జనరంజని – మధుర స్మృతుల మనోరంజని

IMG-20171107-WA0034
IMG-20171107-WA0036 IMG-20171107-WA0035 IMG-20171107-WA0033
పాతికేళ్ళు పైబడినా ఏదో క్రొత్తదనం, ఎదురుచూసే జనానికి కళలతో కూడిన పచ్చతోరణం. ప్రతీ ఏటా మననం చేసుకోవటానికి మిగిల్చే అనుభూతుల వలయం. మన ఉనికిని గుర్తుచేసుకునే మంచి జ్ఞాపకాల కధనం. ‘మన’ వారిని కలుసుకునే అవకాశం. పలకరింపుతోనే పులకరింప జేసే తియ్యదనం. మన భాషను కొలిచే ఔన్నత్యం. అమ్మ భాషకు అందలం.
వయసుతో సంబంధం లేకుండా మూడేళ్ళ పిల్లలనుండి 70 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ ఆనందంగా పాలుపంచుకొని ఆహ్లాద వాతావరణంలో జరుపుకునే ఆస్ట్రేలియా తెలుగు సంఘం జనరంజని గత ఆదివారం నవంబరు 5వ తేదీన జరిగింది.

ఈ జనరంజని ప్రత్యేకంగా యువతరానికి సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఆది నుండి అంతం వరకూ ఒక కధలా నడిపించి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు మన సంస్కృతీ సాంప్రదాయాలను నేర్చుకోవడానికి అనుగుణంగా మలిచి అందులో నృత్య గీతికలు, సాంప్రదాయ కళలు, సినీ గీతాలు, పౌరాణిక నాటకాలు, జానపదాలు, బతుకమ్మలు, లఘు నాటికలు – నవ రసాలు గుప్పించి రక్తి కట్టించారు.

ప్రతీ కార్యక్రమంలో కంటికింపుగా చెవులకు వినసొంపుగా ఉన్న కొన్ని ఆకట్టుకున్న అంశాలు ఉండనే ఉంటాయి. వాటిలో తెలుగుబడి కార్యక్రమం, జానపదాలతో కూడిన చెక్కభజన, ప్రకృతిని పరిరక్షించడం, షాడో డాన్స్ లాంటి అంశాలు చాలా చక్కగా వున్నాయన్నది నిర్వివాదాంశం.
IMG-20171107-WA0038IMG-20171107-WA0037
IMG-20171107-WA0029
తెలుగు చిత్ర పరిశ్రమలో షుమారు 40 ఏళ్ళు తమ కధా సంభాషణలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న పరుచూరి బ్రదర్స్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా వచ్చారు. వారు ఇప్పటివరకూ 356 చిత్రాలకు తమ సేవలందించిన సంగతి అందరికీ విదితమే. నటులుగా, దర్శకులుగా, రచయితలుగా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా వారు చిత్రసీమకు సేవ చేసారు. వారివురూ వారి అమ్మను స్పూర్తిదాయకంగా తీసుకొని ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన వైనం వివరించి జీవితంలో పై ఎత్తులకు ఎదగాలంటే ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యసాధనపై గురిపెడితే అసాధ్యమన్నది లేదని సందేశాన్నిచ్చారు. తెలుగు సంఘం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిచ్చి సభ్యులందరూ మన భాషను కాపాడాలని పిలుపునిచ్చారు. తెలుగు సంఘం వారిని సమున్నతంగా సన్మానించింది.

విక్టోరియన్ స్కూల్ అఫ్ లాంగ్వేజ్ నుండి శ్రీ కాన్ పాపస్ ప్రత్యేక అతిధిగా వచ్చారు. వారు మాట్లాడుతూ తెలుగు భాష విక్టరియాలో Language Other Than English (LOTE) గా గుర్తింప బడడానికి సన్నాహాలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ శుభ వార్త అందించడానికి తాము ఉవ్విళ్ళూరుతున్నామని జనరంజని వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్న తాయి సంఘానికి అభినందనలు తెలిపారు.

తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీని కట్ట మాట్లాడుతూ తెలుగువారందరూ కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రేక్షకులకు, ఆర్ధిక సహయాన్నందించిన వ్యాపార సంస్థలకు మరియు స్వచ్చంద సేవకులకు తెలుగు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
IMG-20171107-WA0028
IMG-20171107-WA0030 IMG-20171107-WA0031 IMG-20171107-WA0032

Send a Comment

Your email address will not be published.