కృష్ణశాస్త్రి "పల్లకి"

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి. ఆయన రచనల్లో “పల్లకి” ఓ విలక్షణమైన పద్యాల సంపుటి. పల్లకిలో పద్యాలు విభిన్న కోణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పద్యాలు ఆయన రేడియో వారికి రాసినవే. ఈ పద్యాలలో ఆయన ప్రధానంగా భక్తి, సాంఘిక దృక్పధం, ఆయనకు ఎంతో ఇష్టమైన కొందరు వ్యక్తులపై ఆరాధనా భావాన్ని వెల్లడించారు.

ఈ పద్యాల సంపుటిలో కొన్ని పద్యాలను పల్లకీ శీర్షికన రాశారు. దానినే ఈసంపుటికి కూడా పెట్టారు.

ఆయన కొన్నిచోట్ల ప్రణయ భావనను, మరికొన్ని చోట్ల అభ్యుదయ భావాన్ని ఇలా రకారకాల భావాలను వ్యక్తం చేశారు ఈ సంపుటిలో.

ఈ సంపుటిని ఆయన తన ప్రియమైన మిత్రుడు ఆచంట జానకీరామ్ కి అంకితం చేశారు.

“మంది కృతమహాయుగం ముందున్నది ముందున్నది
ముందున్నది మందే మరి మందే యువ మహాయుగం” అని అభ్యుదయ భావాన్ని పలికిన కృష్ణశాస్త్రి మా అమ్మ అనే శీర్షికన కొన్ని పద్యాలు రాశారు. ఇవి కూడా అభ్యుదయ ధోరణికి అద్దం పట్టే పద్యాలే. శోభాయమానం అయిన ఓ దివాణం బూజు పట్టి నిరుపయోగంగా మారిందన్న విషయాన్ని చెప్తూ ఆ దివాణంలోని సంప్రదాయాలను మారుతున్న కాలానికి తగినట్టు బూజు దులిపి కొత్త దీపాలు వెలిగించే అవసరాన్ని కృష్ణశాస్త్రి గారు చక్కగా చెప్పారు.

అందులోని ఓ పద్యం –

దులిపి దులిపిన తరగదు ధూళి, తుడిచి
తుడిచినా బూజు ప్రాజుట్టు వీడదు, కోణ
కోణమున ఇర్లు మూల్గు పురాణ మీది
వాణమెవరిచ్చిరో యీ అభాజనులకు….

అలాగే ఈ పద్య సంపుటిలో ఒక చోట స్నేహం అన్న శబ్దాన్ని నూనె, స్నేహ భావన అనే రెండు భావాల్లో వ్యక్తం చేశారు. దీపికను వెలిగించి దివాణానికి వెలుగు ఇవ్వటానికి నూనె పోసే వాళ్ళు లేనట్టే సమాజానికి వెలుగు ఇవ్వటానికి తగిన ప్రయత్నం జరగలేదని కృష్ణశాస్త్రి గారు తమ ఆవేదనను వెల్లడించారు.

చిదికిన, వికృతమైన, ముదిసిన, పాతబడ్డ సమాజ స్వరూపాన్ని వికృతం చేసే మూఢ భావాలు, ఆచారాలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పద్యాల పల్లకిని ప్రతి ఆంధ్రుడూ చదవి తరించాలి.

—————————
జగదీశ్ యామిజాల