కళింగాంధ్ర కథాజాడ బలివాడ

తెలుగు సాహితీలోకంలో కథారచనలో విశిష్టమైన రచయితగా గుర్తింపు పొందిన బలివాడ కాంతారావు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం గ్రామంలో 3 జూలై 1927న జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయనకి తెలుగు, ఇంగ్లీషే కాక బెంగాలీ, ఒరియా కూడా వచ్చు. బలివాడ కథలన్నీ ‘చదువు-ఆగు-ఆలోచించు-సాగు ‘ అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి.
బలివాడ కాంతారావుకు ఎనిమిదేళ్ళ వయస్సులో వీరి కుటుంబం విశాఖపట్టణానికి తరలివెళ్ళారు. ఎనిమిదవతరగతి చదువుతుండగా ‘విద్యార్థి’ అనే హస్తలిపి పత్రికకు సంపాదకత్వం వహించేవారు. ‘సూర్యనారాయణ’ అనే పేరు గల ఇద్దరు వ్యక్తులు (తండ్రి, ఉపాధ్యాయుడు) తనకు స్ఫూర్తి ప్రదాతలనీ, రచయితగా తన అభిరుచిని తీర్చిదిద్దుకోవడానికి ఎంతో తోడ్పడినవారనీ కాంతారావు చాలాసార్లు చెప్పారు.

పదిహేడేళ్ళ వయసులో భారతనేవీ లో గుమాస్తాగా ఉద్యోగానికి చేరి అతి త్వరలో సివిలియన్ ఆఫీసర్ అయ్యారు. నేవీలో పనిచేసేటపుడు ఉద్యోగబాధ్యతలవల్ల ఎక్కువ ప్రయాణాలు చేసేవారు. అందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాల గురించి , సంస్కృతుల గురించి , ముఖ్యంగా గిరిజన జాతుల గురించి మంచి అవగాహన పెంచుకున్నారు. ఈ అవగాహన కాంతారావు కాల్పనిక సాహిత్య కృషిటిని మరింత సుసంపన్నం చేసింది.
బలివాడ కాంతారావు జీవితాన్ని విభిన్నమైన కోణాలలో దర్శించారు, పరిశీలించారు, పద్ధతి ప్రకారం అధ్యయనం చేశారు. గిరిజనుల ప్రపంచాన్ని కూడా తమ కథల్లో సదవగాహనతో ప్రతిబింబించగలిగారు. అతనికి తెలుగూ, ఇంగ్లీషూ మాత్రమే కాక బెంగాలీ, హిందీ, ఒరియా భాషాసాహిత్యంతో కూడా పరిచయం ఉంది. ఆయన రచనాపరిధి ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదు యావద్భారతదేశానికి సంబంధించినది.
కాంతారావు రాసిన మొట్టమొదటి నవల ‘శారద’ 1947 లో ప్రచురితమైంది. ఒక పత్రిక ఈ నవలను తిరస్కరించగా ‘చిత్రగుప్త’ కు పంపారు. తిరస్కరణ వారి రచనాభిలాషను బలవత్తరమే చేశాయని అన్నారు. వారి స్థిరచిత్తం, ఆత్మవిశ్వాసం వారికెంతో లాభించాయి. ‘బలివాడ కాంతారావు కథలు’ సంకలనంలో ఆనాటి ప్రచురణ ముచ్చట్ల గురించి ఇలా ప్రస్తావించారు. ‘ నాటి ప్రఖ్యాత సాహిత్య పత్రిక భారతికి ఒక కథను పంపగా దానిని వారు భారతిలో ప్రచురించకుండా తామే నడిపే ఆంధ్రపత్రిక అనే పేరుగల నాటి సుప్రసిద్ధవారపత్రిక లో ప్రచురించారు. తర్వాత ఆంధ్రపత్రికకు పంపిన మరొక కథను భారతి మాసపత్రికలో ప్రచురించారు.’

