జ్ఞానం - అజ్ఞానం

జ్ఞానం - అజ్ఞానం

ఒక కవి అంటాడు….దయాసాగరా, నిన్ను దీపంతోనా ధూపంతోనా లేక పువ్వులతోనా ఆరాధించాలి?

ఆరాధన అనేది నా తెలియనితనంలో నుంచే వచ్చింది అన్నాడు ఆ కవి…

తెలిసినతనం పరిశోధిస్తుంది. అది ఆరాధించదు. తెలియనితనం ఆరాధిస్తుంది.
శోధనలో తెలిసింది ఆరాధనకు నోచుకోదు. తెలుసుకోనిదే ఆరాధింపబడుతోంది.

ఏది తెలిసొస్తోందో అది భగవంతుడు కాదు. తెలియకుండా పోవడానికి అజ్ఞానమే ఆరాధన.

దేవుడికి సంబంధించినంత వరకు తెలుసుకున్నాను అనే వాడు అజ్ఞాని అవుతాడు. దేవుడు చీకటిలా మార్మికుడు. మనిషి జ్ఞానం దీపం లాంటిది…దీపం చీకటిని ఎరగదు. జ్ఞానం దేనినైనా ఆలోచించే చేస్తుంది. ప్రశ్నిస్తుంది. జవాబు కోసం అదే పనిగా కృషి చేస్తుంది. ఇక ఆరాధనకు సమయం ఎక్కడ ఉంటుంది?

జ్ఞానం పువ్వుని పువ్వులా చూడదు. రేకులు, పుప్పొడి, తొడిమ, అంటూ పువ్వు గుణగణాలను శోధిస్తుంది. ఆ అధ్యయనంలో పువ్వు కనిపించదు. పువ్వుతోపాటే దాని అందం, కవిత కనిపించకుండా పోతాయి. ప్రపంచాన్ని పరిశోధన మార్గంలో చూసే వ్యక్తికి దేవుడు కనిపించకుండా పోతాడు. అయితే అజ్ఞానం అలా ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి చూడదు. అలా చూడని అజ్ఞానాన్ని చూస్తాడు దేవుడు. అందుకే అనాలనిపిస్తుంది అజ్ఞానమే ఆరాధన అని.

జ్ఞానం ఎందుకు ఆరాధించాలి ? అని ప్రశ్నిస్తుంది. అజ్ఞానం అలా అడగదు. కానీ ఆరాధిస్తుంది.

జ్ఞానం సందేహిస్తుంది. సందేహం పుట్టిందో ఇక ఆరాధనకు చోటు ఉండదు.
అజ్ఞానం ప్రేమిస్తుంది. ఆ ప్రేమే ఆరాధన.

అమ్మా …. తల్లీ అని బిచ్చగాడి పిలుపు వింటే జ్ఞానం “పాత్ర ఎరిగి బిక్ష వెయ్యి” అని చెప్తుంది. అజ్ఞానం బిచ్చగాడి పట్ల జాలి పడుతుంది…. ఆ జాలి గుణమే ఆరాధన.

పురుషుడూ, స్త్రీ ప్రేమిస్తున్నారు…ఒకరికొకరు తెలియనందు వల్లే. తెలుసుకున్న తర్వాత ప్రేమ పోతుంది.
అందుకే పురుషుడూ, స్త్రీ పెళ్లి తర్వాత గొడవపడతారు.

తెలియని దాని మీదే ప్రేమ పుడుతుంది. ప్రేమే ఆరాధన.

తెలుసుకున్న దాని మీద ఏహ్య భావం పుడుతుంది. విసుగు పుడుతుంది.

తెలియని దానిమీదే ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటమే ఆరాధన అవుతుంది.

జ్ఞానం తృప్తి పడదు. అజ్ఞానం తృప్తి పడుతుంది. తృప్తి పొందడమే ఆరాధన.

ఎంత పెద్ద జ్ఞానవంతుడైనా అతనికి తెలిసింది కొంచమే. తెలియనిదే ఎక్కువ. దేవుడు కొంచంలో లేడు. ఎక్కువలో అంటే తెలియని దానిలో ఉంటాడు అధికంగా….అలా ఉండటం వల్లే ఆ అజ్ఞానమే ఆరాధన అవుతుంది.

జ్ఞానం అహంతో కూడుకున్నది. అహాన్ని దేవుడు చూడడు. నేను అనేది తెలియని అజ్ఞాన స్థితే జ్ఞాన స్థితి. ఆ అజ్ఞానమే ఆరాధన.

అహం ఉన్న మనిషిలో అణకువ చూడలేము. అజ్ఞానంలో అణకువ ఉంటుంది. అదే ఆరాధన. అజ్ఞానం అంటే నిర్లక్ష్యం అనే ఒక్క అర్ధమే కాదు, కల్లాకపటాలు లేనివనే అర్ధమూ ఉంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనిషిలో కల్లాకపటాలు పెరుగుతాయి. దానితో ఆ మనసులో మురికి చేరడం మొదలవుతుంది. మురికి పట్టిన అద్దంలో ప్రతిబింబం కనిపించదు. మురికి పట్టిన మనసులో దేవుడు పుట్టడు. కనుక మురికి లేని మనసే మహేశ్వరుడు ఉండే నిలయం.

దేవుడికి మనం ఏం ఇవ్వగలం? మనం ఏది ఇవ్వాలనుకున్నా అవన్నీ ఆ దేవుడు మనకు ఇచ్చినవేగా. అటువంటప్పుడు మనం ఇస్తున్నది అతనిదే అతనికి ఇస్తున్నట్టు అవుతుంది. అలా తిరిగి ఇవ్వడం కానుక ఎలా అవుతుంది?

ఒక్కటి మాత్రం మనం కానుకగా ఇవ్వగలం. అదొక్కటే మనది….ఆ ఒక్కటీ అజ్ఞానమే. అందులో ఆరాధన ఉంటుంది…..

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.