‘అద్భతం’ అంటే అది చాలా చిన్న మాట. ‘విలక్షణం’ అంటే సరిపోదేమో! ‘లలిత లావణ్యం’ అంటే అందంగా ఉంటుందేమో!
షుమారు 8 ఏళ్లు పైగా తన ఉనికిని కాపాడుకుంటూ ఎన్నో ఒత్తిడులకు లోనై సభ్యుల మనోభావాలకు అనుగుణంగా తనకుతాను తీర్చి దిద్దుకుంటూ వెంట వచ్చినవారిని తనలో మమేకం చేసుకుంటూ కాదన్నవారిని కాల నిర్ణయానికి వదిలివేస్తూ తనదైన శైలితో ముందుకు సాగిపోయిన పెర్త్ తెలుగువారు ఇదివరకెన్నడూ జరగనంత వైభవంగా విలంబి ఉగాది జరుపుకున్నారు.
300 పైగా విచ్చేసిన సభ్యులతో కిలకిలలాడిన సభా ప్రాంగణం భారతదేశం నుండి వచ్చిన అతిధులతో మరింత శోభను చేకూర్చుకుంది. భారతదేశం నుండి మిమిక్రీ మరియు వెంట్రిలోక్విస్ట్ శ్రీ జి వి ఎన్ రాజు మరియు గాయని దీప్తి అయ్యర్ ఈ కార్యక్రమానికి అతిధులుగా వచ్చారు. ముఖ్య అతిధిగా గౌరవ శ్రీ సైమన్ ఒబ్రిఎన్ Shadow Minister for Electoral Affairs and Chairperson రావడం జరిగింది.
అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ వసంత్ కహలూరి గారు ఉగాది ప్రాముఖ్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ గణిత శాస్త్రజ్ఞులు శ్రీ భాస్కరాచార్య గారి శాస్త్రీయ పరిశోధనాంశాలను గుర్తు చేసారు. వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం భూభ్రమణం ఉగాది రోజున మొదలై అదే రోజు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. అతిధులు మరియు సభ్యులందరికీ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పెర్త్ తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు మరియు చైర్ పర్సన్ గా సేవలందించిన వారందరికీ ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది. అలాగే ఉన్నత పాఠశాల చదువులో అత్యున్నత ప్రతిభను చూపిన విద్యార్ధులకు బహుమతులివ్వడం జరిగింది.
సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పసందైన విందు భోజనంతో కార్యక్రమం ఎంతో కన్నుల పండువుగా ముగిసింది.