కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు దాశరథి
జులై 22 దాశరథి జయంతి

తెలంగాణలో కవితాగ్ని ధారను కురిపించిన ఉద్యమ కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఎంతో చారిత్రాత్మకమైన ప్రచార పోరాట చైతన్యాన్ని తన కలం నిండా నింపుకున్న మహాకవి. ఆయన పేరు తలవగానే సాధారణ తెలగాణ ప్రజలందరికీ ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే కవితా నినాదం, ”ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” అనే గీతమూ వెంటనే గుర్తుకు వస్తాయి. మొదటి పద్యపాదం అతని ఉద్యమ కవితా స్వభావాన్ని తెలిపితే, రెండో గీతంలోని సారం దాశరథి ప్రాపంచిక దృక్పథాన్ని తెలుపుతుంది. అతడు కవి మాత్రమే కాదు. ఉద్యమకారుడు కూడా. సామాజిక అసమానతలపై సమరం చేసినవాడు. కుల, మత విభేదాలపై అజ్ఞానంపై, మూఢత్వంపై నిప్పులు చెరిగే రుద్రవీణను మోగించిన దాశరథి కవితా చైతన్యాన్ని నేటి తరం అందిపుచ్చుకోవాలి. ఆనాడు తెలంగాణలో నిజాం నిరంకుశత్వంపై ప్రజలు చేసిన తిరుగుబాటు, భారతదేశంలోనే రాజకీయ, సామాజిక సాంస్కృతిక చైతన్యానికి ఈ నేల ప్రతీకగా నిలుస్తుంది. తమ భాష సంస్కృతిపై జరుగుతున్న దాడిని, ప్రజలపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలను భరించలేక సంఘటితమై మహోద్యమానికి ప్రజలు శ్రీకారం చుట్టారు. “నీ బాంచన్‌ కాల్మొక్తా” ని నిస్సహాయులుగా, నిర్భలులుగా ఉన్న సామాన్య జనం “నీ గోరి కడ్తం కొడుకో నైజాం సర్కరోడా” అంటూ తరిమికొట్టడం ‘చరిత్ర సృష్టించేది ప్రజలే’ అన్న సత్యాన్ని రుజువు చేసింది. అలాంటి ప్రజా పోరాటానికి పెన్నుదన్నుగా నిలిపి, తన అక్షర తూటాలతో రాజు గుండెల్లో వణుకు పుట్టించిన ధీర కవి దాశరథి.

కట్టుబాట్లను తెంచుకొని
పుట్టింది సంప్రదాయ ఛాందస కుటుంబమైనప్పటికీ ఆ కట్టుబాట్లను, ఆచార అంటుకట్లను తెంచుకొని ప్రగతిశీల భావాలతో ప్రజా పక్షం వహించి, నాటి పోరాటంలో స్వయంగా పాల్గొని జైళ్లల్లో మగ్గి కవితాగ్ని వర్షం కుపించిన ప్రజా కవి దాశరథి. శ్రీమతి వేంకటమ్మ, వేంకటాచార్యులకు 1925 జులై 22న నేటి మహబూబాబాద్‌ జిల్లా చిన గూడూరులో దాశరథి జన్మించారు. పదేండ్ల వయసులోనే కలం పట్టి పద్యాలు రాశారు. ఖమ్మంలో మెట్రిక్యులేషన్‌ చదువు పూర్తి చేశారు. వీరి సోదరుడు దాశరథి రంగాచార్యులు కూడా నాటి తెలంగాణ పోరాట చైతన్యాన్ని అందిపుచ్చుకుని రచనలు చేశారు. ఇద్దరూ సాహిత్యరంగంలో దాశరథి సోదరులుగా ప్రసిద్ధి పొందారు. నాటి నిజాం రాచరిక దురాగతాలపై పద్యాలు పాడటం వల్ల ప్రభుత్వం ఆయనను చైల్లో పెట్టింది. 16 నెలలపాటు వరంగంల్‌ జైలులో శిక్ష అనుభవించారు. జైలు గోడల మీద రాజ్యానికి వ్యతిరేకంగా పద్యాలు రాశారు. నిజామాబాద్‌ జైలులో దాశరథి పద్యాలు చెబితే అదే జైలులో ఉన్న మరో రచయిత వట్టికోట ఆశ్వారుస్వామి బొగ్గుతో గోడపై రాసేవాడు. పోలీసులు ఎంత కఠిన శిక్ష విధించినా రాయడం ఆపని కలం యోధుడు దాశరథి.

