చిన్నారులకి మీజిల్స్ ముప్పు

measles
ప్రధానంగా పిల్లలకు వైరస్‌ వల్ల వచ్చే అంటువ్యాధి మీజిల్స్. తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధినే ఆంగ్లంలో మీజిల్స్‌ అని పిలుస్తారు. దీనికి కారణం మార్‌బిల్లీ వైరస్‌. ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్‌ వైరస్‌ జాతులను గుర్తించారు. 1963లో తట్టు వ్యాధి నిరోధక టీకాను కనుగొన్నారు. జెర్మన్‌ మీజిల్స్‌ అనే ఇంకో తట్టు వంటి దద్దుర్లు కలిగించే వ్యాధి రుబెల్లా వైరస్‌ వల్ల వస్తుంది.

గాలితో వ్యాప్తి
ఈ వ్యాధి కలిగించే వైరస్‌ చాలా తేలికగా, వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిచిన గాలిలో ఉండే క్రిములు సమీపంలో ఉన్న వ్యక్తి శ్వాసనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒకసారి మరో రోగి శరీరంలోకి ప్రవేశించగానే ఈ క్రిములు శరీర ఉపరితలంపై ఉండే కణజాలానికి (ఎపితీలియమ్‌కి) అంటుకుని, అక్కడ నుంచి కణాలలోకి ప్రవేశించి, రక్తం ద్వారా వివిధ శరీర వ్యవస్థలకు చేరుతాయి. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఈ వ్యాధి ప్రబలుతుంది. ఈ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి రోగ లక్షణాలు కనిపించడానికి 4-12 రోజుల సమయం పడుతుంది. తట్టు వచ్చినవారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన మూడు రోజుల నుంచి మొదలుకొని, దద్దుర్లు పూర్తిగా తగ్గిన ఐదు రోజుల వరకూ ఇతరులకు అంటించే ప్రమాదముంది.

లక్షణాలు
Measles-kidsతట్టు వ్యాధి లక్షణాలు ఇది సోకినవారి రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటాయి.
– కళ్లు బాగా ఎర్రబారుతాయి. దీనిని కంజక్టవైవల్‌ కంజషన్‌ అంటారు. కంజెక్టివైటిస్‌
– నోటి లోపలి బుగ్గలలో ఇసుక రేణువులు వంటి మచ్చలు కన్పిస్తాయి. వీటిని కాప్లిక్‌ స్పాట్స్‌ అంటారు.
– కాప్లిక్‌ స్పాట్స్‌ 24-36 గంటలు మాత్రమే ఉంటాయి. శరీరంపై దద్దుర్లు ఎక్కువై జ్వరం తగ్గుముఖం పట్టగానే ఇవి కనిపించవు.
– మూడు కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటుంది.
– పిల్లలు బాగా నలతగా, నీరసంగా ఉంటారు. తిండి తినబుద్ధి కాదు.
– ముక్కు, నోరు ఎర్రగా అవుతాయి. దగ్గుతుంటారు. రెండు, మూడు విరేచనాలూ కావొచ్చు. పైగా తీవ్రమైన జ్వరం ఉంటుంది.
– వైరస్‌ సోకిన నాలుగో రోజుకు సన్నగా దద్దు ప్రారంభమవుతుంది. ముందు ముఖం మీద, తర్వాత చెవుల వెనుక, తర్వాత ఛాతీ మీద, ఆ తర్వాతి రోజు కాళ్లకు.. ఇలా క్రమేపీ తల నుంచి కాళ్ల వరకూ శరీరమంతా దద్దు వ్యాపిస్తుంది.

అనారోగ్యాలకు మూలం
సాధారణంగా మీజిల్‌ మరికొన్ని అనారోగ్యాలకు మూలంగా మారుతుంటుంది. కొన్ని తీవ్రమైన సమస్యలు కాకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఊపిరిత్తుతులకు నిమ్ము చేరి, న్యుమోనియా రావచ్చు. కొద్దిగా అతిసారం జరగవచ్చు. అరుదుగా మెదడువాపు, (ఎన్‌సెఫలైటిస్‌), మెనింజైటిస్‌ వచ్చే అవకాశం కూడా ఉంది. తట్టు వచ్చాకా చాలా సంవత్సరాలకు సబ్‌ స్కిరీజింగ్‌ పాన్‌ ఎన్‌సెఫలైటిస్‌ అనే అంగవైకల్యానికి దారితీస్తుంది. తట్టు సంబంధించిన వైరస్‌ నాడీ వ్యవస్థలో స్తుప్తావస్థలో ఉండి 15-16 సంవత్సరాలకు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా అంగవికలురుగా, మతిమరుపు, మూర్ఛ వ్యాధితో బాధపడి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో సగటు జీవితకాలం కంటేచాలా ముందుగా చనిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు పౌష్టికాహారం తీసుకోక పోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి పోతుంది. అప్పుడు సాధారణ స్థాయిలోని ఈ వైరస్‌ వల్ల వ్యాధి సోకినా ప్రాణాంతకం కావొచ్చు. పౌష్టికాహారం సరిగా లేని వారిని వ్యాధి సోకితే మరణించే శాతం 30శాతం వరకు ఉంటుంది. అటువంటివారిలో తగు జాగ్రత్తలు తీసుకొని పౌష్టికాహారం ఇచ్చి సమపాళ్ళలో విటమిన్స్‌ ముఖ్యంగా విటమిన్‌ ఎ, జింక్‌ వంటివి ఇవ్వాలి.