ఆయన తొలి నవలలైన ‘గోడ మీద బొమ్మ(1953), దగా పడిన తమ్ముడు (1957) లలో ఒక దశాబ్దకాలవ్యవధిలో జరిగిన కుటుంబగాథలను చిత్రించారు. ఉదాహరణకు, దగా పడిన తమ్ముడు కేవలం పదేళ్ళకాలంలో జరిగిన కథ. తర్వాతి నవలల్లో కొన్ని తరాల జీవితాల్ని చిత్రిస్తూ, అనేక అంశాల మీద తమ దృష్టికోణాన్ని చెప్పారు. ‘వంశధార’ అనే నవల అటువంటిదే అని చెప్పవచ్చు. ఇందులో మూడు తరాల జీవితకాలాన్ని ప్రతిబింబించారు. సామాజికంగా వచ్చిన మార్పులను ప్రతీకాత్మకంగా చూపించడానికి మూడు తరాలలో జీవించిన పాత్రల అవసరం ఏర్పడిందని వారు విశ్వసించారు.

210దిల్లీలో నివసిస్తున్న కాలంలో ఈ నవల వ్రాశారు. ఈ నవలలో వేదికగా నిలిచిన ప్రాంతం వారి స్వగ్రామం కావడం వల్ల , ఒక యాభయ్యేళ్ళ వ్యవధిలో అంటే 1918 నుంచి జరిగిన ఘటనాక్రమాన్ని అధ్యయనం చేయడానికి, విషయసేకరణకు, ఎప్పుడో 1936 లోనే వదిలేసిన ఊరికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వారి స్నేహితులు, వారి తండ్రి స్నేహితులు అనేకులు ఎంతో విలువైన సమాచారం ఇచ్చి తనకు సహాయం చేశారు, తత్ఫలితంగానే నవలలోని యథార్థమైన పాత్రల్నీ, భాషావాదాల్నీ, భేదాల్నీ కూడా చక్కగా పొందుపఱచగలిగారు. ‘వంశధార’ నవల రెండో ముద్రణ పొందినపుడు నవలలోని ముగింపు మార్చారు. “ రచయిత ఇష్టాయిష్టాలప్రభావం రచనలమీద పడనివ్వరాదనీ, … తొందరపడి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోరాద”నీ, స్పష్టంగా చెప్పారు. అది పుస్తకం గా బయటకు రావడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టినా, మొత్తం మీద తృప్తి కరంగా వచ్చిందని అభిప్రాయపడ్డారు. భావితరాల వారిని అందులోని దృష్టికోణాలు ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఈ నవల అనేక కోణాల్ని స్పృశిస్తుంది – వివిధ వర్గాల్లోని రాజకీయ సిద్ధాంతాలు, మతపరమైన విశ్వాసాలు, సామాజిక పద్ధతులు, జీవనరీతులు మొదలైన వాటిని సవిస్తరంగా చర్చించిన నవల ఇది. ఈ నవల విస్తృతిని, లోతును చూస్తే ‘ఆధునిక భారతదేశ కథ’ గా దీనిని పిలువవచ్చని డా. యోహన్ బాబు అంటారు.
‘దిల్లీ మజిలీలు ‘ అనేది కాంతారావుగారి మరొక సుప్రసిద్ధ రచన. “ఇది బాగా పరిశోధించి వ్రాసినది. దీనిని పూర్తి చేసినపుడు డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న భావన కలిగింది. పూర్తి చేయడానికి ఆరేళ్ళు పట్టింది. కథలలో కథలు ఉండి దీని రచనా పద్ధతి కూడా విభిన్నంగా తయారైంది. ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థపురం నాటి నుండి నేటి కొత్తదిల్లీ వరకూ గల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణాల్లోంచి మన జీవితాలను చర్చించిన నవల ఇది. దీనివల్ల నాకు గుర్తింపు ఇంకా రానప్పటికీ, సంతృప్తి మాత్రం లభించింది. అమ్మకాలు తక్కువే. హిందీలోకి అనువదించితే ఈ రచనకు కొద్ది గుర్తింపు వస్తుందేమో.” అని ఒక ఇంటర్యూలో చెప్పారు.