కలం బలం కవితా గళం
“ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నెడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని ఆయన గర్జించి పద్యంలో పైపాదాన్ని వదిలేసి కింది పాదాన్ని మాత్రమే పట్టుకుంటున్నారు కొందరు. ఇది హ్రస్వ దృష్టికి నిదర్శనం. ఆనాటి ప్రజలను బాధలకు గురి చేసిన వారిని కవి నిలదీశాడు. దాన్ని విస్మరించకూడదు. దాశరథి కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన కవి కాదు. “తెలంగాణలోని కోటి/ ధీరుల గళ ధ్వనినెగాక / ఇలాగోళ మందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను / నా పేరు ప్రజా కోటి / నా ఊరు ప్రజావాటి” అని విశ్వమానవుని ప్రతినిధిగా ప్రకటించుకున్నాడు. దాశరథి కాంక్షించిన తెలంగాణగా ఇప్పటికీ మన తెలంగాణ మారలేదని ఆనాడు ఆయన రాసిన పద్యాలు చాటి చెబుతున్నాయి. ” ప్రాణములొడ్డి ఘోర గహనాటవుల్‌ పడగొట్టి మంచి మాగాణములన్‌ సృజించినెముకల్‌ / నుసిజేసి పొలాలు దున్ని బోషాణములన్‌ నవాబుకు / స్వర్గము నింపిన రైతుదే, తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే” అని ఆనాడు రైతు గురించి తపించాడు దాశరథి. నేటికీ రైతు దీనస్థితినే ఎదుర్కొంటున్నాడు అందుకే ఆయనంటాడు. అనాదిగా సాగుతోంది / అనంత సంగ్రామం / అనాధుడికి, ఆగర్భ / శ్రీనాథుడికి మధ్య / సేధ్యం చేసే రైతుకు / భూమి లేదు పుట్ర లేదు / రైతుల రక్తం తాగే జమీందార్ల కెస్టేట్లు” అంటూ విపులీకరించాడు. గురజాడ వారు దేశమంటే మనుషులని చెబితే దాశరథి రైతుదే తెలంగాణమని తేల్చేశారు. ఆనాటి ప్రజల కష్టాలు దాశరథిని కాలరుద్రుడిని చేశాయి. ”కావుననే వ్రణాలకు, రణాలకు, మాన ప్రాణ హారణాలకు హద్దూ పద్దూ ఉండని కరకునృపతి రాజ్యంలో చిరభేదం విరమించుక బతికేమో. కడుపునిండ గంజినీళ్లు గలికేమో” అని దీర్ఘశ్వాస విడిచారు. తెలంగాణలో జరిగిన ఆస్తుల దోపిడీల పడతుల మానాల అపహరణ, ఊర్లకు ఊర్లు అగ్గిపెట్టి, తల్లి పిల్లల కడుపు కొట్టిన దుర్మార్గాన్ని, ఘటనలను దాశరథి హృదయంలో నిప్పు కణికలు వెదజల్లాయి. ఫలితంగానే తెలంగాణలో సమర సాహిత్యం వెల్లువెత్తింది.

తెలంగాణలో సమర సాహిత్యం
తెలంగాణలో సమర సాహిత్య ప్రభంజనానికి దాశరథి రచనలే ప్రేరణగా నిలిచాయి
“నేను రా తెలగాణ నిగళాలు తెగగొట్టి /ఆకాశమంత యెత్తార్చినాను నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు / పాడి మానవుని కాపాడినాను / నేను వేయి స్తంభాల నీడలో నొకతెల్గు / తోట నాటి సుమాలు దూసినాను / నేను పోతన కవీశును గంటములోని/ బడుపుల కొన్నింటి బడసినాను” అని ధైర్యంగా గొంతెత్తి” నా గీతావళి ఎంత దూరము ప్రయాణంభౌనో, అందాక ఈ / భూగోళమ్మున అగ్గి వెట్టెదను, నిప్పులే వోసి హేమంత భామ గాంధర్వ వివాహ మాడెదను / ద్యోమణుష్ణ గోళమ్ముపై / ప్రాగాకాశన వారుణాస్ర జలధారలే చల్లి చల్లారె దాక” అని తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించాడు. దాశరథి అంగారాన్ని, శృంగారాన్ని రెండూ అంతే సామర్థ్యంతో కవితల్లో పలికించారు. మాట్లాడని మల్లె మొగ్గ మాదిరిగా నడచిరా” అని పాడారు. ” వెచ్చదనమ్ము కోరి పరువెత్తితి నీకయి, కానీ పారడాజొచ్చె హిమాంబురా హీనులు, సుందరి నీ వరుదెంచు దారిలో / విచ్చిన గుండెతో ప్రణయ వీధి ప్రయాణము సేయూ అని రాయగలిగారు.

