తెలిసి మసులుకో.. ఓ సామాన్యుడా!

పుట్టుకతో ప్రతి మనిషి
బాల్యాన బ్రహ్మ స్వరూపమైనా
నడకను నేర్చింది మొదలు
చదువు, సమాజ పరిపక్వతతో
పొందే,సంపాదించే అర్హత పట్టాలన్నీ
జీవితాన సంస్కారానికి గాక
సిరిసంపదల కొరకే అని
తలచి, స్వార్ధం వైపే నిలిచి
వ్యవస్థలోని వ్యత్యాసాలు
సమాజభివృద్ధి నిరోధకాలని
తెలిసి, కలిసిమెలిసి ఉంటూనే
కుల మతాల ఒకరినొకరు
స్వార్థం, అసూయాద్వేషాలతో
స్నేహం మాటున మోసాల పాల్పడే
దమననీతితోడ దానవమానవులు
కరుణ, దయ దేవుని గుణ గుణాలని
చేసిన పాపాలను కర్మ క్రతువుల
కడిగి, కమ్మని నైవేద్యాలని పెట్టి
దైవ ప్రసాదములని తిని బలిసి
మనిషిని మానవతతో చూడక
మనసుకన్న, మెదడుకు విలివిచ్చి
మాంత్రిక తాంత్రిక, యాంత్రిక జగత్తని
తెలిసి మసులుకో.. ఓ సామాన్యుడా!
సుమనస్కుడవైన నువు ఎప్పటికీ మారకు
ఎందుకంటే? భవిష్యత్తులో భావితరాలకు
మనిషికున్న మంచితనం తెలిపేందుకు
మానవసమాజ విలువలు కాపాడేందుకు