కథాబలంతో ‘తోలుబొమ్మలాట’

కథాబలంతో మెప్పించే ‘తోలుబొమ్మలాట’

ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన తోలుబొమ్మలాట సినిమా మంచి కథాబలంతో ప్రేక్షకుల్ని మెప్పిశ్తోంది

మనుషులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తంగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో విశ్వంత్‌ హీరోగా విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్లెటూరు నేపథ్యంలో నడిచే ఆహ్లాదకరమైన ఈ చిత్రం ఆడియన్స్‌కు ఫ్రెష్‌ ఫీల్‌ ఇచ్చింది.

కథ:
Tollubammalata‘ఆఖరికి నేరం చేసి ఉరిశిక్ష పడ్డ ఖైదీలను కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు.. దానిని నెరవేరుస్తారు. కానీ వయసు పైబడి ఇంట్లో ఉన్న ముసలివాళ్ల చివరి కోరిక ఏంటని అడగరు, దానిని తీర్చే ప్రయత్నం చేయరు’ నలుగురు వయసుపైబడ్డ వాళ్లు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవి. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభవుతుంది. అనేక ట్విస్టులు, ప్రేమలు, గొడవలు, ఆప్యాయతలు, విలువలు, మంచి మాటలు, కన్నీళ్లు ఇలా అన్నింటి కలబోతే ఈ చిత్రం.

సోమరాజు అలియాస్‌ సోడాలరాజు(రాజేంద్రప్రసాద్‌) అచ్యుతాపురం అనే గ్రామంలో చాలా గౌరవంగా బతుకుతాడు. ఉద్యోగం, వ్యాపార రీత్యా తన ఇద్దరి పిల్లలు పట్నానికి వెళ్లినా తాను మాత్రం ఒంటరిగా అదే గ్రామంలో ఉంటాడు. రిషి(విశ్వఒత్), వర్ష(హర్షిత) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నతనం నుండే ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. తల్లిదండ్రులకు తమ ప్రేమ చెప్పలేక.. తమ పెళ్లి చేయమని తాత సోమరాజు సహాయం కోరతారు. అందరినీ ఒప్పించి ఘనంగా పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. అయితే అనుకోకుండా వచ్చిన ఉపద్రవంతో సోమరాజుతో పాటు అతడి కుటంబం విచ్ఛినమవుతుంది. ఈ సమయంలో సోమరాజుకు కేవలం సంతోష్‌(వెన్నెల కిశోర్‌) మాత్రమే సహాయం చేయగలడు. మరి సోమరాజుకు సంతోష్‌ సహాయం చేస్తాడా? సోమరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? విచ్ఛినమైన తన కుటుంబాన్ని సోమరాజు ఏకం చేశాడా? సోమరాజు కుటుంబానికి వచ్చిన ఆపద ఏంటి? అనేదే మిగతా కథ.

నటీనటులు:
సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, కమెడీయన్‌గా ఫుల్‌ జోష్‌లో ఉన్న వెన్నెల కిశోర్‌ సినిమా భారాన్ని పూర్తిగా తమ భుజాలపై వేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ తన అనుభవంతో కొన్ని సీన్లలో అవలీలగా నటిస్తాడు. కాదు జీవిస్తాడు. అచ్చం మన ఇంట్లో తాతయ్యలా అనిపించేలా నటకిరీటి నటన ఉంది. ఇక వెన్నెల కిశోర్‌ తన మార్క్‌ కామెడీతో నవ్వులు పూయించారు. ఇక యంగ్‌ హీరో విశ్వంత్‌కు నటన పరంగా అంత స్కోప్‌ లేప్పటికీ ఉన్నంతలో మెప్పించాడు. అంతేకాకుండా నటుడిగా ఇంప్రూ అయినట్లు కనిపిస్తుంది. అయితే రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ల ముందు అతడు తేలిపోతాడు.

ఇక హీరోయిన్‌ హర్షిత తన నటన, అందాలతో ఆకట్టుకుంది. ఇక పూజారామచంద్రన్‌ తన అందచందాలతో కుర్రకారును హీటెక్కించింది. ధన్‌రాజ్‌ రెండు మూడు చోట్ల కంటతడిపెట్టిస్తాడు. దర్శకుడి నుంచి నటుడిగా మారిన దేవీప్రసాద్‌ ఈ సినిమాలో ఫర్వాలేదనిపించాడు. చలపతిరావు, నారాయణరావు, తాగుబోతు రమేశ్‌, రాజు, దొరబాబు తదితరులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ
ఆ నలుగురు, మీ శ్రీయోభిలాషి, ఓ బేబీ వంటి డిఫరెంట్‌ కథలతో ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించేలా, అందరినీ ఆలోచింప చేసేలా చేసిన రాజేంద్రప్రసాద్‌ మరోసారి అలాంటి జానర్‌తోనే ప్రేక్షకుల తలుపు తట్టాడు. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్‌ కావాలంటే కథా బలం ముఖ్యం. లేదంటే మామూలు కథైనా చాలా బలంగా చెప్పాలి. ఎమోషనల్‌గా అందరినీ టచ్‌ చేయాలి. ఈ సినిమాకు కథే హీరో. అయితే దర్శకుడు మంచి స్టోర్‌ లైన్‌ ఎంచుకున్నప్పుటికీ.. పూర్తి స్టోరీగా మల్చడంలో తడబడ్డాడు. ఏం చేయాలో తెలియక ‘ఆ నలుగురు’ ఫార్మట్‌ను ప్రయోగించాడు. దీంతో ఒకసారి చూసిన సినిమాను మరోసారి రిపీట్‌ చేసి చూసినట్టుంది. కుటుంబ కథా చిత్రాలకు ఎమోషన్స్‌ ముఖ్యం. ఈ విషయంలో కొత్త దర్శకుడి అనుభవలేమి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ సీన్లు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లడానికి దర్శకుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. పలుమార్లు అనవసర, అసందర్బ సీన్లు తెరపై కనిపించడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. ఇక కుటుంబ కథా చిత్రాలకు మాటలు ముఖ్యం. ఎందుకంటే ‘శతమానంభవతి’ సినిమాలో వచ్చే ప్రతీ డైలాగ్‌ను ఆడియన్స్‌ ఎంత ఎంజాయ్‌ చేశారో తెలిసిందే. కానీ ఈ సినిమాలో అలాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు వేళ్లపై లెక్కపెట్టోచ్చు. పాటలు పర్వాలేదనిపించినా.. సాహిత్య విలువలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.

నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌, వెన్నెల కిశోర్‌, హర్షిత, నారాయణరావు, దేవీప్రసాద్‌
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
దర్శకత్వం: విశ్వనాథ్‌ మాగంటి

Send a Comment

Your email address will not be published.