కవిపదం – శివపథం

శివుడంటే అవ్యక్తానందం. శివుడంటే రసప్రవాహం. శివుడంటే సత్యానుభవవిహారం.

శ్రీ పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.

పరమశివుని భక్తి నేర్పిన నా తల్లిదండ్రులకు నమస్కారాలు.

పరమేశ్వరుని చేరే విద్యలు బోధిస్తున్న గురువులకు నమస్కారాలు.

పరమశివుని స్తుతిస్తూ అనేకమంది కవులు అనేక పద్యాలు కల్పించి ఆనందించారు. శివసంబంధమైన ప్రతీ పద్యం పరమపథానికి సోపానమే. అలాంటి పూర్వకవులందరికీ నా నమస్కారాలు.

పలివెలలో కొలువై నా ఈ పద్యశతకాన్ని వ్రాయించుకున్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వరస్వామికి నా భక్తిపూర్వక నమస్కారాలు .

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి దగ్గరలో ఉన్న పలివెల గ్రామంలో కొలువైన శ్రీఉమా కొప్పులింగేశ్వర స్వామి మహామహిమాన్వితుడు . భక్తులకు కొంగు బంగారం.
స్థలపురాణం ప్రకారం కౌశికీ నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అగస్త్యమహాముని పార్వతీపరమేశ్వరుల కళ్యాణం వీక్షించలేకపోయానని దివ్యదృష్టితో చూడగా నిజంగా పార్వతీపరమేశ్వరులు కళ్యాణాంబరములలో ప్రత్యక్షమవుతారు. వారిని అలాగే అక్కడ ఏకపీఠం పై కొలువవ్వమని ముని కోరగా వారు కరుణతో ఏకపీఠం పై అవతరించారు . ఇలా ఏకపీఠంపై పార్వతీ పరమేశ్వరులు ఉన్న క్షేత్రం ఇదే కావటం విశేషం.

ఈ స్వామి ముందుగా అగస్త్యలింగేశ్వరునిగా ప్రసిద్ధుడు. శ్రీనాథుడు వీరిపై శ్లోకం కూడా వ్రాసారని ప్రశస్తి. అక్కడ పూజారిని కాపాడటం కోసం , రాజు కోరగా , కొప్పుతో ( జటాజూటం ) ప్రత్యక్షమై కొప్పులింగేశ్వరునిగా ప్రసిద్ధి గాంచాడు.

నా తల్లిదండ్రులు ఈ క్షేత్రం గురించి ఎంతో భక్తితో చెప్పేవారు. మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా గోవూరు అయినను , ఉభయగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ తెలుసు.

అలాగే పలివెల కొప్పులింగ స్వామి గురించి అమెరికాలో పలివెల గ్రామస్థులైన శ్రీ యెఱ్ఱాప్రగడ శాయిప్రభాకర్ గారు ఎంతో భక్తితో చెప్పేవారు.

ఇలా అమెరికాలో ఉంటున్నా స్వామిపై భక్తి పుట్టి , ఒకానొక కారు ప్రయాణంలో శ్రీ యెఱ్ఱాప్రగడ శాయిప్రభాకర్ గారి ప్రేరణతో స్వామిపై శతకం వ్రాద్దామని సంకల్పం కలిగింది. స్వామి దయతో అమెరికాలో ఉండగా శతకం పూర్తయింది.
తరువాత నివాసం ఆస్ట్రేలియాకు మారింది. ఇదిగో స్వామిదయ ఇప్పుడు కలిగి , ప్రజ-పద్యం శ్రీ పట్వర్ధన్ గారి అనుమతితో , రాజమండ్రి లో జనవరి 19 , 2020 న ఆవిష్కరణ జరుపుకుంటోంది.

ఇలా మూడు ఖండాల సాక్షిగా , కర్మభూమి భరతఖండంపై ఆవిష్కరింపబడుతున్న ఒక ప్రవాస భక్తుని భక్తి శతకం ఈ పలివెల లింగా శతకం.

ఈ సందర్భంగా శ్రీ పట్వర్ధన్ గారికి అనేకానేక ధన్యవాదాలు. పద్యాలను పరిశీలించి , ముందుమాట వ్రాసి, ముద్రణకు ప్రోత్సహించి నన్ను నడిపారు. వారి సామాజికసేవాభిలాషకు , వారి కార్యదీక్షకు తోడై , శ్రీపలివెల లింగేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ఉండాలి అని కోరుకుంటున్నాను.

అలాగే ముద్రణకు సహకరించిన ప్రజ-పద్యం అడ్మిన్ గార్లకు నా ధన్యవాదాలు.

అలాగే శివస్వరూపులై నా శతకాన్ని చదువబోతున్న మీ అందరికీ నా నమస్కారసహస్రములు.

తప్పులన్నీ నావి , దయ మా కృష్ణుడిది.

పుస్తకం ఈ క్రింది‌లంకె ద్వారా ఉచితంగా పొందవచ్చునండి
https://drive.google.com/open?id=19sxv_RA8ILEU3FhIdfD0WmqYaW-fDWTg

తటవర్తి శ్రీకళ్యాణచక్రవర్తి
మెల్బోర్న్ , ఆస్ట్రేలియా.
+61 488 210 113