చైతన్యం

చైతన్యం

జెన్ తత్వంలో ప్రధానమైనది చైతన్యవంతులై ఉండటం.

ఒకరి అంతరంగం చైతన్యవంతమై ఉంటే ఆ తర్వాత అతను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏది చేసినా దాని గురించి ఆలోచించక్కరలేదు. ఇక్కడ చైతన్యవంతమై ఉండటమే ముఖ్యం.

ఈ చైతన్యాన్ని జ్ఞానం అంటున్నాయి ప్రపంచ వేదాలన్నీ. దీనినే అంతరంగంలోని జ్యోతి అని అంటున్నారు సిద్ధులు. ఈ చైతన్యం కోసం జ్ఞానులు, మహాత్ములు పడరాని పాట్లు పడుతుంటారు. కొందరు దీనికోసం దీర్ఘకాలం కృషి చేస్తారు. కొందరైతే తేలిగ్గానే దీనిని సాధిస్తారు.

ఆశ్చర్యంతోనో విస్మయంతోనో ఒక మాట ద్వారానో ఒక సైగ ద్వారానో ఇంకా చెప్పాలంటే అనేక మార్గాలలో జెన్ గురువులు తమ శిష్యులకు ఈ చైతన్యాన్ని తెలియజేస్తారు.

బోధి వృక్షంక్రింద బుద్ధుడికి జ్ఞానోదయమయ్యింది. ఆ తర్వాత ఆయనను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. రోజురోజుకీ ఈ సంఖ్యా పెరుగుతూ వచ్చింది. బుద్ధుడి ముఖారవిందాన్ని చూసిన వారు ఉన్న చోటనే తన్మయులైపోయారు. తమను తాము మరచిపోయారు. ఆయన ముఖంలోని ప్రశాంతత కళ్ళల్లో ప్రకాశం, పెదవులపై చిర్నవ్వు సందర్శకులను కట్టిపడేశాయి.
అప్పుడు “స్వామీ! మీరెవరు? భూమ్మీద ఇంత అందమా” ఆహా దేవుడి అవతారామా మీరు?” అని ఒక వృద్ధురాలు అడిగారు.
“లేదమ్మా! నేను దేవుడిని కాను” అన్నారు బుద్ధుడు చిరునవ్వుతో.
“ఆహా! దేవతలు మిమ్మల్ని ఇక్కడికి పంపారా?” అని మరొకరు అడిగారు.
“కాదు. నేను దేవదూతను కాను” అన్నారు బుద్ధుడు.
“అలాగైతే మీరు మహా జ్ఞాని అయి ఉండాలి” అన్నారు ఇంకొకరు.
“కాదు. నేను మహాత్ముడిని కాను. అద్భుతమైన చర్యలపై నాకు ఎలాంటి ఆసక్తీ లేదు” అన్నారు బుద్ధుడు.
“మరి అలాగైతే మీరెవరు? చెప్పండి స్వామీ” అని ఒకరు వినయంగా అడిగారు.
“నేనా? నేను ఎవరు? ఆ ప్రశ్నకు జవాబుని నేను. నేను వొట్టి చైతన్యాన్ని. చైతన్యమూర్తిని…” చైతన్యం తప్ప మరొకటి కాదు….అంతే చెప్తున్నానుగా నేను వొట్టి చైతన్యాన్ని” అన్నారు బుద్ధుడు.
బుద్ధుడి శిష్యుడైన సుబుద్ధి ఉన్నట్టుండి ఒక చైతన్యం పొందారు.
ఏమీ లేని గొప్పతనం తెలిసింది. ఎందులోనూ నేను అనే చింతన లేని నిజాన్ని తెలుసుకున్నాడు. ఆయన మనసు ఏమీ లేని స్థితిలో ఆయన మహా ఆనందం పొందాడు. ఆయన చెట్టుకింద కూర్చుని ఆనందంలో తనను తాను ,మరచిపోయారు.
అప్పుడు ఉన్నట్టుండి ఆయన చుట్టూ పూల వర్షంకురిసింది.

“ఏమీ లేని తనాన్ని ఎంత లోతుగా ఎంత అందంగా ఉపదేశిస్తున్నారో కదా” అన్నారు దేవతలు నెమ్మదిగా.
“నేను ఏమీ లేని దాని గురించి ఏమీ చెప్పలేదుగా….” అన్నాడు ఆ శిష్యుడు.
“నిజం. మీరు దాని గురించి మాట్లాడలేదు. మేము కూడా దాని గురించి వినలేదు. ఇదే నిజమైన ఏమీ లేనితనం” అన్నారు దేవతలు. పూల వర్షం కురుస్తూనే ఉంది.
ఏమీ లేని తనాన్ని తెలుసుకునే ముందు దాని గురించి ఎవరూ ఊహించలేరు. దాని గురించి తెలుసుకున్న తర్వాతా అసలు దాని గురించి మాట్లాడనూ లేరు. దాని గురించి మాట్లాడేందుకు మాటలూ ఉండవు
———————–
యామిజాల జగదీశ్
———————

Send a Comment

Your email address will not be published.