కంటి చూపే...బతుకు వెలుగు

కళ్లు సరిగా పనిచేస్తుంటేనే ఎవరైనా కళకళలాడుతూ కనిపిస్తారు. అప్పుడే పుట్టిన పసిపాప నుంచి వృద్ధుల వరకూ ఎవరికైనా కళ్లల్లోనే జీవం చైతన్యం రూపంలో తొణికిసలాడుతుంటుంది. కళ్లకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలు. కళ్లపై ఒత్తిడి నుంచి, శాశ్వతంగా చూపుని దూరం చేసే గ్లకోమా వరకూ ఇవి ఉన్నాయి. కళ్ల వ్యాధులకు రకరకాల కారణాలున్నాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవైతే, మరికొన్ని జీవనశైలి వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, అలర్జీల వల్ల, వయసు పెరగడంతో వచ్చేవి.

కంటిచూపు సరిగ్గాలేకపోతే.. చుట్టూ ఉన్న పరిసరాలను, ఎదురుగా ఉన్న దేనినీ చూడడానికి వీలుకాదు. అందుకే మిగిలిన అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేస్తూ కూడా కంటిచూపు సరిగా లేకపోతే అదొక పెద్ద ఆరోగ్య సమస్యగానే భావించాలి. శరీరంలో అతి సున్నితమైన అవయవాలూ కళ్లే. జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని చిన్న సమస్యలైతే, కొన్ని కంటిచూపును దెబ్బతీసేవీ ఉంటాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే.. కంటిచూపును కాపాడుకోవచ్చు.

ఒత్తిడితో కళ్లు అలసిపోతే ..
మనమంతా ఇప్పుడు డిజిటల్‌ యుగంలో ఉన్నాం. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఇడీ స్క్రీన్లు, భారీ లైటింగులు ఇలా ఒకటేమిటి ఎటువైపు చూసినా అన్నీ కళ్లపై ఒత్తిడిని పెంచుతున్నవే. అంతేకాదు ఎక్కువ దూరం వెళ్లడానికి చాలా సమయం పాటు డ్రైవింగ్‌ చేయడం కూడా కంటిపై ఒత్తిడి పెంచుతుంది. అన్నేసి గంటల పాటు విరామం లేకుండా చూస్తూ ఉండడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. దాంతో వాటికి విశ్రాంతి అవసరం. కానీ, వీటికి విశ్రాంతినిచ్చేవాళ్లు అరుదుగా ఉంటున్నారు. అధికశాతం మంది తమ కళ్లు ఎంత అలసిపోతున్నా, విశ్రాంతిని కోరుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లు అలసిపోయినప్పుడు కలిగే లక్షణాలను గమనించి, తగిన విశ్రాంతి వంటి జాగ్రత్తలు తీసుకోకుండా రకరకాల కళ్లద్దాలు కొనుక్కుని, కళ్లని మరింత పనిచేయిస్తూ వాటిపై ఒత్తిడిని పెంచుతున్నారు. అలా చేయకుండా ఈ సమస్య ఎదురైతే నేత్రవైద్యుడిని సంప్రదించాలి.

కళ్లల్లో ఎరుపుదనం
red eyeచూడడానికి తెల్లగా మధ్యలో నల్లని కనుపాపతో కనిపిస్తున్నా కంటి ఉపరితలం అంతా రక్తనాళాలతో నిండి ఉంటుంది. కళ్లు ఏదైనా అసౌకర్యానికి గానీ, ఇన్ఫెక్షన్‌కు గానీ గురయినప్పుడు ఈ రక్త నాళాల పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబారిపోతాయి. కంటిపై ఒత్తిడి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో రక్త నాళాల పరిమాణం పెరిగిపోయి, కళ్లు ఎర్రగా మారుతుంటాయి. తగినంత నిద్ర లేకపోవడం, అలర్జీలు, గాయాలకు గురైనా ఈ లక్షణం కనిపిస్తుంది. కంజెంక్టివైటిస్‌ అనే మరో సమస్య కూడా కళ్లని ఎర్రగా మారుస్తుంది. సుదీర్ఘకాలంపాటే సూర్యకిరణాల తాకిడికి గురైన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందువల్ల కళ్లు బాగా ఎరుపురంగుకు మారితే సమస్య ఏమిటన్నది తెలుసుకుని, వెంటనే చికిత్స పొందడానికి నేత్రవైద్య నిపుణుడిని సంప్రదించాలి.

