కథాబలం లేని పెళ్లి సందD

కథాబలం లేని పెళ్లి సందD

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన‌ చిత్రం పెళ్లి సందD. ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్, యువ హీరోయిన్‌ శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న థియేట‌ర్ల‌లో రిలీజైందీ చిత్రం.

క‌థ‌:
వ‌శిష్ట(రోష‌న్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తాడు. అత‌డి తండ్రి పాత్ర‌లో రావు ర‌మేశ్ న‌టించాడు. ఎవ‌రో చూసిన సంబంధం కాకుండా మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు వశిష్ట. త‌న సోదరుడి వివావ‌హంలో స‌హ‌స్ర (శ్రీలీల‌)ను చూసి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఆమె కూడా అత‌డి మీద మ‌న‌సు పారేసుకుంటుంది. అలా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతారు. ఇంత‌లో వీరి ప్రేమ అనుకోని మ‌లుపులు తిరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? త‌న ప్రేమ‌ను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేష‌ణ‌:
హీరో శ్రీకాంత్‌కు జ‌నాల్లో ఎంత‌టి గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. విభిన్న‌మైన క‌థ‌ల‌తో, విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో జ‌నాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడీ హీరో. అత‌డి త‌న‌యుడు ఈ సినిమా చేస్తున్నాడ‌న‌గానే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే న‌ట‌న‌తో మెప్పించాడీ హీరో. రెండో సినిమాకే పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌క మాన‌దు. హీరోయిన్ శ్రీలీల గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది.

అయితే క‌థ‌, క‌థ‌నం చాలా వీక్‌గా ఉంది. విజువ‌ల్స్ రాఘ‌వేంద్ర‌రావు స్టైల్‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. కానీ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో అవ‌న్నీ తేలిపోతాయి. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది. చాలా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే కామెడీ సీన్లు వాటికి ఉప‌శ‌మ‌నం కోసం పెట్టిన‌ట్లు అనిపించ‌క మాన‌దు. ఎమోష‌న్స్ పండించేందుకు ఆస్కారం ఉన్నా డైరెక్ట‌ర్ దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లు అనిపించింది. సినిమాను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

టెక్నిక‌ల్‌గా..
బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను పండించ‌డంలో డైరెక్ట‌ర్ కొంత త‌డ‌బ‌డ్డ‌ట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అంద‌మైన లొకేష‌న్ల‌ను కెమెరాల్లో బంధించి మంచి విజువ‌ల్స్ రాబ‌ట్ట‌డంలో కెమెరామ‌న్ కొంత మ్యాజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలోని స‌న్నివేశాల‌తో పాటు సెకండాఫ్‌లోని కొన్ని సీన్ల‌ను చాలా అందంగా చూపించాడు కీర‌వాణి సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువ‌లు అంతంత‌మాత్రం. ఎడిటింగ్ బాగోలేదు.

న‌టీన‌టులు:
రోష‌న్‌ ఎంతో అనుభ‌వం ఉన్న‌వాడిలా న‌టించాడు. సినిమాను సేవ్ చేసేందుకు అత‌డు చాలానే ప్ర‌యత్నించాడు. న‌ట‌న‌, డైలాగులు, డ్యాన్స్‌.. ఇలా అన్నింటినీ ఉప‌యోగించాడు, కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోయిన్ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ అంద‌రినీ ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నించింది కానీ ఆమె పాత్ర‌కు పెద్ద‌గా న‌టించే స్కోప్ ఇవ్వ‌లేదు. రావు ర‌మేశ్‌, ర‌ఘుబాబు త‌మ పాత్ర‌ల‌తో కామెడీ పండించే ప్ర‌య‌త్నం చేశారు. రాఘ‌వేంద్ర‌రావు న‌ట‌న సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది,

న‌టీన‌టులు: రోష‌న్‌, శ్రీలీలా, బ్ర‌హ్మానందం, రావు ర‌మేశ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి
నిర్మాణ సంస్థ‌: ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీర‌వాణి
ఎడిటర్: త‌మ్మిరాజు

Leave a comment

Send a Comment

Your email address will not be published.