సమకాలీన రచయితల గురించి – ‘మంచి రచయితలను గొప్ప రచయితలుగా ముద్ర వేస్తే వారు సాధారణ రచయితలైపోయే ప్రమాదం ఉంది. రచయితలు పేరు, డబ్బు మీద మాత్రమే దృష్టి పెడితే మంచి రచనల నాణ్యత తగ్గిపోతుంది. చాలా మంది రచయితలీనాడు ఈ పరిధులను దాటి చక్కగా వ్రాస్తున్నారు. ఈ రకమైన సాహితీ సేవను వారు ముందు ముందు మరింత చక్కగా కొనసాగించగలరు.’ అన్నారు. నవలలను వ్రాయడం తగ్గించి, కథలు కొనసాగించడానికి కారణం చెప్తూ వారు నవల వ్రాయడమూ కష్టమే, తర్వాత ప్రచురించబడడమూ కష్టమేనన్నారు.

కాంతారావు తనకి స్ఫూర్తిగా నిలిచినవారి గురించి చెప్తూ, బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ గారి ప్రభావం తన నవల ‘అన్నపూర్ణ’ మీద ఉందంటూ, “ఇతర భాషల్లోని గొప్ప గొప్ప కాల్పనిక సాహిత్యాన్ని చదివినపుడు వాటి ప్రభావం నామీద ఉంటుంది, నా కథల్లో కనిపిస్తుంది, కానీ నవలను గొప్పనవలగా తీర్చాలంటే ..ఏదో అసందిగ్ధత ఉంది.” అన్నారు.

మనస్తత్వ శాస్త్రము చదువుకున్నందువల్ల ఆ ప్రభావం వారి పాత్రలలో ఉందా అన్న ప్రశ్నకు బదులుగా వారు మాట్లాడుతూ పనిగట్టుకొని మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాలతో పాత్రలను తీర్చిదిద్దలేదని, ఆ కోణంలో వాటిగురించి ఆలోచించలేదని అన్నారు. ఒక సారి రూపొందాక ఆ యా సిద్ధాంతాలలో ఆ పాత్రల్ని ప్రతిక్షేపించి చూడవచ్చుననడంలో సందేహం లేదు అన్నారు. మూడు నవలలు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి వారి రాజకీయ దృష్టికోణాల్ని ప్రతిబింబిస్తాయి. ఒక ప్రభుత్వోద్యోగిగా యథార్థ పరిస్థితులను చిత్రించలేనప్పటికీ, ఒక ఊహాప్రపంచపు పోకడలుగా అయితే అభివర్ణించానని చెప్పుకొచ్చారు.

సంప్రదాయాలనేవి వాడిపోతున్న కొమ్మలవంటివనీ, వాటిని పట్టుకు వేళ్ళాడడం వల్ల మార్పు రాదనీ నమ్ముతూ, మార్పు కు అవకాశం లేనిదే ఏ సమాజమూ ప్రగతి సాధించజాలదన్నారు. బహుశా అందువల్లే వారి రచనల్లో కొన్ని పాత్రలు సంప్రదాయ విరోధులుగా సృష్టించబడతాయి.

తను కల్పించే పాత్రల పట్ల నిజాయితీతో ఉంటూ ప్రతీ సూక్ష్మమైన అంశం పట్లా జాగ్రత్తగా ఉండడం సరియైన పద్ధతని నమ్ముతారు. స్వంత కథల సంకలనం ‘బలివాడ కాంతారావు కథలు’ లోని ముందుమాటలో అందులోని కథలన్నీ తన స్వంత జీవితంలో గమనించిన విషయాలపైనేననీ, అన్ని పాత్రలూ తన జీవితంలో తారసపడినవే ననీ అన్నారు. ‘మనిషి, పశువు’ కథలో గతంలో ముంబయిలో పనిచేస్తున్న రోజులలో చూసిన వ్యక్తి కథే అన్నారు. అందుకే వారు సృజించిన స్త్రీ పాత్రలన్నీ బలమైనవే. పుట్టిపెరిగిన గ్రామంలో అటువంటి విశిష్ట వ్యక్తులను, గౌరవప్రదమైన నిజాయితీ గల బ్రతుకులను ఇష్టపడే వారిని చూసి ఉండడం వల్లే అటువంటి పాత్రలను సృజించగలిగానన్నారు.

