జాషువా - పద్య మాలిక

సీ॥ మెరయింపవలె తెల్గుదొరసానిమొగసాలి ఆంధ్రరాష్ట్రంబు సింహధ్వజంబు,
పట్టింపవలె ఆంధ్రపౌరుషలక్ష్మికి కుచ్చుల నీలాల గుబ్బగొడుగు,
సవరింపవలె ఆంధ్రసాహిత్యకన్యకు కడచన్న తొంటి బంగారుభిక్ష,
కావింపవలె ఆంధ్రగానకల్యాణికి త్యాగరాజన్యుని దర్శనంబు,
అరులనదలించి బ్రహ్మనాయకునికోడి పలికి పోయిన ధైర్యసమ్పద్విభూతి
పెంపునెత్తావివలె గుబాళింపవలయు కలసి రావోయి రాష్ట్రదీక్షాతపస్వి!