కురుల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు

శారీరక ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ తీసుకునేవారూ జుట్టు విషయంలో కాస్త నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. జుట్టు కేవలం దేహసౌందర్యం కోసమే కాదని, అదీ శరీరంలో ఒక భాగమేనని గుర్తించడంలో కినుక వహిస్తుంటారు. ఫలితంగా జట్టుకు సంబంధించిన ఏదో ఒక సమస్యని ఎదుర్కోనివారు దాదాపుగా లేరు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ జుట్టుకు సమస్యలు అనేక దశల్లో వెంటాడుతూనే ఉన్నాయి. అయితే అవేవీ ప్రాణాంతకం కాకపోవడంతో.. వీటి పరిష్కారం విషయంలో అంతగా దృష్టి సారించరు. కానీ వీటి ప్రభావం శారీరక మానసిక ఆరోగ్యాలపై తప్పక ఉంటోంది. జుట్టుకు వచ్చే సమస్యలేమిటి? కారణాలు, లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవీ…

ఎప్పుడూ నెత్తినున్న జుట్టే కదా అని నిర్లక్ష్యం చేస్తే దాని కిందనున్న చర్మంలో మొదలయ్యే రుగ్మతలు జుట్టుకు తీవ్రంగా హాని చేస్తుంటాయి. జట్టుకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో చుండ్రు, తలలో పేలు, జుట్టు రాలిపోవడం, బట్టతల, బాలనెరుపు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. పెద్దగా రసాయనాలు, మందులు వాడకుండానే వీటిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఏ సమస్యకి ఏది కారణమో ముందుగా గుర్తించగలిగితేనే పరిష్కారం చాలావరకూ వీలౌతుంది.

చుండ్రు
జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు కచ్ఛితమైన కారణం ఇప్పటికీ తెలియదు.. సహజంగా జిడ్డుగా ఉండే తల వల్లే చుండ్రుకు దారితీస్తుందని తెలుస్తోంది. అయితే మరికొన్ని పరిశోధనల వల్ల వివిధ రకాలుగా చుండ్రు సమస్య వస్తుందని భావిస్తున్నారు. ఒక్కో రకమైన చుండ్రు సమస్యకు ఒక్కోవిధమైన కారణం ఉంది.

కారణాలు
చుండ్రు సమస్యకు పలురకాల కారణాలున్నాయి. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌.. తల్లోని నూనెగ్రంథులు స్రవించడం తగ్గిపోవడం.. వాతావరణంలో మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ వాడడం, కాలుష్యం తదితర కారణాలు చుండ్రు సమస్యలకు మూలం.

లక్షణాలు
– తలలో చుండ్రు ఉన్నట్లైతే, దురద ఒక సహజ లక్షణం. జుట్టును వదులుగా వదిలివేయడం వల్ల తలలో దురద మొదలవుతుంది. సాధారణ చుండ్రు కొన్నిసార్లు నీటి మార్పిడి వల్లా ఏర్పడుతుంది. కొన్ని సీజన్లలో వచ్చే చుండ్రు సమస్యకు పొడిబారిన తల ముఖ్యకారణం. అయితే ఈ సమస్యకు భయపడాల్సిన పనిలేదు. ఇది సీజన్‌ మారగానే దానంతట అదే వదిలిపోతుంది.
– దుస్తులపై తెల్లటిపొట్టు రాలడం.. దాంతోపాటే జుట్టు రాలడం.. ఎంత తలస్నానం చేసినా దురదగా ఉండడం. తలమీద చిన్ని కురుపులు కూడా వచ్చి, ముఖం జిడ్డుగా మారి, మొటిమలతో చుండ్రు బాధిస్తుంటుంది
– జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉన్నట్లయితే చుండ్రు ఉన్నట్లు గుర్తించాలి. చుండ్రు తలలోని అదనపు నూనెను గ్రహించి, తలను పొడిబారుస్తుంది. దాంతో జుట్టు చూడటానికి నిర్జీవంగా మారుతుంది. బ్రష్‌తో దువ్వినా.. సరిగా లేకుండా చిందర వందరగా కన్పిస్తుంది.
– చుండ్రు నేరుగా తలకు లేదా జట్టుకు మాత్రమే సంబంధించినది కాదు. అకస్మాత్తుగా ముఖంపై ఇతర చర్మభాగాలపై మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది. ఇవి చాలా బాధను కలిగిస్తాయి. చాలామందిలో చుండ్రును నివారించడంవల్ల మొటిమలు వాటంతటవే తొలిగిపోతాయి.