దాశరథి రచనలు
దాశరథి రచనలు “అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంలో సమరం, ఆలోచనాలోచనలు, అమృతాభిషేకం మొదలైనవి” ప్రసిద్ధమైనవి. యాత్రాస్మృతి పేర స్వీయ చరిత్రను రచించారు. తెలుగులో మొట్టమొదటి గజల్‌ ప్రక్రియకు ప్రాణం పోసిన వారు దాశరథి. ఎంతోమంది ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించారు. గాలిబ్‌ గీతాలను తెలుగులో అందించారు. ఇంకా ఎన్నో నవలలు, నాటికలు, వ్యాసాలు, శతకం, గేయాలు రచించారు. అంతేకాదు సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో మధుర గీతాలను రాశారు. వారి తిమిరంతో సమరం సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

“నేను క్షోభలోంచే రాస్తుంటా- క్షోభ లేంది రాయలేను. క్షోభ, ఉద్వేగం కలిసి నాతో ఏవేవో రాయించాయి. జైల్లో, రైల్లో, తోటలో, బాటలో, కత్తుల్లో, పూ గుత్తుల్లో, ఆశలో, ఓటమిలో రాశాను. తెలంగాణ పుటలు విప్పి, మనిషి మనిషి పద్య పంక్తులు చదివి, పంక్తుల గర్భంలోకి దిగి భయాలను విస్మయాలను చూసి గుండెలతో పోట్లాడి రాశాను. పోరాటం నుండి కళ పుడుతుందని నమ్ముతున్నాను. నా జీవితమే పోరాటం, నేను ఆశావాదిని, నాకు నిరాశ లేదు. నా ధ్వేయం ప్రజాస్వామ్య సామ్యవాదం” అని ఘంటాపథంగా చెప్పిన దాశరథి ఆశయాన్ని ముందుకు తీసుకుని పోవలసి ఉన్నది. ” రానున్నది ఏది నిజం, అది ఒకటే సోషలిజం, కలపండోరు భుజం భుజం, కదలండోరు గజం గజం” అన్న దాశరథి సోషలిజంతోనే సమాజంలోని వ్యథ పోతుందని అందుకోసం కృషి చేయాలని కోరుకున్నాడు.

ఉద్యమాలకు ఊపిరులు
తెలంగాణ మాగాణుల్లో ఉద్యమాలకు తన కవితల ద్వారా దాశరధి ఊపిరులు ఊదారు. స్వయంగా ఉద్యమంలో పాల్గొని జైలు గోడల మీద అక్షరమై మెరిశారు. నిజాం నిరంకుశ పాలనను తన కవితలతో చీల్చి చండాడాడు. ఆవేశంలో, ఆలోచనలో ఆయన కవితలు కత్తి అంచుపై కదం తొక్కాయి. అభ్యుదయ భావాలతో, సమాజంలోని అనేక సమస్యసలపై అలుపెరుగని పోరాటం చేశారు. జీవితంలో, పోరాటంలో, కవిత్వంలో ఎక్కడా రాజీ పడకుండా జీవించారు. నిజాం పాలన అంతమయ్యాక సినీ కవిగా అందరి అభిమానాలు చూరగొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణను కీర్తించారు దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించాక ఆగిపోయిన చదువను కొనసాగించాడు. బి.ఎ. పట్టా తీసుకున్నాడు. గ్రామ పంచాయితీ తనిఖీ అధికారిగా ఉద్యోగం చేశారు. హైదరాబాదు, మద్రాసు ఆకాశవాణి కేంద్రాలలో ఉద్యోగాలు చేశారు.
దాశరథి కవిత్వం అభ్యుదయ భావాలతో, ప్రజలను చైతన్య వంతం చేసేదిగా ఉంటుంది. వీరు సుమారు 30కి పైగా కవితా సంపుటాలను వెలువరిచారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, కవితాపుష్పకం. తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు వంటి గొప్ప రచనలు చేశారు. వీటితోపాటు గాలీబ్ గీతాలను ఉర్దూనుంచి అనువదించారు. యాత్రాస్మృతి వంటి రచనలూ చేశారు. పద్యం, గేయం, పాట, వచనం ఇలా అన్ని ప్రక్రియలలో రచనలు చేశారు.