మెల్ల కన్ను
కొంతమందికి తాము చూస్తున్న సమయంలో కళ్లు రెండూ ఒకే కోణంలో ఉండవు. ఈ సమస్యను మెల్లకన్ను అంటారు. ఈ సమస్య ఉన్న వారి కళ్లు వారి నియంత్రణలో ఉండకుండా అసంకల్పితంగా అటూ ఇటూ కదులుతుంటాయి. కొంతమందిలో పుట్టుకతోనే ఈ సమస్య మొదలుకావొచ్చు. అయితే దీనిని సరిచేయడానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయి. విజన్‌ థెరపీ ద్వారా కళ్లను బలోపేతం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి సర్జరీ కూడా అవసరమవుతుంది. ఇది పరిష్కారం లేని సమస్య ఎంత మాత్రమూ కాదు.

రే చీకటి
రాత్రి వేళల్లోనూ, తక్కువ వెలుగున్న ప్రాంతాల్లో కొంతమందికి కంటిచూపు సక్రమంగా ఉండదు. కళ్ల ముందు ఏముందో కన్పించక ఆందోళన పడుతుంటారు. మరీ దగ్గరకు వచ్చే వరకూ ఏమీ కనిపించవు. థియేటర్‌లో దారి కనిపించకపోవడం కూడా ఇలాంటి సమస్యే. ఈ లక్షణానికి రేచీకటి, మయోపియా (దూరం చూపు సమస్య) కారణం కావచ్చు. లేదా క్యాటరాక్ట్‌, కెరోకోనస్‌, విటమిన్‌ ఏ లోపం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడే అవకాశముంది. కొందరిలో పుట్టుకతో కూడా ఈ సమస్య ఉంటుంది. దీనికి కారణమేమిటో వైద్యులే పరీక్షల ద్వారా నిర్ధారించి, చికిత్స చేస్తారు. అయితే ఇందులో రెటీనాకు సంబంధించి మాక్యులర్‌ రీజెనరేటివ్‌ సమస్యకు చికిత్స లేదు. ఇటువంటి వారు తక్కువ వెలుగులో జీవితాంతం జాగ్రత్తలు తీసుకొని, మసలుకోవాలి.

యువెటిస్‌
శరీరానికి వచ్చే కొన్నిరకాల వ్యాధుల వల్ల కంటిలోపలి నల్లగుడ్డు వాపునకు దారితీస్తుంది. కంటి మధ్యలోని ఈ భాగం ఎన్నో రక్త నాళాల సమూహం. ఈ వ్యాధులు కంటి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దాంతో కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏ వయసు వారికైనా ఈ సమస్య వచ్చిన వెంటనే తగ్గిపోతుంది. కొంతమందిలో దీర్ఘకాలం పాటు ఈ సమస్య కొనసాగొచ్చు. ఎయిడ్స్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ ఎక్కువగా యువెటిస్‌కు కారణం అవుతాయి. ఈ సమస్య వస్తే చూపు మసక బారిపోవడం, కళ్లు నొప్పిగా ఉండడం, ఎర్రబారడం వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. అయితే చికిత్స అనేది ఏ తరహా యువెటిస్‌ అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

హ్రస్వ దృష్టి
హ్రస్వ దృష్టినే ప్రెస్బిమోపియా అంటారు. ఈ సమస్య ఉన్నవారికి దూరం చూపు బాగానే ఉన్నా, కంటికి దగ్గరగా ఉన్న వాటిని చూడడంలో కష్టంగా ఉంటుంది. సాధారణంగా 40 ఏళ్ల వయసులో ఇది ఎవరికైనా వస్తుంటుంది. ఈ సమస్యతో ఉన్నవారు చదివే సమయంలో పుస్తకాన్ని కంటికి కొంచెం దూరంగా ఉంచి, చదువుతుంటారు. రీడింగ్‌ గ్లాసెస్‌ వాడడం ద్వారా ఈ సమస్య నుంచి కొంతవరకూ బయటపడొచ్చు. కాంటాక్టు లెన్స్‌, లాసిక్‌ తరహా సర్జరీలతోనూ ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది.

