చిగురిస్తున్న ఆశలు – తాయి @C3

చిగురిస్తున్న ఆశలు – తాయి @C3

 

ఒకే దేశం నుండి వచ్చాం. విదేశంలో కలిసాం. పది కాలాల పాటు కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నాం. మన పరపతిని పెంచుకోవాలనుకుంటున్నాం. మన ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నాం. ‘మనం’ అన్న పదంలో మన భాషే పాశం అని గుర్తెరిగి అందరినీ కలుపుకుంటూ ఆదరించుకుంటున్నాం. “మనం” అంటే ఒక భాష, ఒక బంధం, బాంధవ్యం, ఒక సంస్కృతీ, సాహిత్యం, మన వాజ్మయం, ఒక ఆలోచనా సరళి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, తరతరాల వారసత్వం, మన మాండలీకాలు, కళలు, కళా రూపాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రభంధాలు, ప్రవచనాలు, శతకాలు, గేయాలు, గీతాలు, సామెతలు – ఇలా ఒక మహోన్నతమైన సంస్కృతికి వారసులం. మన భాష మన గర్వం. ఇలా అనుకుంటే ఎంత అందంగాను, ఆనందంగానూ వుంటుంది! అనుకోవడమే కాదు ఈ వారసత్వాన్ని భావి తరాలకు ఇవ్వవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇంకో ఇరవై పాతికేళ్ళ తరువాత ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలు కూడా “మనం” అనుకున్నట్లే వారు కూడా “మనది” అనే సంస్కృతిని చెప్పుకోవడానికి ఒక స్థిరమైన రుజువు కావాలి. ఈ రుజువు కోసమే గత కొన్నేళ్లుగా మేదోమధనం చేసి తనకున్న పరిధులను అవగతం చేసుకొని ఒక న్యాయసమ్మతమైన అనుబంధ సంస్థను తెలుగు సంఘం (TAAI) ఏర్పాటు చేసింది. అదే Australia Telugu Community and Cultural Centre(ATCCC). పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన ఉనికిని కాపాడుకోవాలన్న తపన ప్రతీ వలసదారునికీ ఉంటుంది. అయితే సంఖ్యాపరంగా పెరిగే కొలదీ ఈ కోరిక బలోపేతమౌతుంది. తరువాత “మనది” అన్న ఒక నిర్దిష్టమైన స్థిరాస్తితో గానీ, వస్తువుతో గానీ అన్వయించుకోవాలన్న మోజు పెరుగుతుంది. 28 సంవత్సరాలు యుక్త వయస్సు నిండిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సహజమైన సమస్యలు సమాలోచనలతో పరిష్కరించుకుంటూ సంస్థాపరమైన పరిణామాలకు ఒక ప్రమాణంగా నిలచి ఇప్పుడు ఒక స్వంత భవనం చేకూర్చుకోవాలన్న తలంపుతో ఎన్నో మలుపులను గెలుపులుగా మలచుకొని అంచెలంచెలుగా ముందుకు సాగుతున్న సంస్థ తాయి. చాలామంది సభ్యులు కొన్నేళ్లుగా “మనది” అన్నది ఒక ప్రశ్న గానే మిగిలిపోతుందా అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. కానీ కొంతమంది సభ్యులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం వివిధ దారులు అన్వేషిస్తూ గత రెండు సంవత్సరాలుగా అహర్నిశలూ కష్టపడి పని చేస్తున్నారు. దీని ఫలితమే ATCCC (@C3) ఆవిర్భవించింది. అందరిలోనూ క్రొంగొత్త ఆశాభావం రేకెత్తించింది. ‘కోరిక తీరేనా! కలగా మిగిలేనా’ అన్న భావం కనుమరుగౌతుంది. ఊహా చిత్రంగా భవన స్వరూపం కళ్ళకు కనబడుతుంది. 2018 లో మన సంఘంలోనున్న ఎంతోమంది సభ్యులతో క్రమ పద్ధతిలో మంతనాలు జరిపి గత సంవత్సరం 15 మంది ఔత్సాహికులైన సభ్యులు తలా 5,000 డాలర్ల విరాళంగా ఇచ్చి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థకు DGR హోదా రావడానికి కావలసిన పత్రాలు సమర్పించి త్వరలో ఈ హోదా రాగలదని ఆశాజనకంగా ఉన్నారు. దీనివలన విరాళాలు ఇచ్చే సభ్యులకు పన్ను మినహాయింపు వస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేయడం అనేది మానవ జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. అందునా ఆస్ట్రేలియాలో ఇదొక కలగా భావిస్తారు. చరిత్రలో ఎప్పుడో కాలం కలిసిరాక స్తిరాస్తి విలువ తగ్గడమనేది ఒకటి రెండు సార్లు జరిగింది కానీ సగటున 10 సంవత్సరాల కాలంలో దాని విలువ రెట్టింపు కావడం సర్వసాధారణం. మొదటిగా తెలుగు సంఘం మరియు @C3 దైనందిన కార్యకలాపాలను నిర్వహించుకుంటూ వచ్చే ఆదాయం అప్పును తీర్చుకునే ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్న ఆలోచన సరైనదే. కాలానుకూలంగా విలువ పెరిగినపుడు అవకాశం చూసుకొని ఒక మంచి స్థలాన్ని కొని అవసరానికి సరిపడే అనుకూలమైన భవనం నిర్మించాలన్న ఆలోచన ఎంతో శ్లాఘనీయమైనది. స్థిరాస్తి లావాదేవీలలో కార్యవర్గ సభ్యులు తమ పరిధిలోనున్న అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే మొదటి స్థిరాస్తి అప్పు లేకుండా సభ్యుల విరాళాలు/చందాల ద్వారా ఈ లక్ష్యం సాధించగలిగితే ముందు ముందు మరింత పురోగతి చెందడానికి అవకాశం ఉంటుందని పలువురు సభ్యులు అంటున్నారు. మన సంఘంలోనున్న పలు వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ‘మనది’ అన్న వస్తువు చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. దాతలందరూ ముందుకు రావాలని కోరుతున్నారు. తెలుగు సంఘంలోని సభ్యులందరూ తమవంతు సాయమందించి ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని మనందరిలో చిరకాలంగా ఉన్న కల సాకారం కావడానికి చేయూతనివ్వాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైటుని (www.atccc.org.au) చూడగలరు.