‘కోరికలసత్యం’ కథ ఒకట్రెండు కారణాలవల్ల నాకు బాగా నచ్చింది. జీవితాన్ని మరింత మెఱుగు పఱచుకోవడం కోసం ప్రయత్నించడం మానవసహజం. దానికి ప్రగతి అనో, మంచి జీవితమనో ఏ పేరు పెట్టినా, ‘ఇంకొంత’ కావాలని కోరుకోవడమే. ఆ మెఱుగు కోరుకోవడం, దానికై ప్రయత్నించడం ఒకవేళ పొరబాటున కీర్తికాంక్షతో అయితే అది వినాశనానికే దారితీస్తుంది.

కాంతారావు గారి చిన్నకథల్లో ఒకటి ‘నాలుగు మంచాలు’ . ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగుల కథ. నిజానికి సుందరం అనబడే ఒక వ్యక్తి, మిగిలిన ముగ్గుర్నీ బయటి ప్రపంచంతో కలుపుతూ, తనవ్యాపారంతో పాటు వారి వ్యాపారాలనూ శ్రద్ధగా చూసుకుంటూ వారి పై ప్రభావం చూపిస్తాడు. తన వ్యాధి కారణంగా అతడు ఆసుపత్రికి వస్తూ వెళ్తూ ఇవన్నీ చేస్తుంటాడు. ఒకరితో ఒకరు సంబంధంలేని వ్యక్తులు ఒక బాంధవ్యంలో పెనవేయబడడం అనే కథా వస్తువు ఆసక్తి కరమైనది. మంచి రచన.

కాంతారావు గారు తన రచనాకౌశల్యానికి మూడు దృష్టాంతాలు కారణాలుగా చెప్తారు.

బాల్యంలో గొల్ల రామస్వామి అనే హరికథాకారుడు తమ ఊళ్ళో ఒక చెట్టు క్రింద రకరకాల కథలను ప్రేక్షకులకు చెప్తుండేవాడు. “అతని నుంచే ఆసక్తి కరంగా కథ చెప్పేదెలాగో నేను నేర్చుకున్నాను.” అంటారు.

యుక్తవయస్సులో ఉండగా ఒకరోజు చిన్నపిల్లల తగాదా మొదలై పెద్దవాళ్ళు కొట్టుకోవడం వరకూ వచ్చిన సంఘటన చూసిన కాంతారావు గారు, వారిలో ఒకామె సోదరుడు దూరంగా ఆ గొడవను చూస్తూ ఊరకే నించోవడం చూసి అతన్ని మీరెందుకు వాళ్ళ తగాదా తీర్చకుండా ఇలా దూరంగా నిలుచున్నారని అడిగారు. పక్షపాతం లేకుండా గొడవ గురించి తెలుసుకోవాలంటే దూరం నుంచి వాళ్ళను చూస్తేనే తెలుస్తుందని అతను జవాబిచ్చాడు. “ఈ సంఘటన ద్వారా రచయిత కూడా నిష్పక్షపాతంగా ఉండితీరాలని నేను నేర్చుకున్నాను” అని చెప్పారు.

207ఇంకో సందర్భంలో ఒక జూనియర్ ఆఫీసరు పని గురించిన ఒక చిన్న మెమో చూశారు కాంతారావుగారు. “చాలా మంది సీనియర్ ఆఫీసర్లు , పై అధికారులకూ కార్మికులకూ మధ్య తగాదాలెలా తీర్చాలన్నది ఈ జూనియర్ ఆఫీసర్ నుంచే నేర్చుకున్నారని ఆ నోట్ లో ఉంది. ఆ జూనియర్ ఆఫీసర్ తన సీనియర్ ఆఫీసర్లకన్నా పెద్ద పెదవికి ప్రమోషన్ ద్వారా పొందాడు. “ ఈ సంఘటన ద్వారా మనము కథను సూటిగా, క్లుప్తంగా చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని నేర్చుకున్నాను.” అని చెప్పారు.

విశేషాలు
బలివాడ కాంతారావు రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.
1972లో పుణ్యభూమి నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం, రావి శాస్త్రి స్మారక పురస్కారం,
1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో సత్కరించాయి. బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు, కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు కూడా సంపాదించారు.
తెలుగు కథాదీపదారుల్లో ఒకరిగా నిలిచిన బలివాడ కాంతారావు మే 6, 2000న కాలథర్మం చెందారు.