గుర‌క‌తో ఆరోగ్యానికి సమస్యలే

రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోవాలని అందరికీ ఉంటుంది. కానీ పక్కనున్న వ్యక్తి తీవ్రమైన భరించలేనంత శబ్దాలతో గురక పెడుతూ ఉంటే ఎవరికైనా భరించడం కష్టమే. కొంత మంది ఆ సమయంలో ఆకాశం బద్దలైనట్లుగా, గులక రాళ్లపై రోడ్డు రోలర్‌ దొర్లినట్లుగా, చెవులు చిల్లులు పడేలా గురక పెడుతుంటారు. ఇది సాధారణంగా చాలా మందిలో ఉండే సమస్య. ఇది వ్యాధి కాదు. ఒక రుగ్మత మాత్రమే. దీనిని నివారించటం కోసం చాలా మంది రకరకాల స్ప్రేలు, మాత్రలు వంటివి వాడుతుంటారు. అయినా అవి సరిగ్గా పని చేయవు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే వారి అనారోగ్యమే గురకకు కారణమని.

ఎవరైనా సరే సాధారణంగా నిద్రించే సమయంలో ముక్కుతో గాలి పీలుస్తుంటారు. ఇలా ముక్కుతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురైతే వారికి తెలియకుండానే నోటి ద్వారా శ్వాసిస్తుంటారు. ఈ సందర్భంలోనే శ్వాసకోశం సంకోచ వ్యాకోచాలకు గురౌతుంది. నాలుక, అంగిటిని నియంత్రించే కండరాల పనితీరు విఫలమై, మెత్తనిభాగం అధిక ప్రకంపనల వలన శబ్దం వస్తుంది. ఇదే గురక. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసేసి, నిద్రలేమికి కారణమవుతుంది.

వీరిలో ఎక్కువ
రకరకాల మానసిక ఒత్తిళ్లు, సమస్యలతో నిద్రమాత్రలు వాడే వారు, ధూమపాన ప్రియులు, మత్తు పానీయాలు సేవించే వారు ఈ గురక బారిన పడుతుంటారు. కొన్నిసార్లు నాసికా రంధ్రాలు సరిగా పని చేయకపోయినా, జలుబు ముక్కు దిబ్బడతో బాధ పడుతున్నా, టాన్సిల్స్‌ వాపు వున్నా కూడా గురక రావచ్చు. వయసు ముదరడం, మితిమీరిన భోజనం కూడా ఇందుకు కారణాలవుతుంటాయి. ఇలా గురక పెట్టే వారికి నిద్ర లేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి పలురకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా ఈ గురక సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే స్త్రీలు అరుదుగా ఉంటారు. వృద్ధాప్యం మీదపడే కొద్ధీ ఈ సమస్య అధికంగా ఉంటుంది. 50 ఏళ్ల వయస్సు దాటిన వారిలో దాదాపు 80 శాతం మంది గురక పెడతారు. కొంతమందికి ముక్కులోఎలర్జీ, పెద్దగా పెరిగిన టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌, ముక్కులోని దూలం వంకర, చిన్న మెడ (షార్ట్‌ నెక్‌), కింద దవడ ఇబ్బందులు, ఎత్తయిన పైదవడ (హైఆర్చ్‌ప్యాలెట్‌) మొదలైనవి కూడా గురకకు కారణమౌతుంటాయి.

లక్షణాలు
– నిద్రలోకి జారగానే మొదలయ్యే గురక గాఢనిద్రలోకి వెళ్లే సరికి మరింత పెరుగుతుంది.snoring
– కొంతమంది నిద్రపోయిన ప్రతిసారీ గురక పెట్టరు. కొన్నిసార్లు మాత్రమే గురక తీస్తారు.
– ఒక్కొక్కరి గురక ఒక్కోరకంగా.. రకరకాల శృతుల్లో ఉంటుంది.
– గురక తీసేవారికి మెలకువ రాగానే చెమట పడుతుంది.
– మెలకువ వచ్చాక అసహనంగా, మనసంతా పాడైనట్లు చిరాకుతో ఉంటారు.
– వేకువజామున తలపోటు వస్తుంది.
– పగటి సమయాల్లో ఎక్కువగా నిద్రపోతుంటారు.
– చేసే పని మీద ఏకాగ్రత చూపించలేరు.
– వ్యక్తిత్వంలో రకరకాల మార్పులు వస్తాయి.
– రాత్రివేళల్లో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటారు.
– గురక తీసే సమయంలో అప్పుడప్పుడూ పూర్తిగా ఊపిరి ఆగినట్లన్పించడం వల్ల అలసట, కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావం తర్వాతరోజు పనిపై పడుతుంది.
– గురక పెట్టేవారు తమ శబ్దాలు తాము గుర్తించలేరు. వారు కొన్నిసార్లు తాము గురక పెడుతున్నామని అంగీకరించరు కూడా.

ప్రమాదం…
– గురక వినేవారికి నిద్రలేమి తప్పక పోగా గురక పెట్టేవారికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
– గురక సమయంలో అప్పుడప్పుడూ ఆగిపోయే ఊపిరి ఎక్కువ సమయం ఆగిపోతే ప్రాణాపాయం తప్పదు.
– రాత్రి ఏడు గంటల నిద్రలో కనీసం 30 సార్లు, 10 సెకండ్ల కాలం పూర్తి శ్వాస ఆగితే (ఎప్నియా). దీనిని స్లీప్‌ఎప్నియా సిండ్రోమ్‌ అంటారు.
– అప్పుడప్పుడూ ఊపిరి ఆగుతుండడం వలన రక్తంలో కార్బన్‌డయాక్సైడ్‌ శాతం ఎక్కువై, రక్తపోటును పెంచుతుంది.
– ఈ అలవాటుతో ఆక్సిజన్‌ను తక్కువగా పీలుస్తారు. ఇది కూడా రక్తపోటుకు దారితీస్తుంది.
– గురక వల్ల ఊపిరి ఆగిన సమయంలో గుండెకు సరైన ఆక్సిజన్‌ అందకపోతే గుండెపోటు, పక్షవాతం రావొచ్చు. ఊపిరితిత్తులపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది.

నిర్ధారణ- చికిత్స
గురక తీసేవారిని నిశితంగా పరిశీలించి అది ఎలాంటి హానికారకమో గుర్తిస్తారు.
సమస్యకు మూలకారణాన్ని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకొని చికిత్స తీసుకోవాలి .
తీవ్రమైన గురకకు, స్లీప్‌ఎప్నియా సిండ్రోమ్‌ – అంగిలి, గొంతు లోపల ఇతర భాగాల పొరను తగ్గించి, శ్వాస బాగా ఆడేలా చేసే యు.పి.పి.పి. ఆపరేషన్‌ చేస్తారు. లేజర్‌ పద్ధతిలో కూడా ఈ శస్త్రచికిత్స చేయవచ్చు. గురక సమయంలో గొంతునాళాల ప్రకంపనలకు కారణం ప్రధానంగా ముక్కులోని శ్వాసమార్గంలో అడ్డంకులుండడం ఈ అడ్డంకులను తొలగించాలంటే, మెడికల్‌ షాపులలో రెడీగా దొరుకుతున్న నాసల్‌ స్ట్రిప్స్‌ వాడాలి. ఇవి ముక్కు రంధ్రాలను తెరచి గాలి బాగా ప్రవహించేలా చేస్తాయి. పడుకోబోయే ముందు ఆవిరిపట్టి, శ్వాస మార్గాన్ని శుభ్రపరచుకుంటే అందులో ఉంటే మ్యూకస్‌ శుభ్రపడి, మంచి నిద్ర పడుతుంది. శ్వాస మార్గంలో అవరోధాలు కలిగించే ఆల్కహాలు, నిద్రమాత్రలు, ట్రాంక్విలైజర్లు, యాంటీ హిస్టమిన్లు వంటివాటిని వాడడం మానేయాలి. గురక తగ్గుతుంది. గురకకు పొగ తాగటం ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల సిగరెట్లు, చుట్టలు వంటివాటికి దూరంగా ఉండాలి. ముక్కు రంధ్రాలలో మ్యూకస్‌ శుభ్రపరచుకొని, అధికంగా ఉన్న వెంట్రుకల్ని కత్తిరిస్తే కూడా గురక తగ్గే అవకాశం ఉంది.

ఆహారపు అలవాట్లను మార్చాలి
నిద్రపోయే ముందు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించడం వల్ల గురక సమస్యను నివారించొచ్చు. పాల ఉత్పత్తులు, కేకులు, చాక్లెట్లు, పిజ్జా వంటి ఆహారాన్ని తీసుకోకూడదు. పడుకునే ముందు హెవీ ఫుడ్‌కు బదులు లైట్‌ ఫుడ్‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి శ్వాస కోశంలో గాలి స్వేచ్ఛగా ఆడుతుంది. నిద్రించడానికి సరైన సమయాన్ని పాటించాలి.

నివారణకు సూచనలు
– లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
– నీటి ఆవిరిలో యూకలిప్టస్‌ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.
– నిద్ర పోయేటప్పుడు పక్కకు తిరిగి, పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకోవాలి.
– ఏదైనా పదార్ధం వల్ల ఎలర్జీ ఉన్నట్లైతే వాటిని తినడం మానేయాలి.
– గురక ఉన్న వారు వెల్లకిలా పడుకోవడం వల్ల సమస్య అధికమవుతుంది. అటువంటి వారు ఓ పక్కకు తిరిగి పడుకోండి.
– ఎత్తుగా ఉన్న తలగడగానీ, రెండు తలగడలనుగానీ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల గురకను నియంత్రించవచ్చు.
– గురక పెట్టడానికి ఊబకాయం కూడా పెద్ద సమస్య. కాబట్టి వీలైనంత వరకూ బరువు తగ్గితే ఫలితం ఉంటుంది.
– చాలా మంది గురక నివారణకు మద్యం, నిద్రమాత్రలు వంటివాటిని వాడుతుంటారు. కానీ వీటివల్లా గురక సమస్య అధికమవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.