తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం

తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం

తెలుగు సాహిత్యంలో చెరగని ముళ్ళపూడి సంతకం
– జూన్ 28, ముళ్లపూడి వెంకటరమణ జయంతి

ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం.

ముళ్లపూడి వెంకటరమణ జూన్ 28, 1931న ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్‌ కీపర్‌. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజింగ్‌ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్‌ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు.

అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు.

ముళ్ళపూడి-తన బతుకూ, దానికి తెరువూ కూడా రచనే అని నమ్మి- అందుకు గమ్యమైన చెన్న పట్నానికి తల్లి తో పాటు వలస వెళ్లారు. 1945 లో బాపుతో చెయ్యి కలిపారు. ఆంధ్ర పత్రికలో చేరి, రచనా దీక్ష ఆరంభించి, అచిరకాలంలోనే తన విలక్షణమైన రచనా శైలితో సాహితీ ప్రియులందరికీ అత్యంత ప్రేమ పాత్రులైనారు.

“బాపూ రమణల కలయిక తెలుగు వారి అదృష్టం” అనిపించే రీతిలో; కష్టం, సుఖం కలబోసుకుంటూ; ఆత్మీయత, ప్రేమ పంచుకుంటూ; స్నేహం, గౌరవం పెంచుకుంటూ; వారిద్దరి అనుబంధం అరవై అయిదేళ్ళు కొనసాగింది. బాపు బొమ్మలు, రమణ రచనలు – అవినాభావ సంబంధంతో పాఠకుల హృదయాలలో ఆత్మీయ స్థానం సంపాదించుకున్నాయి.

స్కూల్ ఫైనల్ తో చదువు ఆపేసిన ముళ్ళపూడి, తన రచనలతో తెలుగు వారి అభిమానం తో బాటు, రెండు విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు అందుకున్నారు. సంతకం లేకుండా రాసినా, కలం పేర్లతో రాసినా, “ఇది ముళ్ళపూడి రచనే” అని గుర్తుపట్టేలా రాయటం ఆయనకే చెల్లింది. అలా రాయడం ఆయనకి ఓ సరదా. “మంచి రచనకు అది గీటురాయి” అని నమ్మకం కూడా.

పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం
ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి.

సినీరంగానికి మలుపు..
ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్‌ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్‌ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్‌ మూగమనసులు.. మూడూ సూపర్‌ హిట్‌ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు.

సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో రమణ కన్ను మూశారు.

కధలు, నవలలు, వ్యాసాలు, సినిమా రచనలు, అనువాదాలు, జీవిత చరిత్రలు, టీవీ సీరియల్స్, వీడియో పాఠాలు – ప్రక్రియ ఏదైనా, విషయం ఏదైనా- ముళ్ళపూడి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ-కోపం, సుఖం-దుఃఖం, సంతోషం-బాధ, సహనం-అసూయ, సంపద-లేమి, గెలుపు-ఓటమి, తృప్తి-ఆకలి, కారుణ్యం-కక్ష… ఈ ద్వంద్వాలన్నిటితోనూ కూడిన జీవితాన్ని పరిశీలించి, పరిశోధించి, మధించి సాధించిన జీవనసారం ఈ కధలు.

జీవితాన్ని ఆసాంతం అమితంగా ప్రేమించి, అనుభవించి, పరిపూర్ణంగా ఆస్వాదించిన ఒక వ్యక్తి, అరవయ్యేళ్ళ నాడు రాసిన ఈ కధలు ఏ నాటికైనా నిలిచే శాశ్వత సత్యాలు. కాబట్టే ఈనాటికీ సజీవంగా ఉండి, నాలుగో తరం పాఠకులను కూడా అలరిస్తున్నాయి.