కావ్యరసామృతం

శ్రీ లీలాశుకుడు రాసిన కావ్యాలలో శ్రీకృష్ణ కర్ణామృతం ఒకటి. ఈ కావ్యంలోని ప్రతి మాట వీనుల విందు. ఈయననే విల్వమంగళత్తు స్వామియార్ అని బిల్వమంగళ ఠాకుర అని చెప్తారు. శ్రీకృష్ణ కర్ణామృతం మూడు ఆశ్వాసాల కావ్యం. ఇందులో మొత్తం మూడు వందల పై చిలుకు శ్లోకాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం చివరి శ్లోకంలో లీలాశుకుడు అనే నామం ఉండటం వల్ల ఇది ఆయన రాసినదే అని పండితుల అభిప్రాయం. మిగతా చోట్ల ఆయన తానో గొప్ప శివభక్తుడు అనే చెప్పుకున్నాడు. ఆయన సమాధి మధురలో ఉన్నట్టు చెప్తారు. అయితే ఆయన దక్షిణ భారత దేశానికి చెందినా కవిగా చెప్పే వారున్నారు. ఆయన గురించి అధ్యయనం చేసిన వారిలో చాలా మంది లీలాశుకుడు కేరళ ప్రాంతానికి చెందిన కవిగా చెప్తారు.

తన రచనలోని ఎక్కువ శ్లోకాలలో లీలాశుకుడు కృష్ణుడిని బాలకృష్ణుడిగా అభివర్ణించాడు. పైగా మెడలో పులి గోరు ఉన్న బంగారు గొలుసు ధరించినట్టు పేర్కొన్నాడు. ఇలాంటి గొలుసు వేసుకునేది ఎక్కువగా కేరళ ప్రాంతీయులే కావడంతో బహుశా లీలాశుకుడు ఆ ప్రాంత వాసి అని పలువురు పండితుల అభిప్రాయం.

ఇక్కడే మరో విషయం చెప్పుకోవలసి ఉంది. కేరళకు చెందిన విల్వమంగళత్తు స్వామియార్ తన బాలముకుందాష్టకంలో మొదటి శ్లోకాన్ని కరారవిండం…అని ప్రారంభించాడు. కనుక ఈ కావ్యకర్త విల్వమంగళత్తు స్వామియార్ అని చెప్పే వారున్నారు.

అయితే బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు ఓ సారి ఆంధ్రప్రదేశ్ ని సందర్శించినప్పుడు ఈ కావ్యాన్ని గుర్తించినట్టు చెప్పేవారున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి అధ్యాయం మాత్రమే లభించడంతో పూర్తి కావ్యం కోసం త్రివేందడ్రానికి కొందరు వెళ్లి సేకరించినట్టు మరికొందరి మాట.

విల్వమంగళత్తు స్వామియార్ గొప్ప గురువాయూరప్పన్ భక్తుడని, విల్వమంగళత్తు స్వామియార్ పిలిచినప్పుడల్లా కృష్ణుడు ఆ ప్రాంతానికి వచ్చిపోతుండే వాడని అంటారు. ఆయన శ్రీకృష్ణ కర్ణామృతంతోపాటు శ్రీ చిహ్నం, పురుషాకారం, అభినవ కౌస్తభ మాల, కర్మదీపిక, తదితర గ్రంధాలు రాసినట్టు పండితులు చెప్పారు.

ఈ మూడు ఆశ్వాసాల సంస్కృత కావ్యంలో మొదటి ఆశ్వాసంలో 110 శ్లోకాలు, రెండవ ఆశ్వాసంలో 109 శ్లోకాలు, మూడవ ఆశ్వాసంలో 108 శ్లోకాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఇది 327 శ్లోకాల కావ్యం. లీలాశుకుడు వాగ్గేయకారుడు. ఈ శ్లోకాలను ఉత్తర భారతదేశంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ వివిధ సంగీత సభలలోనూ, భజన కార్యక్రమాల్లోనూ విస్తారంగా ఆలపిస్తూ ఉంటారు. ఈ శ్లోకాలను రాగమాలికలుగా గానం చేస్తారు. కొన్ని శ్లోకాలకు నృత్యాభినయానికి వీలుగా ఉన్నాయని విద్వాంసుల మాట.

గోపికల ఆధార సుధపై ఉన్న ఆసక్తిలాగా, మునిపత్నులు తీసుకొచ్చి పెట్టిన ఆహారపదార్థాలను ఆస్వాదించి ఆరగించినట్టే తన కావ్యాన్ని కూడా అనుగ్రహించాలని కృష్ణుడికి విన్నవించుకున్నాడు.
కృష్ణుడిని కవి మాటల్లోనే చూద్దాం….

“ఓ నెమలి ఫించదారీ! నీ పాదపద్మాలు కల్పవృక్షానికి చెందిన లేలేత చిగురుటాకులు! నీ పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షం ఖాయం! దేవకన్యలు దోసిళ్ళతో కృష్ణుడిపై కురుపించిన పుష్పాభిషేకం రమణీయం! నువ్వే శరణు అంటే చాలు, మోక్షాన్ని ప్రసాదిస్తావు.

కృష్ణా! నువ్వు శృంగారమయుడవు. ప్రేమమయుడివి. రాగమయుడివి. వేణువు లేకుండా నిన్ను చూడటం అసంభవం కారణం నీకు వేణువంటే అంత ప్రియం! నీ చిరునవ్వు దొంతరలు మధురాతిమధురం! గోపికలు నీకు తమ వొయ్యారపు కడగంటి చూపులతో ప్రేమలేఖలు రాసి తమ మనసులను ఆవిష్కరించారు. నువ్వు శృంగార విలాసాల తరంగాలకు సముద్రుడవు! మధురమైన ఆధర అమృతాన్ని వర్షింపచేసే కృష్ణా! నువ్వు సామాన్యుడివి కావు. నీ గురించి గోపికలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి దొంగనిద్ర నటించిన వాడివి. నీ వేణునాద, మధురాతి మధురం. నీ వేణు నాదానికి కాలి అందియల సవ్వడి ఎంత అనుగుణంగా ఉంటాయో చెప్పలేను. నీ సిగలోని నెమలిఫించం ముందు ఏ ఆభరణమైనా వెలవెల బోవాల్సిందే. నువ్వు ఆత్మబంధువు. కృపా సింధువు. చంద్రుడి సౌందర్యం కూడా నీ సౌందర్యం తర్వాతే! నువ్వు సార్వభౌముడివి. నీ మోహనరూపం చిత్రాతి చిత్రం! సమస్త చరాచర ప్రపంచమూ నీ ఇల్లే. సృష్టికర్త బ్రహ్మ కూడా నీ పుత్రుడేగా! ఇంద్రాదిదేవతలందరూ నీకు దాసులే. నీ ప్రతి మాటా నీ ప్రతి కదలికా మధురం మధురం. కృష్ణా! నీ దివ్య మంగళ రూపం అందరికీ విజయాన్ని చేకూరుస్తుంది. సౌందర్యానికి నిదివైన కృష్ణా! నేను పరమ శివభక్తుడినే కావచ్చు…నిత్యమూ పంచాక్షరి జపించోచ్చు. కానీ నా హృదయపూర్వకంగా ఎప్పుడూ ధ్యానించేది నిన్నే.
కరుణా రస సాగరా! నువ్వు నన్ను కరుణించు. అందుకే నీకీ అమృతాన్ని సమర్పిస్తున్నా” అని లీలాశుకుడు చెప్పుకున్నాడు.