తల్లడిల్లిన తల్లి మనసు

భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన మహాజ్ఞాని ఆదిశంకరాచార్యులు. వారు అల్పకాలంలో అనూహ్యమైన ఎన్నో కార్యాలు సాధించారు. అటువంటి మహనీయునికి జన్మనిచ్చిన పుణ్యదంపతులు ఆర్యాంబ, శివగురువు. వీరు కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి వాస్తవ్యులు. శంకరుల పిన్న వయస్సులోనే తండ్రి శివగురువు పరమపదించారు. ఆర్యాంబ సమర్ధవంతంగా శంకరుల రక్షణను, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. జ్ఞాతుల సహాయంతో శంకరులకు ఉపనయనం జరిపించి గురుకులంలో విద్యాభ్యాసానికి చేర్పించారు. ఏడవ ఏటనే శంకరుడు వేదవేదాంగాలను అభ్యసించి గురువులకే వుస్మయం కలిగించాడు. ఎనిమిదవ ఏట తల్లిగారి అనుమతితో ఆపత్సన్యాసాన్ని స్వీకరించి ఇల్లు వదిలి గురువును అన్వేషిస్తూ దేశ సంచారానికి శ్రీకారం చుట్టారు బాలశంకరుడు. ఫలితం ఆర్యాంబ ఒంటరిదయ్యింది. భర్త పోయాడు. బిడ్డ దూరమయ్యాడు. ఆ తల్లి వృద్ధాప్యంలో పుత్రుని ఎడబాటు సహించలేక అనుభవించిన మానసిక వ్యధ ఆమె మాటల్లోకి తలపుల్లోకి తొంగి చూస్తే మన గుండెలను తాకక మానవు.

ఇల్లు వదిలి వెళ్లి ఎన్నేళ్ళు అయ్యిందిరా శంకరా? ఎక్కడున్నావురా? గట్టిగా అరచి పిలవలేకున్నానురా…తల్లి ఉద్ధరించడం నీకు ముఖ్యం అనిపించలేదా? లోకులను ముక్తాత్ములను చేయడానికి ఈ వెర్రి తల్లిని వీడి వెళ్ళావు కదరా? మన ఊర్లో అందరూ యేమని చెప్పుకుంటున్నారో తెలుసా? శంకరుడు కాశీలో ఉంది ఎన్నో ఉద్గ్రంథాలను వ్రాస్తున్నాడని. ఎంతో కీర్తిమంతుదయ్యాడని. నాకు వారి మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. చాలాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాను నాన్నా. ఈశ్వర కృపతో కడుపారా కన్నా కన్నతల్లిని విడిచి వెళ్ళాడు శంకరుడన్న అపఖ్యాతి నీకు రాకూదదన్నదే నా బాధ. నాకు తెలుసు – నీకు నాపై గల అపారప్రేమ.

ఎండలో నీళ్ళు మోసుకుని వస్తూ సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నీవు కరుణించి గంగను నా పాదాల చెంతకు తెచ్చావు కదరా! ఆ కరుణ ఇప్పుడేమైంది? నాయనా! శంకరా! ఒక్కసారి కనిపించరా….ఇప్పుడు కడవలు నిండే కన్నీళ్లు మోసుకుంటున్నాను రా.

నీకు తెలుసా! లోకాన్నుద్ధరించే కొడుకుని కన్నావని అందరూ నన్ను మెచ్చుకోలుగా చూస్తున్నారు. చీకటిలో తడుముకుంటూ నడుస్తున్న నాకు నీవు చేతి ఆసరా కాకపోతివే అని ఏడుస్తున్నాను. గంజైనా త్రాగి నా ఎదుట ఉండక వేదాలు, విద్యలు అంటూ ఎందుకు అలమటిస్తున్నావు నాయనా! వారంతా చేసే సన్మానాలు నీ తల్లిప్రేమకు సరితూగుతాయట్రా? నా మాట వినరా …శంకరా!

అవును, నువ్వెందుకు వస్తావు? నేనీ చేతులతో నీకేం చేసాను?

పెళ్ళా? పెరంటమా? నా చేతులు దాటిపోయావు గాదురా తండ్రీ! చెరువులో మొసలి నన్ను పట్టిందమ్మా! అని నన్ను భయపెట్టి మాయ చేశావు కాదురా! శంకరా! నీకిది న్యాయమా!

తలవగానే నీ ముందుంటానని మాట ఇచ్చి వెళ్ళావు.

నిన్ను తలవనిదెప్పుడురా తండ్రీ? నన్ను మభ్యపెట్టడానికి అలా అన్నావు. అంతే కదూ! లేక నీ పాదయాత్రలలోను, భాష్యా రచనలలోను, ప్రౌడ వాదాల్లోను, తీరిక లేకుండా ఉన్నావా?

ఇంక ఈ శరీరాన్ని మోయలేను. ఒంటరితనాన్ని భరించలేను. నాకు ఆఖరి క్షణాలు ఆసన్నమయ్యాయి. అంతిమ ఘడియలలో నాతో ఉంటానన్నావు. వేగం రా రా శంకరా! అమ్మ మాట శంకరుని చెవిన పడింది. అమ్మ పిలుపు అందిన వెంటనే రెప్పపాటులో అమ్మ ఒడిలో వ్రాలాడు కన్నబిడ్డ.

ఇద్దరినీ కన్నీరుమున్నీరై ముంచేసింది.

తల్లీబిడ్డల అనుబంధం కట్టలు తెగి వేడి కన్నీరై ప్రవహిస్తోంది. “అమ్మా” అని పిలిచాడు శంకరుడు.

“శంకరం” అని అనాలని తల్లి తపిస్తోంది.

కానీ నోట మాట రాలేదు. కళ్ళతోనే పలుకరించింది. వచ్చేవా నాన్నా! అన్నట్లు చేతులుతో శంకరుని ఒళ్ళు నిమిరింది. శంకరుడు అమ్మ చేయి వదలలేదు.

కపిలుడు తల్లికి చేసిన తత్వబోధలాగా శంకరుడు అదే బాల శంకరుడు జగద్గురువు శంకరుడై తల్లికి ఆత్మా – పరమాత్మ తత్వాన్ని చెప్తుంటే వీనులవిందుగా బోధిస్తున్నాడు.

తల్లి తన పసివాడు పరబ్రహ్మతత్వాన్ని చెప్తుంటే ఆశ్చర్యంతో ఆనందంతో తదేకంగా పుత్రున్ని చూస్తూ ప్రశాంతంగా శాశ్వతంగా కన్నుమూసింది. హృదయ వేదన చల్లబడింది. శంకరుడు అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
తల్లడిల్లిన తల్లిమనసు శాంతించింది.

– అమ్మాజీ రాం