కవితా కన్య

కవితా కన్య
నా కవితాకన్య సామాన్యురాలు కాదు
తాను వెళ్ళే చోటల్లా కవితలను వెదజల్లడం ఆమెకే సాధ్యం
ఆమె గర్భకోశం కవితలను మోస్తుంది
ఆమె మనసు కవితలను పుట్టిస్తుంది
దేవుడి ముందూ
మనిషి ముందూ
కవితనే పరిమళం అంతటా వ్యాపిస్తుంది
ఒక మాటకూ మరో మాటకూ మధ్య
ఆమె మౌనంగా ఉంటుంది
ఆమె అక్షరం రాయడం మొదలు పెట్టడంతోనే
చేతులపై రెక్కలు కట్టుకొచ్చి వాలుతుంది కవితై
ఆమె ఉదయాలూ  అస్తమయాలూ
కవితలు వికసించే క్షణాలే
ఆరని గాయాల వాసనలే ఆమె వాంగ్మూలం
ఆమె ఒక్కో కవిత సూర్యుడితో అడుగులు వేయించగలదు
నక్షత్రాలను ఏరుకోవాలనిపిస్తుంది
మంచుబిందువులతో  ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది
నీడలతో పందిరి అల్లాలనిపిస్తుంది
వర్షపు నీటితో జలకాలాడాలనిపిస్తుంది
కలలతో తలగడ  చేసుకుని తల కింద పెట్టుకోవాలనిపిస్తుంది
కవితను ఆలోచించి
కవితను మాట్లాడి
కవితను రాసి
కవితను శ్వాసించి
కవితాక్షరాలతో అస్తమించేందుకు
నా ముందుకు వచ్చిన ఆ కన్య
సామాన్యమైన కన్య కాదు
కవితాకన్య, అవును అచ్చంగా అక్షరాల అల్లికజిగిబిగిలో
సింగారించుకుని నా ముందుకొచ్చిన కవితాకన్య
నా సర్వస్వం
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.