మాతృ భాషతోనే జ్ఞానాభివృద్ధి

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా…

TAAI_International Motherప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషలోనే భావోద్వేగాల అభివ్యక్తిని, జ్ఞానాభివృద్ధిని సమున్నతంగా సాధించగలమని మనం గుర్తించాలి. అదే సమయంలో తన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భాషీయుడి హక్కు అని, తన భాషను కాపాడుకోవడం ద్వారానే ఇది సాధ్యమని.
భాషను బట్టే జాతి గుర్తించబడుతుందన్నది నిర్వివాదాంశం అని కూడా గుర్తించాలి.

ప్రాంతాలను బట్టి, ప్రాకృతికతను బట్టి ఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారి వారసత్వాలను కూడా కాపాడుకోవాలని యునెస్కో సందేశం విశదపరుస్తోంది. ప్రపంచంలోని మౌలిక, వైరూప్య వారసత్వాన్ని రక్షించాలనే ప్రయత్నంలో భాగంగానే భాష విషయంలో యునెస్కో కృషి చేస్తోంది. సంప్రదాయ ప్రజా సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం – వీటిని రక్షించుకోవడం మాతృభాషల రక్షణతోనే వీలవుతుంది. మాతృభాషను కోల్పోతే వారసత్వంగా సాధించుకున్నదంతా కోల్పోయి, ఆ జాతి పూర్తిగా పరాయీకరణ పొంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది.

ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా మెల్బోర్న్ తెలుగు సంఘం అధ్వర్యంలో నడుపబడుతున్న “అక్షర జ్యోతి” బడి నిర్వాహకులు మాతృ భాష పరిరక్షణ విషయమై “Empowering Telugu language and Culture” అన్న శీర్షికతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత ఎదేమినిదేళ్ళుగా మన పిల్లలకు తెలుగు భాషను బోదిస్తూ రెండేళ్ళ క్రితం విక్టోరియా స్కూల్ అఫ్ లాంగ్వేజ్ వారి అనుమతిని పొంది ప్రతీ శనివారం పాయింట్ కుక్ సెకండరీ స్కూల్ లో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వివిధ వయస్సులో ఉన్న 150 మందికి పైగా పిల్లలు తెలుగును నిరంతరాయంగా నేర్చుకోవడం శ్లాఘనీయం.

వచ్చే రెండేళ్లలో తెలుగు భాషను ఇతర విదేశీ భాషలలాగానే విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ పాథశాలల్లో ప్రవేశపెట్టాలన్న అత్యున్నత సంకల్పంతో “అక్షర జ్యోతి” పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతుంది.

Send a Comment

Your email address will not be published.