దాంపత్య సుధ

వైవాహిక బంధాన ఒకటిగా
వొదిగిపోయి కోటి కోర్కెలు మేటి ఊహల,
ఓలలాడు జంటకు
తొలి తొలి దినాలు తొలకరి వలపులు,
తన్మయమైన తలపులు ,
తామర తంపరలు ,తీపి తీపి దాంపత్య సుమాలు ॥ వైవాహిక॥

జిలిబిలి పలుకులు
గల గల నవ్వులు వలపుల కులుకులు ,
తళుకు బెళుకుల జల్లులు
అరమరికలు లేని ,ఏ ఎల్లలు లేని
సరస సరాగాల విరాజిల్లి మైమరచి పోవు
అనురాగబంధం దాంపత్య బంధం ॥ వైవాహిక॥

మల్లి జాజి,పరిమళములు,
మోహావేసాల ,ప్రణయవల్లరి,
గుండెలోతుల గండు తుమ్మెద ,
మధుర ఝంకారాల మరులు
పొంగిపొరలు మనసు అంచుల
మరులవిరులు మధుర
తావుల అల్లుకుపొవు॥ దాంపత్యబంధం ॥

అరక్షణం ప్రణయకలహం
మరుక్షణం విరహతాపం ,
మరింత తీపి కలయికల
మృదు మధుర దీపికలు
దాంపత్య జీవిత శుభారంభ స్వర్ణక్షణాలు,
అరుదౌ దివారాత్రులు ॥ వైవాహిక ॥

మలిదినాలు,
ప్రణయఫలాల ప్రవేశం,ముద్దుముచ్చట్లు ,
మురిపాలు సరదాలు,
ఆలనా పాలనా ,ఎదిగే బిడ్డల
విద్యాభ్యాస వికాసములు,
వివాహాది శుభములు,
వింత వింత క్షణాలు,
చింతా వంతలు చిరు చిరు తగాదాలు ,
చిరాకు పరాకులు,॥ దాంపత్య బంధం॥

పెరిగే బరువు భాద్యతలు,
సమస్యలు పరిష్కారాలు,
సంసార సాగర తరంగ ఈదులాటలు,,
పరస్పర పలకరింపే
మృగ్యమై విసిగి వేసారి
అరుదుగా అందిన అపురూప క్షణాలే
మనసు మమతలు పంచుకునే సుమసుగంధ సీమ
వివాహబంధ మలిదినాల వైభోగం,। దాంపత్య బంధం॥

కష్ట సుఖాలు, కలబోసుకు కరిగిపోవు
కలకండ తీపి,కాకర చేదు తోయం
మమతానురాగ దాంపత్య ,
మలిదినాల మాధుర్యం . ॥ వైవాహిక॥

అనుంగు బిడ్డలా ఉన్నతస్థితికి జేర్చి,
సమస్యల సాగరమీది ,
సేదతీరు వేళ
ఎదిగిన బిడ్డలు విహంగములవొలె వీడిపోవగా ,
అలనాటి ఏకాంతము దరిజేరినా,
అలనాటి మోహావేశాలు,
వలపుటూహలు, మరుగునపడి
సదా సంతాన చింతనలో మమతాను బంధాలు,
మమకారాలు మనసుల నిండగ ,
పెనవేసుకు పోవు ॥ వైవాహిక॥

అంద చందాలకు
ఆవేశ కావేషాలకు ,తావు లేని ,
మొహావేశాల పాల్పడని ముచ్చటైన
మూడవ దాంపత్య మహర్దశ॥ వైవాహిక ॥

నీవే నేను నేనే నీవను
తొలినాటి బాసలు ఊసులు ,
నీకు నేను నాకు నీవుగా అంతర మంది
పరిపక్వ ఏకత్వ భావాల అల్లుకుపొవు
పూల పందిరి ,॥ దాంపత్య ॥
నిన్న మొన్నటి మధురానుభవాల
నెమరు వేతలో ఒదిగిపోయిన అంతరంగాల
తన్మయతలో అలసి సొలసిన
హ్రుదయాంతర్గత
మృదు మధుర అమృతకలశం ,
సంపూర్ణ ఆదర్శ దాంపత్యం॥వైవాహిక॥

కామేశ్వరి సాంబమూర్తి.భమిడిపాటి