వర్ణ అంధత్వం
వర్ణ అంధత్వాన్ని కలర్‌ బ్లయిండ్‌ నెస్‌ అని వ్యవహరిస్తారు. కొంతమందిలో కొన్ని రకాల రంగుల్ని గుర్తించలేరు. రంగుల మధ్య తేడాని కూడా పోల్చలేరు. ఎరుపు, ఆకుపచ్చ మధ్య తేడాలను గుర్తించలేని పరిస్థితి వీరిలో అతి సాధారణం. కంట్లోని కలర్‌ సెల్స్‌ అచేతనంగా మారిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది తీవ్రంగా ఉన్న వారికి ఆయా రంగులు కేవలం బూడిద రంగులోనే కనపడతాయి. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు. లేదా కొన్ని రకాల మందులు, వ్యాధుల వల్ల కూడా దీని బారిన పడొచ్చు. మహిళల్లో కంటే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతో ఈ సమస్య ఉంటే దాన్ని సరిచేయలేరు. ఆ తర్వాత ఏర్పడిన వారికి కొన్ని రకాల గ్లాసెస్‌తో తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు.

కండ్ల కలక
eye-dropదీనినే కంజెంక్టివైటిస్‌ అంటారు. ఈ సమస్య వస్తే కనురెప్పల వెనుకనున్న కణజాలం వాచిపోతుంది. దీంతో కళ్లు ఎర్రబారడం, దురద, మంట, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ వయసువారికైనా ఇది రావచ్చు. ఇన్ఫెక్షన్‌, రసాయనాల వల్ల ఇరిటేషన్‌కు గురైన సమయాల్లోనూ, అలర్జీల కారణంగా ఈ సమస్య ఎదురవుతుంది. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగతమైన శుభ్రత వంటివాటితో ఈ సమస్యని దూరంగా ఉంచొచ్చు.

ఫ్లోటర్స్‌
చిన్న సైజులో చుక్కలు, మచ్చలు కంటి చుట్టూ కదులుతూ కన్పిస్తుంటాయి. ఎక్కువ వెలుగున్న చోట, మండే ఎండలో దీన్ని గుర్తించొచ్చు. ఇవి సహజమే అయినప్పటికీ ఒక్కోసారి తీవ్రమైన సమస్యలకు ఇవి కారణం కావొచ్చు. రెటీనల్‌ డీటాచ్‌మెంట్‌లో కంటి వెనుకనున్న రెటీనా పక్కకు జరుగుంది. ఇలా జరిగినప్పుడు లైట్‌ ఫ్లాషెస్‌ కూడా కనిపిస్తుంటాయి. నీడలు కూడా వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా తరచుగా చుక్కలు కనిపిస్తూ వాటి సంఖ్య కూడా పెరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కళ్లు పొడిబారడం
కళ్లు పొడిబారిపోవడాన్ని డ్రై ఐస్‌ అంటారు. తగినంత నీరు కళ్లలో ఉత్పత్తి కానప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అరుదుగా ఇలా పొడిబారిపోవడం వల్ల కంటిచూపు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేక ఐ డ్రాప్స్‌ను వాడడం ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. దీనికి న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లను కూడా డాక్టర్‌ సలహాపై వాడుతుండాలి.

