ఘంటసాల పుష్పవిలాప ఖండిక

పద్యాలు రాగయుక్తంగా ఆలపించడంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికో ప్రత్యేకత ఉంది అనడం అతిశయోక్తికాదు. ఆయన పద్యాలను కొత్త ఒరవడిలో రసవత్తరంగా ఆలపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. ఆయన ఆలపించిన వాటిలో కరుణశ్రీ పుష్పవిలాపం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించేంతగా ఉంటుంది.

కవి ఓరోజు పూజకోసం పువ్వులు కోయడానికి వెళ్ళినప్పుడు అవి ఆయనను చూసి విలపించినట్లు రాసిన పద్యాలకు తెలుగు సాహిత్యంలో చెక్కుచెదరని స్థానముందన్నదాన్ని ఎవరూ కాదనలేరు. వాటిని ఘంటసాలవారు ఆలపించిన తీరు గురించి ఇక వేరేగా చెప్పక్కర్లేదు.

ఉత్పలమాలలోని ఈ పద్యాన్ని చూద్దాం…
నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి మా
ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి, క్రుంగిపోతి నా
మానలమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై

– ఓ పూల మొక్క వద్దకు కవి కరుణశ్రీ జంధ్యాల వారు కొమ్మను వంచి పూలు కోద్దామని గోరును ఆనించడంతోనే పూలన్నీ జాలిగా ఆయన వంక చూసి మా ప్రాణం తీస్తావా అని విలపించాయట. దాంతో ఆయన మనసు కుంగిపోయి కలం నుండి ఈ పుష్పవిలాప పద్యాలు జాలువారాయి.

కరుణశ్రీ గారి హృదయం సున్నితమైంది. పుష్పవిలాపం పేరుతో ఆయన పద్నాలుగు పద్యాలు రాశారు. అవి 1942 ప్రాంతంలో ఆయన పని చేసిన ఎ.సి. కళాశాల వార్షికోత్సవ సంచికలో మొదటిసారిగా అచ్చయ్యాయి.

మరో ఏడేళ్ళకు ఘంటసాలవారు గుంటూరులో ఓ పెళ్లికి హాజరయ్యారు. అప్పుడు ఘంటసాలవారు ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు మహావాది వెంకటప్పయ్య గారితో కలిసి కరుణశ్రీ గారింటికి వెళ్లారు. కరుణశ్రీగారు తాను రాసిన ఉదయశ్రీ పుస్తకాన్ని వారికి ఇచ్చారు. అందులోని పుష్పవిలాప పద్యాలను మహావాదివారు వెంటనే నాటకీయ ఫక్కీలో పాడి వినిపించగా ఘంటసాలవారు అలాకాకుండా తమదైన ఒరవడిలో పాడాలనుకున్నారు. పాడారు కూడా. ఘంటసాలవారు పద్నాలుగు పద్యాలలో ఆరింటిని ఎంపిక చేసుకుని వాటికి ముందు ఆయనే సొంతంగా ఓ వ్యాఖ్యానాన్ని రాసుకుని కరుణశ్రీగారి ఉద్దేశానికి అనుగుణంగా ఓ బాణీని రూపొందించుకుని ఆలపించారు. పువ్వుల జీవితం క్షణికమైనా అవి ఎంతో అమూల్యమైనదని వేరేగా చెప్పక్కర్లేదు. ఉన్న ఆ కాసేపట్లోనే అవి చూపరులను ఆకర్షించడం, పూజకు ఉపయోగపడటం వంటివన్నీ చేసి జీవితాన్ని త్యాగం చేసుకుంటాయి. ఓ విధంగా పువ్వులది మనకందరికి ఆదర్శ సందేశమనుకోవాలి. వాటికి తమ అందం ఏమిటో తెలియకుండానే పూసి నిస్వార్థంగా సేవలందించడం అమోఘం. అందుకే కరుణశ్రీగారు ఓ పద్యంలో ఇలా చెప్పిస్తారు పువ్వులతో…

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమొ
అందమును హత్య చేసెడి హంతకుండ
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ

గౌతమబుద్ధుడు పుట్టిన భూమ్మీద పుట్టిన వాడా, మానవసహజమైన పరేమ నీలో లేకుండా పోయిందా, అందాన్ని హత్య చేసిన వాడా, నీ మానవజన్మ వ్యర్థం, అంటరానిది అని దీని భావం.
ఇలాఉండగా, ఈ పుష్పవిలాపం విన్న తర్వాత సుప్రసిద్ధ గాయని ఎస్ . జానకి స్పందించి ఆ రోజు నుండి పువ్వులు పెట్టుకోవడం మానేశారన్నది కొందరి మాట.
ఘంటసాలాగారు పాడిన ఈ పుష్పవిలాప పద్యఖండిక 1950లో విడుదల అయింది.
– యామిజాల జగదీశ్