నివారణ
చుండ్రు నివారణ.. చుండ్రు లక్షణాల పరిశీలన..చికిత్స.. నివారణ.. అనేవి జుట్టు రకం మీద ఆధారపడి ఉంటాయి. చుండ్రుతో బాధపడేవారు సాధారణ చర్మవ్యాధి డాక్టర్‌ని కాకుండా నిపుణుడైన డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి.

కొన్ని జాగ్రత్తలు
సాధారణ రకం చుండ్రు సమస్యని ఎవరికివారే పరిష్కరించుకోవచ్చు.
– మంచి నాణ్యమైన యాంటీ డాండ్రూఫ్‌ షాంపూని ఎంపిక చేసుకుంటే ఇది తలలో తెల్లగా ఏర్పడే పొట్టును నివారిస్తుంది.
– పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, తలకు పట్టించి అరగంట అలాగే వదిలేయాలి. తర్వాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

hair lossజుట్టు రాలడం
ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.
పౌష్టికాహార లోపం: తీసుకునే ఆహారంలోని ఎక్కువ శాతం పోషకాలు శరీరావసరాలకే ఖర్చయిపోతాయి. అలా పోగా మిగిలిన పోషకాలే వెంట్రుకలకు అందుతాయి. కాబట్టి మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పుడే కుదుళ్లు బలంగా ఉంటాయి.
ఎనీమియా: జుట్టు రాలటానికి ప్రధాన కారణం… రక్తహీనత (ఎనీమియా). ఆకుకూరలు, మాంసం, గుడ్లు, చేపలు వంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారై, రాలిపోతాయి.
హార్మోన్లలో అవకతవకలు: స్త్రీలలో మేల్‌ హార్మోన్‌ ఎక్కువకావడం, థైరాయిడ్‌ హార్మోన్‌లో హెచ్చుతగ్గుల వల్లా వెంట్రుకలు పలచనవుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తలెత్తే హార్మోన్‌ హెచ్చుతగ్గుల వల్ల వెంట్రుకలు రాలి, ప్రసవమైన తర్వాత తిరిగి పెరుగుతాయి.
మందుల ప్రభావం: మధుమేహం, డిప్రెషన్‌, ఫిట్స్‌ తదితర వ్యాధులకు వాడే మందుల దుష్ప్రభావం వల్లా జుట్టు రాలుతుంది. క్యాన్సర్‌ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్‌ వల్లా వెంట్రుకలు ఊడిపోతాయి.
నీటి కాలుష్యం: కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో క్యాడ్మియం, సీసం మొదలైన కలుషితాలు ఉంటాయి. ఇవి కలిసిన నీరు తాగితే, ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది.
ట్రాక్షనల్‌ అలోపేసియా: వెంట్రుకలను బలంగా వెనక్కి లాగి కట్టే హెయిర్‌ స్టయిల్‌ వల్లా వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలను వెనక్కి లాగటం వల్ల నుదుటి దగ్గరున్న వెంట్రుకల మీద ఒత్తిడి పెరిగి, జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యనే ‘ట్రాక్షనల్‌ అలోపేసియా’ అంటారు.

నివారణ
జుట్టుతత్వం కనిపెట్టి, నివారణా చర్యలు చేపట్టాలి. పోషకాహారాన్ని మాంసకృత్తులను శరీరానికి అందించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు జిడ్డు, సాధారణ, పొడి రకాలకు చెందిన వెంట్రుకలను వాటి తత్వాన్ని బట్టి షాంపూ, కండిషనర్లను ఎంచుకోవాలి.