సినీ కవిగా ప్రత్యేకత చూపిస్తూ
దాశరధి కృష్ణమాచార్య కేవలం సాహిత్యానికి సంబంధించిన రచనలే చేయలేదు. చలనచిత్రాలకు అమూల్యమైన పాటలు ఎన్నో రాశారు. వాటిలో భక్తి, శృంగారం, అనుబందం గీతాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 600లకు పైగా సినిమాలకు పాటలు రాశారు.
రంగుల రాట్నం చిత్రంలో నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో… అని భక్తుని ఆర్తిని దేవునితో విన్నివించాడు. బుద్ధిమంతుడు చిత్రంలో ననుపాలింపగ నడిచి వచ్చితివా అంటూ భక్తుడితో, దేవుణ్ని ఆరాధింప జేశాడు. ఇక శృంగారానికి సంబంధించిన పాటల విషయానికి వస్తే- ఆత్మీయులు చిత్రంలో చిలిపి నవ్వుల నినుచూడగానే, గూడుపుఠాణి చిత్రంలో తనివి తీరలేదే నా మనసు నిండలేదే అని ప్రేమలోని ఆనందాన్ని ప్రేమికుల ద్వారా వ్యక్తం చేశాడు. దాశరథికి ఉర్దూ భాషపై పట్టు ఉండడం వల్ల ఆ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషా పదాలను పాటల్లో అద్భుతంగా ప్రయోగించేవారు. పునర్జన్మ చిత్రంలో దీపాలు వెలిగె పరదాలు తొలిగె, నవరాత్రి చిత్రంలో నిషాలేని నాడు హుషారేమిలేదు, ఖుషీ లేనినాడు మజా ఏమీలేదు… లాంటి పాటల్లో వారి ఉర్దూ ప్రతిభ కనిపిస్తుంది. ముఖ్యంగా పండండటి కాపురం చిత్రంలో బాబు వినరా అన్నాతమ్ముల కథ ఒకటి పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లాంటిదే. అలానే ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మ్రోగె, ఆశలెన్నో చెలరేగె, అంతా మన మించికే చిత్రంలో నేనే రాధనోయి గోపాల పాటు వీణ పాటలుగా ప్రసిద్ధిపొందాయి. ఇప్పటికీ వీరు రాసిన తోటరాముడు చిత్రంలోని ఓ బంగరు రంగుల చిలకా పలుకవే పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అలానే కన్నె వయసు చిత్రంలో ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట అమ్మాయి అందాన్ని వర్ణించే విధానానికి ఓ మూలవిరాట్ లా మిగిలే ఉంటుంది. ఇక మూగ మనసులు చిత్రంలో పల్లెటూరి యువతి మనసును చెప్తూ- గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది… అంటూ చివరకు అంతదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుంది అని ముగిస్తాడు పాటని ముగిస్తాడు దాశరథి. ఇంత గొప్పగా స్త్రీ హృదయాన్ని చెప్పడం అంత సామాన్య మైన విషయం కాదు.

అనేక పురస్కారాలు
దాశరథికి అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కాయి. దాశరథికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డిలిట్ లను ఇచ్చాయి. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించింది. ఇతనే చివరి ఆస్థాన కవి. దాశరథి రంగాచార్యకు స్వయంగా అన్న దాశరథి కృష్ణమాచార్యులు. అలాంటి దాశరథి అనారోగ్యంతో 1987న ఏ దివికో పారిజాతం కోసం ఈ భువిని విడిచి వెళ్లిపోయారు.