ష్మీబాయి విరోచిత పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించారు. మనకు తెలిసిన కథే కాకుండా ఝాన్సీ కుటుంబం అంతర్గతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, మీరట్ సిపాయి తిరుగుబాటు సహా 1800 కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను కథలో భాగం చేశారు దర్శకులు క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్. దీంతో సినిమా మొత్తం ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు చాలా బాగున్నాయి. విజువల్‌గా సినిమా అద్భుతంగా ఉంది. అయితే కొన్ని చోట్ల అనవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాల కోసం నిజంగానే ఆ కాలం నాటి ఆయుధాలను వినియోగించినట్లు చిత్ర బృందం చెప్పింది. వారు చెప్పినట్టుగానే యుద్ధ సన్నివేశాలు సహజంగా కనిపించినా.. కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. సినిమాటోగ్రాఫీ ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. సంగీతం సినిమాకి బలం అని చెప్పలేం కానీ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేపోయినా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటులు: కంగనా రనౌత్, అంకితా లోఖండే, అతుల్ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, సురేశ్ ఒబేరాయ్, డానీ డెంగోజాపా
సంగీతం: శంకర్-ఇసాన్-లాయ్, సినిమాటోగ్రాఫీ: కిరణ్ డియోహన్స్, జ్ఞానశేఖర్. వి.ఎస్, కథ: కె.వి. విజయేంద్ర ప్రసాద్, ఎడిటింగ్: రామేశ్వర్ భగత్, సూరజ్ జగ్తప్, నిర్మాణం: జీ స్టూడియోస్, కమల్ జైన్, నిశాంత్ పిట్టి, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్