అనువాదకులు (Translators) భాష్యకారులు (Interpreters) కావాలని అధికారిక ప్రకటన
వివరాలు: https://www.naati.com.au/
ఎంతోమంది భాషాభిమానులు గత అయిదేళ్లుగా అవిరామ కృషికి ఫలితం ఆస్ట్రేలియా తెలుగు భాషను గుర్తించడం. ఆస్ట్రేలియాలో తెలుగు భాషను గుర్తింపు తేవాలన్న ప్రధానోద్దేశ్యంతో 2014లో Federation of Telugu Associations in Australia (FTAA) స్థాపించడం జరిగింది. ఈ సంస్థ స్థాపించిన రోజు నుండి ఇప్పటివరకూ తెలుగు భాష గుర్తింపు విషయంలో ఎటువంటి సడలింపు లేకుండా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి గారు మరియు ప్రస్తుత అధ్యక్షులు శ్రీ శివశంకర్ పెద్దిభొట్ల వరకూ ఒక ఉద్యమంలా తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ రోజు National Accreditation Authority for Translators and Interpreters Ltd (NAATI) వారు తెలుగు భాషలో అనువాదకులు (Translators) భాష్యకారులు (Interpreters) కావాలని అధికారికంగా వారి వెబ్ సైట్ లో ప్రచురించే వరకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఎంతోమంది తమ పరిధిని మించి శాయిశక్తులా కృషి చేసి విజయకేతనం ఎగురవేశారు. వారందరికీ కృతజ్ఞాతాభినందనలు.
అయితే ప్రతీ కార్యసాధనలో ఉన్న ఒడుదుడుకులు ఇందులో కూడా ఎదురుపడ్డాయి. 2011 సార్వత్రిక గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడే వారు 7400 మంది మాత్రమే ఉండేవారు. 2016 గణాంకాల సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర సాధనాల ద్వారా తెలుగు మాట్లాడేవారందరికీ ‘మాతృ భాష’ తెలుగని వ్రాయాలని కోరడం జరిగి ఈ సంఖ్య గణనీయంగా పెరిగి ప్రస్తుతం 34,435కి చేరుకుంది. ఇంకా ఈ సంఖ్య అనధికారిక తెలుగువారి సంఖ్యలో సగమే ఉండవచ్చు. వచ్చే 2021లో జరగబోయే గణాంకాల సమయంలో అందరూ ‘మాతృ భాష’ తెలుగని వ్రాస్తే మరింత బలం చేకూరుతుంది.
ఈ ప్రక్రియలో తెలుగుమల్లి లో పలుమార్లు వ్యాసాలు కూడా ప్రచురించడం జరిగింది.
జూన్ 2016 – సమైక్యతకు పునాదిరాళ్ళు
జూలై 2016 – అమ్మ భాష తెలుగే
అక్టోబర్ 2017 – అమ్మ భాషే మన ఆయుధం
జనవరి 2019 – ‘తెలుగు’ కమ్యూనిటీ భాషే లక్ష్యం
NAATI వారు కొన్ని నిర్దేశిత సూత్రాలతో కూడిన నిబంధనలు ఈ క్రింది లంకెలో సూచించారు. వాటిననునసరించి ధ్రువీకరణ పత్రాలను పొందగలిగితే అనువాదకులు (Translators) మరియు భాష్యకారులు (Interpreters) గా గుర్తింపు పొంది ప్రాక్టీసు చేసుకునే అవకాశం ఉంటుంది.
https://www.naati.com.au/certification/recognised-practising/
ఈ వృత్తిలో అభిరుచి వున్నవారంతా పైనుదహరించిన లంకెను సందర్శించి తగు ప్రయత్నాలు చేయగలరని మనవి.
నాటి వారి గుర్తింపు ప్రక్రియ ఎలా ఉంటుందో ఈ క్రింది ఆకృతిలో చూడగలరు.
ప్రస్తుతం తెలుగుభాషలో అనువాదకులు కానీ భాష్యకారులు కానీ ధ్రువీకరణ పత్రాలను పొందినవారు లేరు. ఎవరైనా ఈ దిశగా వెళ్లాలనుకునే వారు నాటి వారిని సంప్రదించి తగు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
తదుపరి అడుగులు…
పైన వివరించిన విషయాలు మన తెలుగువారందరికీ తెలియజేయడానికి సామాజిక మాధ్యమాలు ఉపయోగించడమే కాకుండా ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో NAATI వారి సౌజన్యంతో వచ్చే రెండు నెలల్లో సమావేశాలు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది. అందరూ ఈ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలని మనవి.
పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం 5 పాయింట్లు (Credential Community Language)
ఇంతకు మునుపు తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తింపు పొందితే పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసే ప్రతీ తెలుగు వ్యక్తీకి 5 పాయింట్లు ఉచితంగా ఇస్తారని ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పద్ధతిలో కొన్ని మార్పులు చేయడం జరిగిందని NAATI, CEO శ్రీ మార్క్ పెయింటింగ్ తెలిపారు. దానికోసం ప్రత్యేకంగా మరో దరఖాస్తు పెట్టుకోవలసి ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వ పరంగా నిర్దేశిత ప్రణాళికా క్రమాన్ని ప్రారంబించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.