గానర్షి

కారణజన్ముడు అంటే ఒక బృహత్తర కార్యగామిగా జన్మదాల్చిన వాడు. ఈ తత్త్వం కొంచెం లోతుగా పరిశీలిస్తే మనం అందరమూ కారణజన్ములమే! కానీ చాలా కొద్దిమందిని మాత్రం ఆ బ్రహ్మ ఒక విశేషమైన కార్యసిద్ధి కోసం సృజిస్తాడు. సచిన్, కలాం, గాంధి, K.విశ్వనాథ్ నాకు అనాయాసంగా తోచిన కొన్ని ఉదాహరణలు. వీరంతా తమకు జన్మతః లభించిన ప్రతిభాపాటవాల్ని అమితమైన పరిశ్రమతో, క్రమశిక్షణతో కూడిన అంకితభావంతో మరింత ప్రభావవంతంగా మార్చి, జనబాహుళ్యానికి సంతోషాన్ని, జాతికి గౌరవాన్ని, భావితరాలకు స్ఫూర్తిని అందించారు. ఆ కోవకు చెందిన మరో సరస్వతీమానసపుత్రుడే పండిత్ భీమ్సేన్ జోషి!

ఆ మహానుభావుని గాత్రమధురిమ ఆస్వాదనలో నాలో కలిగిన రసానుభూతికి, భావోద్వేగాలకి, అధిభౌతిక ప్రపంచ సౌందర్యానికి , ఆ అవ్యక్తానందానికి అక్షరరూపం: గానర్షి

నీ గళదుందుభి నిర్దేశంలో
నాట్యం చేసే సురపాతాలు

నీ గళమంజుళరసయజ్ఞంలో
పరమపునీతమగు సప్తస్వరాలు

నీ గళనిర్మల స్వరకౌముదిలో
ప్రణవం పొందును వేదోన్మాదం

నీ సుస్వరసుమధుర ఆవాహనలో
ఇలకొచ్చు సురగంగ పరవళ్ళ ప్రతిధ్వనులు

నీ తానవిద్యుల్లతా ప్రభంజనంతో
రాతిగుండెల్లో పుట్టు రసోత్పాతం

నీ గళగమకపు రసవృష్టి వెలిస్తే
నాలో నానారాగార్ణవ హరివిల్లులు

నీగళ మంగళ నైవేద్యంతో
హిమాహృదయులౌదురు హరిహరాదులు

నీ గళనీరజ సింహాసనమున
వాగ్దేవికి నిత్యకుంకుమార్చనలు

నీ గళనిర్మిత స్వరమందిరమున
క్షీరాబ్ధితనయకు కనకాభిషేకాలు

నీ గానార్చనా జ్వాలారవమ్ములు
నా నిర్వాణానికి నిచ్చెనమెట్లు

నీ గానాంబుధి నట్టనడుమన
నిట్టనిలువునా మునిగి బ్రతికిపోయాను

ఓ గానర్షీ!
నువు నాకారాధ్యుడివి, ఆత్మీయుడివి
ఇవిగో నీ దివ్యచరణాల చెంత
ఈ నా దోసెడు అక్షరపుష్పాలు
ధన్యోస్మి!

–రమాకాంత్ రెడ్డి