కళ్ల నుంచి నీరు కారడం
కంట్లో ఉండాల్సిన నీటి పరిమాణం తగ్గిపోవడం ఒక సమస్య అయితే, పెరిగిపోవడం కూడా సమస్యే. కాంతి, గాలి లేదా ఉష్ణోగ్రత విషయంలో సెన్సిటివ్‌గా ఉండే వారి కళ్లల్లో అధికంగా నీరు కారడం కనిపిస్తుంది. అందుకే బయటి అంశాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

క్యాటరాక్ట్‌
కంట్లో ఉండే లెన్స్‌ ఆరోగ్యంగా ఉంటే అవి కెమేరా కళ్లలా ఉంటాయి. బయటి దృశ్యాలకు చెందిన వెలుగు నేరుగా రెటీనాకు వెళ్లిపోవాలి. అప్పుడే చూపు బాగుంటుంది. క్యాటరాక్ట్‌ సమస్యలో వెలుగు అంత సాఫీగా రెటీనాను చేరదు. దీంతో చూపులో స్పష్టత తగ్గుతుంది. రాత్రి సమయాల్లో బల్బ్‌లను చూస్తున్నప్పుడు చుట్టూ వృత్తంలా కనిపిస్తుంది.ఈ క్యాటరాక్ట్‌ సమస్య ఒక్కసారిగా ఏర్పడదు. కొద్దికొద్దిగా పెరుగుతుంది. నొప్పి, ఎర్రబారడం, నీరు కారడం తరహా లక్షణాలేవీ ఇందులో ఉండవు. ముదిరిపోతే చూపుని కోల్పోక తప్పదు. ఈ సమస్యని సర్జరీ ద్వారా పరిష్కరించవచ్చు.

గ్లకోమా
కంటిచూపును పూర్తిగా దెబ్బతీసే సమస్య గ్లకోమా. కంట్లో కొంత ఒత్తిడి అన్నది సహజంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అది పెరిగిపోతే ఆప్టిక్‌ నెర్వ్‌ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని కల్పించే కొన్ని వ్యాధుల సమూహమే గ్లకోమా. ఈ సమస్య బారిన పడిన వారిలో తొలి నాళ్లలో ఎటువంటి లక్షణాలూ బయటపడవు. కొన్నాళ్లకు చూపు శాశ్వతంగా పోతుంది. అందుకే ఎవరైనా సరే ఆరునెలలకు ఒకసారి నేత్రవైద్యుడిని సంప్రదిస్తుండాలి

డయాబెటిక్‌ రెటినోపతి
రెటీనా సమస్యలో అతి తీవ్రమైనది డయాబెటిక్‌ రెటీనోపతి. కంటి వెనుక భాగంలో అతి పల్చని పొరే రెటీనా. ఇది కణాల కలయికతో ఉంటుంది. కంటి ముందున్న దృశ్యాలను గ్రహించి, వాటిని మెదడుకు పంపిస్తుంది. రెటీనాలో సమస్య ఏదైనా ఈ వ్యవస్థకు విఘాతం కలుగుతుంది. వయసు కారణంగా ఏర్పడే మాక్యులర్‌ డీజనరేషన్‌తో రెటీనా కొంతభాగం క్షీణిస్తుంది. డయాబెటిక్‌ రెటినోపతితో రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను దెబ్బతీయడం ముఖ్యమైన కారణం. అందువల్ల మధుమేహంతో ఉన్నవారు మిగిలిన శరీరభాగాల కన్నా చాలా శ్రద్ధతో కళ్లని కాపాడుకోవాలి. షుగర్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగిస్తుంటుంది. ఇది సహజం. ఈ సమయంలో కళ్లద్దాలు ధరిస్తే సరిపోతుంది. లాసిక్‌ తరహా సర్జరీనీ ఎంచుకోవచ్చు. ఈ సర్జరీలో చూపును చక్కదిద్దుతారు. మాక్యులర్‌ డీజనరేషన్‌, గ్లకోమా, క్యాటరాక్ట్‌ కారణంగా చూపులో సమస్యలు ఏర్పడతాయి. ఈ వయసులో చూపు మందగించడం సహజమే కదా.. అని ఉపేక్షించకూడదు. డయాబెటిక్‌ రెటినోపతి తీవ్రమైతే ఉన్న కొద్దిచూపునూ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.