చిన్నపాటి స్వార్ధం

అయోమయంలో ఉన్నప్పుడు
ఓ చిన్నప్పటి స్వార్ధం
కరుణామయుడైన దేవుడిలా
నడిపిస్తుంది

నిర్ణయం తీసుకోవడంలో
తర్జనభర్జన పడుతున్నప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
కాలం మించిపోయినట్టు గుర్తు చేస్తుంది

తప్పుచేశామన్న ఆలోచన
మన చేతుల్ని కట్టి పడేసినప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
ఆ చేతులను
ఓ హంతకుడి చేతుల్లా గట్టిపరుస్తుంది

న్యాయం గొంతు
వినడం మొదలుపెట్టినప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
చుట్టూ ఉన్న అన్యాయాలను
ప్రశ్నించేలా చేస్తుంది

మన గుప్పెట్లో లేని స్థితి
ఎదురైనప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
మౌనాన్ని నేర్పుతుంది

ఆత్మహత్య చేసుకోవడానికి అయిన
చివరి కారణాన్నిఅమలు చేసే వేళ
ఓ చిన్నపాటి స్వార్ధం
ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెప్తుంది

అమూల్యమైన కన్నీరు
కళ్ళను తడుపుతున్నప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
కళ్ళల్లో ఏదో దుమ్ము పడినట్టు
అబద్ధం చెప్పిస్తుంది

ప్రేమ
నిన్ను స్పర్శించినప్పుడు
ఓ చిన్నపాటి స్వార్ధం
మనల్ని సంపూర్ణంగా
కోల్పోనివ్వకుండా కొంచం
అడ్డుపడుతుంది

—————————
తమిళంలో మనుష్యపుత్రన్
అనుసృజన యామిజాల జగదీశ్