ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు.

శివాజీ ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!

ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు.

అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.

ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.

Send a Comment

Your email address will not be published.