నిర్ధారణ – చికిత్స
రోగిని శరీరంపై దద్దుర్లు ను పరీక్షచేసి, రోగ లక్షణాల ద్వారా కొంతవరకూ ఈ వ్యాధి నిర్ధారణ చేస్తారు. కొన్ని సార్లు ఇలా నిర్ధారించలేకపోతే లాబరేటరీలో మరికొన్ని పరీక్షలు చేస్తారు. లాలాజలాన్ని వైరస్‌ పరీక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్‌ వైరస్‌ దాడి చేస్తే శరీరం వ్యాధి నిరోధక యాంటీబాడీస్‌ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధిని నిర్థారిస్తారు. ఈ వ్యాధి నిరోధక యాంటీబాడీస్‌ రెండు రకాలు ఎల్‌జిఎమ్‌, ఎల్‌జిజి. మీజిల్స్‌ ఎల్‌జిఎమ్‌ రక్తంలో కనిపిస్తే మీజిల్స్‌ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్‌ ఎల్‌జిజి రక్తంలో కన్పిస్తే అంతకుముందు కూడా ఈ వ్యాధి సోకిందని, మీజిల్స్‌ టీకా కూడా తీసుకున్నట్లు స్పష్టమౌతుంది.

మిగతా వైరల్‌ జబ్బుల వలే తట్టుకు ప్రత్యేకమైన చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు అనుసరించి మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకుండా చూడాలి. ముందుగా లక్షణాలను బట్టి తట్టును గుర్తించి, అత్యవసరంగా చికిత్స ఆరంభించాలి. చాలామంది ఇలాంటి సమయాల్లో పిల్లలను ఇంట్లోనే కూచోబెట్టి, నానా పథ్యాలూ చేయిస్తుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే దీనిమూలంగా ఇతర ముప్పులు పొంచి ఉంటాయి. చాలామంది తట్టు వచ్చినపుడే విటమిన్‌-ఎ లోపం మరింత పెరిగి, చూపు కోల్పోతున్నారు. తట్టు మూలంగా న్యుమోనియా, చెవిలో చీము, మెదడు వాపు వంటివీ వస్తాయి. కాబట్టి తప్పకుండా డాక్టర్‌ ద్వారానే చికిత్స పొందాలి. ఈ వ్యాధి వచ్చిన పిల్లలందరికీ విటమిన్‌ ఏ, బీ కాంప్లెక్స్‌ తప్పకుండా ఇవ్వాలి. తగినన్ని నీళ్లు తాగించాలి. ఏ రూపంలోనైనా ఆహారం ఇవ్వాలి. నోటితో తీసుకోలేకపోతే సెలైన్‌ పెట్టి, పోషకాలను అందించాలి. జ్వరానికి పేరాసిటమాల్‌ వంటి మాత్రలు, దగ్గుకు కాఫ్‌ సిరప్‌, దురదకు సిట్రజన్‌ మాత్రలు వంటివి వాడాలి.

మీజిల్స్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి!
తట్టు వ్యాధి పిల్లలకు చాలా ప్రమాదకరమైంది కాబట్టే జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా టీకాల ద్వారా నిరోధిస్తున్నారు. బిడ్డకు 9 నెలలు నిండగానే దీన్నిస్తారు. దీంతో చాలావరకూ సమస్య దరిజేరదు. మీజిల్స్‌ వ్యాక్సిన్‌ (టీకా) లో ఉండే బలహీనమైన వైరస్‌ల కారణంగా అదే తరహా వైరస్‌ లను అడ్డుకోనే సామర్ధ్యాన్ని శరీర రక్షణ వ్యవస్థ పొందుతుంది. మీజిల్స్‌ వైరస్‌ వాక్సిన్‌ వైరల్‌ వాక్సిన్ల మందుల విభాగంలోకి వస్తుంది. ఇది యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసి, శరీరాన్ని రక్షించేందుకు సహాయపడే ప్రోటీన్‌ రకానికి చెందినది. రోగ నిరోధక వ్యవస్థని సకాలంలో స్పందిపజేయడం ద్వారా మీజిల్స్‌ వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణ అందించేలా పనిచేస్తుంది. అయితే మన దేశంలో కేవలం 60 శాతానికి పైబడి మాత్రమే పిల్లలు ఈ టీకాను తీసుకున్నారు. ఇంకా దాదాపు 40 శాతం మంది తీసుకోవాల్సి ఉంది. దేశంలో 80 శాతం మంది పిల్లలు ఈ టీకాను తీసుకునేలా చేస్తే… ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం తగ్గుతుంది. అప్పుడు దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. చాలా దేశాల్లో తట్టును ఇప్పటికే పూర్తిగా నిర్మూలించారుగానీ మనం ఇంకా ఆ దశకు చేరలేదు. పోషకాహారలోపం గలవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది.